17, మార్చి 2013, ఆదివారం

'నా జీవన గమనంలో ..... '

రాముడంటే అమితప్రేమ. హనుమాన్ అంటే అపారభక్తి. చిన్నప్పుడు (నేను ఆరవతరగతి చదువుతున్నప్పటి నుండి) భారత రామాయణాది గ్రంధాలతో పాటు వివిధ పుస్తకాలు మా తాతయ్యగారి కోసం (తనకి దృష్టిలోపం కలగడంతో) చదివి వినిపించడం అలవాటు అయింది. నేను చదువుతుండగా మధ్యమధ్యలో తాతయ్యగారు విశ్లేషణల వలన నాలో భగవత్భక్తి కలిగి కొంత అవగాహన ఏర్పడినప్పటికీ, అది పరిమితంగానే యుండేది. వివాహానంతరం - వ్రతాలు, పూజలు ... ఇత్యాదులు పెరిగినను అవి స్వలాభం కోసమే.  కాలక్రమేణా నిజమైన భక్తి కుదురుకున్న, 2003 కార్తీక మాసంలో జరిగిన ఓ దివ్యానుభవం వలన, అప్పటినుండి నిస్వార్ధ భక్తి చిగురించింది. అప్పటినుండే ఆద్యాత్మిక చింతన ప్రారంభమై, భగవత్ స్మరణ స్వలాభం కోసం కాక, భగవంతుణ్ణి భగవంతునికై భక్తిత్వముతో ఆరాధించడం అలవాటైంది. ఆధ్యాత్మికత, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలన్న తపన నాలో కల్గి, ఆ దిశలో జీవనయానం ప్రారంభించాను.
నాబాధ్యతలు, కుటుంబనేపధ్యం, ఒకంతట ఎక్కడికీ కదిలివెళ్ళే తత్త్వం నాలో లేనందున, గురువుని ఆశ్రయించడం, సత్సంగాలకు వెళ్ళడం నాకు కుదరనివి. అందుకే రామాంజనేయుల్నే శరణువేడాను.
మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు:
ర్నాన్యం జానే నైవ జానే న జానే

రాముడు నా తల్లి. రామచంద్రుడు నా తండ్రి. రాముడు నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వం. అతనిని వినా నేను మరెవరిని ఎంతమాత్రమూ ఎరుగను.
మనోజవం మారుతతుల్య వేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానర యూధముఖ్యమ్
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే

మనస్సమానగతితో వాయుసదృశవేగంతో పరమజితేంద్రియుడై శ్రీమంతులలో శ్రేష్టుడైన పవననందనుడు, వానరాగ్రగణ్యుడు అయిన శ్రీ రామదూతను నేను శరణు వేడుచున్నాను.

ఇక అప్పటినుండి ఆధ్యాత్మికపరమైన ఏ పుస్తకం లభ్యమైన ఆ పుస్తకం రామానుగ్రహం అని త్రికరణశుద్ధిగా భావించడం, గురు
వుని పుస్తకరూపేణా నా రాముడే నాదరికి పంపారని విశ్వసించడం, ఆ మధురానుభూతితో ప్రీతిగా చదవడం అలవడింది.
నా జీవనగమనంలో ఎన్నో ఎనెన్నో సందేహాలు... అవన్నీ రామునికి విన్నవించుకోవడం... కొద్దిరోజుల్లోనే నాదరి చేరిన పుస్తకాల్లో ఆ నా సందేహాలకు సమాధానాలు దొరకడం... ఇది ఓ అనిర్వచనీయమైన రామానుగ్రహం. ఆ పుస్తకాలను నాకు అందజేసిన, అందజేస్తున్న మావారు మరియు నా మిత్రులే నా సత్సంగీయులు.
ఈ నా ఆధ్యాత్మికపయనంలో పుస్తకరూపేణా వచ్చి నన్ను అనుగ్రహించిన గురువులు - శ్రీ రమణమహర్షి, శ్రీ మలయాళ స్వామి, బుద్ధుడు, రామకృష్ణపరమహంస, జిడ్డు కృష్ణమూర్తి, వివేకానందులు, పరమహంస యోగానంద, యోగి వేమన, స్వామీ రామతీర్ధ ... మొదలగువారు.
మనిషన్నాక కష్టసుఖాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, ఆయా కష్టసుఖాలను మనిషి స్వీకరించే విధానంలోనే ఒకొకరిది ఒకో పద్ధతి. కానీ; ఆ 'స్వీకరణ' లో 'పరిణతి'ని తీసుకువచ్చేదే "ఆధ్యాత్మిక చింతన". ప్రశాంతజీవానానికి ఆలంబన "ఆధ్యాత్మిక చింతన". మలినమైన శిలపైన జలం ప్రవహిస్తూ క్రమంగా దాని మురికిని ఎలా వదిలించి, మెరుపునిస్తుందో, అలానే "ఆధ్యాత్మిక చింతన" అనే గంగాజలం ఒక్కటే హృదయాన్ని ప్రక్షాళన చేసి, శుద్ధతను ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది.
ఏ ప్రారబ్ధం లేనిదే జన్మరాదంటారు మహర్షులు. జన్మంటూ ఎత్తాక సుఖదుఃఖాలు అనివార్యం. కాలం కష్టాల్ని ఇస్తుంది, సుఖాలనీ ఇస్తుంది. అలాగని అదేపనిగా కష్టాలనే ఇవ్వదు, తట్టుకోలేం కాబట్టి! అలాగే అదేపనిగా సుఖాన్నీ ఇవ్వదు, పట్టుకోలేం కాబట్టి! కాలపరిభ్రమణంలో ఇవన్నీ సహజం. చిన్నప్పటినుండి పుస్తకపఠనం, తాతగారి విశ్లేషణలు వలన ఇవన్నీ సహజమన్న విషయం అర్ధమైనప్పటికినీ, చింతలలో చింతన కోల్పోయేదానిని, తెలుసుకున్న ధర్మాలను, కర్మసిద్ధాంతాలను మరిచిపోయి దుఃఖవశురాలిని అయ్యేదానిని. చదివిన, విన్న శాస్త్రవచనాలన్నీ మనోమాయ మరుగున పడిపోయేవి. అయితే, కాలక్రమేణా ఆధ్యాత్మిక చింతన ఒకింత అలవడడంతో కొలది సమయంలోనే ఆ స్థితిలో నుండి లోలోన విచారణ జరిగి రియలైజ్ కావడం జరుగుతుంది.
అప్పటిలా ఇప్పుడూ, అప్పుడప్పుడు కష్టాలూ, మనఃక్లేశాలు కల్గుతున్నప్పటికీ, అవి (వాటివలన కలిగిడి బాధ) అంతే హఠాత్తుగా అదృశ్యమయ్యేవి - ఓ స్పురణ తో! ఆ స్పురణకు ప్రేరణ మహాత్ముల మాటలే. అలా స్పురణ లోనికి వచ్చి ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ నా సందేహాలు తీర్చి, ప్రశాంత జీవనాన్ని నాకు అలవర్చిన మహాత్ములందరికీ ప్రణమిల్లుతూ .....
ఏయే మహాత్ముల వలన నా సందేహాలు ఎలా తీరాయో ... ఒకొకటిగా స్మరణలో స్మరించుకోవాలనిపించి, 'నా జీవన గమనంలో ..... ' అన్న శీర్షికను ప్రారంభిస్తున్నాను.
తదుపరి టపాలో నా జీవనగమనంలో ...  'శ్రీ రమణమహర్షి' వారి గురించి ప్రస్తావిస్తాను.

12 కామెంట్‌లు:

 1. భారతి గారు, తప్పకుండా రాయండి.
  చదివి నా సందేహాలు కూడా తీర్చుకోటానికి ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 2. మంచి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనలు. రామానుగ్రహంతో చక్కగా వ్రాయగలరు.

  మార్గేమార్గే శాఖినాం రర్నవేదీ
  వేద్యాంవేద్యాం‌ కిన్నరీ బృందగీతమ్
  గీతేగీతే మంజులాలాపగోష్ఠీ
  గోష్ఠ్యాంగోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర.
  ( శ్రీశంకరులవారి శ్రీరామకర్ణామృతం నుండి)

  రిప్లయితొలగించండి
 3. భారతి గారు, ఎంతో చక్కటి విషయాన్ని తెలియజేసారు.
  మీకు ధన్యవాదములండి.

  రిప్లయితొలగించండి
 4. జలతారువెన్నెల గారు!
  అన్నీ కాకపోయినా, కొన్నయినా వ్రాయాలని ఉంది.
  మీ స్పందనకు ధన్యవాదాలు.
  మీ లేడీ బాస్ మూడు భాగాలు చదివాను. సస్పెన్స్ కు తెర తీయగా రాదా...

  రిప్లయితొలగించండి
 5. శ్యామలీయం గారు!
  మీ స్పందన చాలా ఆనందాన్నిచ్చింది. మీ అభినందనలు రామానుగ్రహం.
  ధన్యవాదాలు సర్.

  రిప్లయితొలగించండి
 6. అనూరాధ గారు!
  మీ స్పందనకు ధన్యవాదములండి.

  రిప్లయితొలగించండి
 7. రుక్మిణి గారు!
  మీకు నా ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 8. మీ హృదయానుభూతిని తప్పని సరిగా ఆవిష్కరించండి భారతి గారు మనసే మందిరం అనుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో మీ జీవన శైలి ఎంత నిర్మలం గా సాగుతుందో తెలుసుకోవాలని చాలా చాలా ఆసక్తిగా ఉంది తప్పకుండా చదువుతాను మీరు ఉదహరించిన ఈ ఒక్క వాక్యం చాలు భగవతారాధన ఎంత అవసరమో చెప్పేందుకు . మనసారా ధన్యవాదములు

  నాకు బాగా నచ్చిన ఈ వాక్యములకు నమో నమః


  "మలినమైన శిలపైన జలం ప్రవహిస్తూ క్రమంగా దాని మురికిని ఎలా వదిలించి, మెరుపునిస్తుందో, అలానే "ఆధ్యాత్మిక చింతన" అనే గంగాజలం ఒక్కటే హృదయాన్ని ప్రక్షాళన చేసి, శుద్ధతను ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది." _/\_

  రిప్లయితొలగించండి
 9. వనజ గారు!
  మీ అమూల్య స్పందనలతో నన్ను ప్రతీసారి ప్రోత్సహించడం ... ఆనందంతోపాటు నూతన శక్తిని యిస్తుందండి.
  ఎదుటివారిని ప్రోత్సహపరుస్తూ, ఉత్సాహాన్ని కల్గించే మీ సద్గుణంకు ... నమో నమః
  మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి
 10. భారతి గారు,
  బాగా చెప్పారు.

  -వంశీ కృష్ణ

  రిప్లయితొలగించండి
 11. వంశీ కృష్ణ గారు!
  మీ స్పందనకు ధన్యవాదములండి.

  రిప్లయితొలగించండి