29, జులై 2013, సోమవారం

మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' తో కాసేపు కబుర్లు చెప్పడానికి ఎప్పటిలానే ఈరోజు కూడా నా స్నేహితురాలు హరిప్రియ విచ్చేసింది.
ఓ ... అసలు విషయం చెప్పడం మరిచా -
చిట్టితల్లి 'శ్రీ మాన్వి' నా ప్రియమైన మనుమరాలు. మే నెల పంతొమ్మిదవ తారీఖున జననం. అమ్మని అయినప్పటికంటే అమ్మమ్మని అయినప్పుడానందం అధికంగా అద్భుతంగా  ఉంది. అదేమిటో గానీ, అన్ని బందాలకంటే ఈ అనుబంధం అపురూపంగా అద్వితీయంగా అనిర్వచనీయంగా ఉంది. 
రోజూ వచ్చి, శ్రీ మాన్వితో కాసేపు గడిపే నా స్నేహితురాలు ఈరోజూ వచ్చింది. తను వచ్చిన కాసేపటికి చిట్టితల్లికి వెక్కిళ్ళు రాగా -
'ఓహో! శ్రీ మాన్వి! దొంగతనంగా వెన్న తిన్నావా? ఏం తిన్నవురా మాన్వీ ... వెక్కిళ్ళు వస్తున్నాయి?' అని అంటుంటే -
ఎందుకలా అంటుందో అర్ధంకాక, తనని అదేమిటట అని ప్రశ్నించగా -
సరైన కారణం తెలియదు గానీ, పిల్లలకు వెక్కిళ్ళు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఇలా అనేవారు, అని చెప్తూ ... భారతీ! నీ చిట్టితల్లి ఎవరింటికెళ్ళి "చిన్నికృష్ణు"నిలా వెన్న దొంగతనం చేసిందంటావ్? అని అడుగుతూ ... నీకు తెలుసా ... చిన్నికృష్ణుని చోరత్వంలో అంతరార్ధం? అని ప్రశ్నించింది. 

                              


     నవనీత చోరత్వం - అంతరార్ధం
 








ఏమిటేమిటీ ... చోరత్వంలో కూడా ఆధ్యాత్మిక అంతరార్ధం ఉందా? తెలియదు, చెప్పమని నేనడగగా; తనకి తెలిసింది చెప్పిందిలా -
శ్రీకృష్ణుడు గీత ద్వారా జ్ఞానాన్ని ప్రబోధించడమే కాదు, తన బాల్యచేష్టలద్వారా వేదాంత రహస్యాలను ప్రదర్శించేవాడని మా తాతయ్యగారు చెప్తుండేవారు. ఓసారి ఈ నవనీత చోరత్వం గురించి చెప్పారు. 

                      
నవనీతం అంటే వెన్న. ముందుగా ఈ వెన్న ఎలా తయారౌతుందో గమనించమన్నారు. గోవు నుండి ఓ కుండలోనికి పాలు తీసి, బాగా కాచి, పొంగినపాలను చల్లార్చి, అందులో కాస్తా మజ్జిగ లేదా పెరుగును చేర్చి, పెరుగయ్యాక దానిని కవ్వంతో చిలకగా వెన్న వస్తుంది కదా. అలా వచ్చిన వెన్నను కృష్ణ పరమాత్మ దొంగలించాడు అంటే, అందులో ఓ పరమార్ధం ఉంది.
గోవు సత్త్వబుద్ధికి ప్రతీక. సాధకుడు గోవులాంటివాడు. కుండ సాధకుని హృదయం. సాధకుని మనస్సు స్వచ్ఛమైన తెల్లని పాలవంటిది. భక్తిత్వ తపనతో సాధకుని పాలవంటి శుద్ధమనస్సు వేడి ఎక్కగా, పాలమాదిరిగా పొంగిన మనస్సు తీవ్రసాధనతో చల్లబడి(అణిగి)నప్పుడు  కాస్తంత ధ్యానమును తోడుగా చేర్చితే, ప్రవాహశీలం లేని పెరుగులా గట్టిగా ముద్దగా తయారౌతుంది. ఇప్పుడు ఆ పెరుగు ఉన్న కుండ(హృదయం)లో కవ్వం పెట్టి చిలకడానికి కవ్వం కావాలి. కవ్వం, కవ్వంకు కట్టిన త్రాడు సాధనాలు. కవ్వం అంటే విచారణ. {అంటే శోధన, జ్ఞానవిచారణ (శ్రీరమణులు చెప్పినట్లు), తత్త్వవిచారణ}. త్రాడు అంటే ఏకాగ్రత. ఈ రెండింటి సాయంతో చిలకగా, చిలకగా {మధించగా మధించగా(అంతర్మధనం)
}, అప్పుడు పూర్ణత్వం అనేది వెన్న వస్తుంది. అదే నవనీతం. అలా నవనీతంతో మన హృదయం పూర్ణత్వం నింపుకున్నప్పుడు మనకు తెలియకుండనే శ్రీకృష్ణుడు వచ్చి అపహరిస్తాడు. ఇక్కడ ఓ సందేహం రావచ్చు. శ్రీకృష్ణుడుకి వెన్న కరువా? అయినను గోపికలకి కృష్ణుడంటే అమితప్రేమ కదా, వెన్నని అడిగితే గోపికలు ఇవ్వరా?  దానికి దొంగతనం చేయడం ఎందుకు? ఇప్పటికీ వెన్నదొంగ అని అనిపించుకోవడం ఎందుకు? అన్న  సందేహం రావచ్చు. కృష్ణుడు అడగడం, మనమివ్వడం అంటే అడుగేవాడు ఒకడు, ఇచ్చేవాడు ఒకడు ఉన్నట్లే. మనమివ్వడం అంటే ఇవ్వడానికి 'నేను' అన్న ఒకరున్నట్లే. 'నేను' అన్న భావన ఉంటె అది పూర్ణత్వం కాదు. ద్వైతం లేనిస్థితే పూర్ణత్వస్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండనే పరమాత్మ మనలో ప్రవేశించి తనలో ఐక్యం చేసుకుంటాడు. అపహరించడం అంటే ఇదే.
అటువంటి పూర్ణత్వస్థితికి మనం రాగలగాలి. అప్పుడు మనం సంసారంలో వున్నను పూర్ణత్వస్థితిలో ఉన్నట్లే. ఎలాగంటే, పాలు నీళ్ళలో కలుస్తుంది. కానీ; వెన్న నీటిలో తేలుతుంది. అట్లాగే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం సంసారంలో ఉన్నా, దాన్ని అంటక పూర్ణత్వస్థితిలో ఉన్నట్లే.
అలానే ప్రతీ ఇంటికి వెళ్లి కుండలు బ్రద్ధలు కొట్టడం అంటే దానికీ ఓ అంతరార్ధం వుంది. మనకున్నది దాచుకోవడానికి కాదు, ఉన్నది తీసి లేనివారికి సహాయం చేయాలనే సామాన్య సందేశంతో పాటు, పూర్ణత్వస్థితిలో పొందిన జ్ఞానాన్ని కుండలాంటి హృదయంలోనే దాచుకోకుండా అందరికీ పంచిపెట్టాలనే ధార్మిక అర్ధముందని తాతయ్యగారు చెప్పారు అని తను వివరించింది.
ఇంత మంచి విషయం వివరించిన నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన నా ముద్దుల మనుమరాలికి శుభాశీస్సులు.


4 కామెంట్‌లు:

  1. మీ ముద్దుల మనవరాలికి నా ఆశీస్సులు కూడా అందచేయండి. తన మూలంగా నేను కూడా ఇంత చక్కని విషయాలు తెలుసుకోగలిగాను.

    రిప్లయితొలగించండి
  2. జయ గారు!
    మీ ఆశీర్వాదం నా చిట్టితల్లికి శ్రీరామరక్ష!
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. భారతిగారూ! అద్భుతమైన ఆధ్యాత్మిక అ౦తరార్ధాన్ని, కృష్ణతత్వాన్ని వివరి౦చిన మీ స్నేహితురాలు ’హరిప్రియ’గారికి నా ధన్యవాదాలు.స౦దర్భానుసార౦గా విపులీకరి౦చి మాకు తెలియజేసిన మీకు మా అభివాదాలు. అసలు వెన్నదొ౦గ తత్వాన్ని చెప్పి౦చిన చిట్టితల్లి ’శ్రీ మాన్వి’కి అభిన౦దన శుభాశీస్సులు.

    రిప్లయితొలగించండి
  4. వేద గారు!
    మీ చక్కటి వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి