19, నవంబర్ 2013, మంగళవారం

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానం ఏమిటంటే ...

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానమిదే -
భారతీ! నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు ఓ పుస్తకంలో చదివిన కబీరుగారి ప్రబోధకీర్తన గురించి చెప్తాను. " సద్గురుకీ భిక్షా మాంగాయిరే బాల" అన్న కీర్తన పూర్తిగా నాకు గుర్తులేదు, కానీ, అందులో వివరించిన అర్ధం, అంతరార్ధం గుర్తుంది. సద్గురుకీ ప్రేమభిక్ష వేడుకోమని, చెప్తూ ఆ భిక్షకు అంగభూతములుగా నాలుగు భిక్షలను కబీరు నిర్వచించెను. మొదటిది గోధుమపిండి. ఇది అంగడికి గాని, పిండిమరకు గాని పోకుండా జోలెనిండ తేవలెను. రెండవది జలము. బావికి గాని, నదీతటాలములకు గాని పోకుండానే ఆనపబుర్ర నిండా తేవయును. మూడవది కట్టెలు. అంగడికి గాని, అడవికి గాని పోకుండా మోపెడు కట్టెలు తేవలయును. నాల్గవది దర్శనభిక్ష. మసీదు, దేవళములకు గాని, సాధు ఫకీర్ల వద్దకు గాని పోకుండా, ఉన్నచోటనే దర్శనం పొందవలెనని, అందుకై సద్గురుకి ప్రేమభిక్ష వేడమనే ప్రబోధం ఆ కీర్తనలో ఉంది. ఇప్పుడు ఈ కీర్తనలో అంతరార్ధం తెలుసుకుందాం. మొదట మూడు అంటే, పిండి, జలము, కట్టెలు రొట్టెను తయారుచేయుటను సూచించును. ఆ రొట్టెను తినినచో దర్శనం, దాని ఫలితంగా ప్రేమ లబింపవలయును. రొట్టెను తయారుచేయుటకు పిండి ముఖ్యపదార్ధం. కాని పొడిపిండిని తినలేం. అందుకే నీరు కావలయును, ఆ నీటితో పిండిని తడిపి, ముద్ద చేసి రొట్టెగా ఒత్తవలెను. అలా పచ్చిరొట్టెను తినలేం, దానిని కాల్చాలి. కాల్చడానికి కట్టెలు కావాలి. ఇలా సక్రమముగా తయారైన రొట్టెను తింటే ఆకలి తీరుతుంది. ఇక్కడ పిండి జ్ఞానం. దానిని భక్తి రసముచే (జలముచే) తడిపి మృదువుగా నొనర్చిన పిమ్మట నిష్కామ కర్మలను కట్టెలతో పక్వమొనర్చి  సక్రమముగా తయారైన ధ్యానమను రొట్టె ఆరగిస్తే ఆధ్యాత్మికక్షున్నివారణమగును. అప్పుడు ఉన్నచోటనే తత్క్షణమునే పరమాత్మ దర్శనమగును. అటుపిమ్మట అంతా పరమాత్మ ప్రేమతత్త్వమే. దానిని సద్గురువునివ్వమని వేడుకో... ఈ కీర్తనబట్టి ఆత్మసాక్షాత్కారానికి భక్తి, ధ్యాన, కర్మ, జ్ఞానమనే నాలుగూ అవసరమేనని అర్ధమౌతుంది. కాకపోతే ఈ నాలుగు యోగాలు అనుష్టించగలిగే శక్తి కారణజన్ములయిన మహాత్ములకే ఉంటుంది. మనలాంటివారికి ఇది అసాధ్యము కావున, ఏ యోగమార్గం ద్వారైన నను పొందవచ్చని గీతలో సూచించాడు. 

జీవకోట్ల సంస్కారములు అనేకవిధములు. జీవుల యొక్క పరిపక్వతా భేదములున్ను అనేక రకములు. వారి వారి భావనలబట్టి ఒక్కొకరికిని ఒక్కొక్కదానిలో ప్రవేశం కల్గుచుండును. కావున నిష్కామ కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం మొదలగు మార్గములు ఏర్పడినవి. దేహాంతరాలయములోనికి ప్రవేశించి ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ఈ నాలుగుమార్గాలు గోపురద్వారాలుగా ఉన్నాయి. ఈ మార్గాలలో ఏ మార్గం ద్వారైనను నిర్మలబుద్ధితో, నిష్కపట ప్రయత్నముతో ప్రవేశించి గమ్యస్థానమును చేరవచ్చును. అయితే, ఏ యోగమార్గములో ప్రవేశించినను, మిగిలిన మూడు మార్గాలు అందు అంతర్భూతమయ్యే యుండును. ఆంటే అంగభూతములుగా యుండును. ఈ నాలుగున్ను ఒకదానికి ఒకటి అన్యోన్య సంబంధం కల్గియే యుండును. జ్ఞానికి భక్తి, కర్మ, ధ్యానములు అంగభూతములుగా నుండును. అట్లే భక్తునికి కర్మ, ధ్యాన, జ్ఞానములూ; ధ్యానికి భక్తి, కర్మ, జ్ఞానములూ; కర్మయోగికి భక్తి, ధ్యాన, జ్ఞానములూ అంతరభాగములై యుండును. ఎలాగంటే, చీకటి నశించి ప్రకాశము కలుగుటకు దీపమే ప్రధానమైనను, దానికి ప్రమిద, తైలము, వత్తి ఎలాగున అవసరమో, అదేరీతిగా జ్ఞానజ్యోతి అయిన ఆత్మను దర్శించడానికి తక్కిన సాధనములు అవసరమే.
దైవోపాసనచే విక్షేపశాంతియు, శుద్ధమగు కర్మానుష్టానంచే అంతఃకరణశుద్ధియు, ధారణాధ్యానబలంచే సంయమనమును, జ్ఞాననిష్టచే ఆవరణరాహిత్యమును కలుగును. కనుక ఏ యోగమార్గమందైనను ఒకదానికి ఒకటి అనుసంధానింపబడే ఉంటాయి. 
భోజనం చేస్తున్నామంటే, దాని తయారికి బియ్యము మొదలగు పదార్దములు, అగ్ని, జలము, పాత్ర, కట్టెలు మొదలునవి ఎలా ఉన్నాయో, ఏ యోగం అనుసరించినను ఆ యోగంలో తక్కినవి అంగభూతములై ఉంటాయి. ఈ సూక్ష్మం అర్ధమైతే ఏది శ్రేష్టమన్న సందేహం ఉండదు ... అని నా నేస్తం 'హరిప్రియ' చెప్పింది.

9 కామెంట్‌లు:

 1. చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అనూరాధ గారు,
   మీ స్పందన తెలియజేసినందుకు మనసార ధన్యవాదములండి.

   తొలగించండి
 2. mee blog chaalaa baagundandee..ippude veelainanni post lu chadivaanu.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'Ennela' గారు,
   'స్మరణ' మిమ్మల్ని స్వాగతిస్తుంది.
   మీ ఆదరపూర్వక అభినందనకు ధన్యవాదాలండి.

   తొలగించండి
 3. శ్రీ సాయినాధుడు బోధించిన ప్రబోధము కూడా ఇదే!చాలా చక్కగా వివరించారు మీ స్నేహితురాలు.నేను కూడా ఓ రెండు మాటలు వివరిస్తాను!

  "గురువు అంటే భగవంతుని ధ్యానించినవాడు. అతడు తానింక భగవంతుని ఒకానొక ఉపకరణంగా మాత్రమే జీవిస్తాడు. అతని ముఖం నుండి అప్రయత్నంగా భగవద్వాక్కులే వెలువడుతాయి. అతడు చేయి ఎత్తితే భగవత్శక్తి దాని నుండి ప్రసారమై అద్భుతాలు జరుగుతాయి."

  "ధ్యానావస్థితుడైన జ్ఞానికి,కన్నులు,చెవులు తెరచి ఉన్నాగాని, అతని పూర్తిధ్యాస 'చూచేవాని ' మీదే ఉంటుంది గనుక, అతడు చూస్తున్నా చూడడు. వింటున్నా వినడు. దేహదృష్టి, మనోదృష్టి కూడా లేకుండా కేవలం ఆధ్యాత్మిక దృష్టిమాత్రమే కలిగి ఉంటాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేద గారు!
   బహుకాల దర్శనం ... బాగున్నారా?
   మీరు చెప్పిన ఈ రెండు మాటలు అమూల్యమైనవి. మీ ఈ చక్కటి వివరణకు హృదయపూర్వక ధన్యవాదాలండి.

   తొలగించండి
 4. శ్రీ కబీరు దాసులవారు చెప్పి నట్టి / కధన మత్యంత మధురావగాహవమ్ము / తమరి నెచ్చెలి హరి ఫ్రియ ధన్యతములు / స్మరణ భారతి లో తాను సాక్ష్య మిచ్చె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాస్టారు గారు!
   మీ అభిప్రాయం కొఱకై ఎదురుచూశాను.
   మీ స్పందనను తెలియజేసినందుకు, నేను మరియు నా నెచ్చలి మీకు ధన్యవాదాములు తెలుపుకుంటున్నాం.

   తొలగించండి
 5. శ్రీ భారతిగారికి, హరీప్రియగారికి, నమస్కారములు.

  చాలా చక్కని విషయాన్ని తెలియచేసారు. ధన్యవాదాలు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  రిప్లయితొలగించండి