16, డిసెంబర్ 2014, మంగళవారం

శివయ్యకు చలా?????

నిన్న ప్రక్కింటావిడ, వాళ్ళ అమ్మాయి హారిక మా ఇంటికి వచ్చారు. ఈరోజు హారిక పుట్టినరోజండి, అందుకే తెల్లవారుఝామునే శివాలయంకు వెళ్లి అభిషేకం చేశామండి ... అని చెప్తూ, తెల్లవారక ముందే లేచి, చన్నీళ్ళు స్నానం స్వాములు ఎలా చేస్తారో గానీ, ట్యాంక్ లో నీళ్ళతో స్నానం చేసేసరికి వణికిపోయానండి చలితో, అని ఆవిడ చెప్తుండగా ... హారిక నవ్వుతూ, మరి నీళ్ళను , ఫ్రిడ్జ్ లో పాలును శివలింగం మీద పోస్తున్నప్పుడు శివునికి చలెయ్యదా ఏమిటీ? అని ఆ అమ్మాయి అంటే, శివయ్యకు చలా????? అని నేను అనుకుంటుండగా చాలా సంవత్సారాల క్రితం ఓ మాసపత్రికలో చదివిన ఓ భక్తుని చమత్కారపు భావన గుర్తుకొచ్చింది.
ఆ భక్తుని చమత్కార భావన ఇదే -
ఇదెక్కడి విపరీతమయ్యా స్వామీ! నెత్తిమీద చల్లని చంద్రుణ్ణి పెట్టుకున్నావ్. అక్కడితో ఆగావా? అంతకన్నా చల్లనైన గంగమ్మను నెత్తికెక్కించుకున్నావు. ఆపైన తాకితే జివ్వుమనిపించే చల్లని పాముల్ని నగల్లా అలకరించుకున్నావు. అవన్నీ చాలవన్నట్లు మంచుకొండ కూతుర్ని ప్రక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ చోద్యపు చిన్నెలకు అంతెక్కడ? గజగజలాడించే కార్తిక మార్గశిరమాసాలలో బ్రహ్మీ ముహూర్తము నుంచే ధారపాత్ర కింద తిష్టవేస్తావు. అభిషేకం పేరుతో ఎప్పుడూ నీళ్ళక్రింద నానుతుంటావు. నీ భక్తులూ నీకు తగినవారే, ఈ శీతలోపచారాలకు తోడు నీ ఒళ్ళంతా చల్లని విభూది చందనాలను పూస్తూ ఉంటారు. అయినా నీకు చలెయ్యదా మహానుభావా? అని ఓ భక్తకవి శివున్ని ప్రశ్నించాడు. అంతలోనే ఆయనకే సమాధానం తట్టి, 'నా అమాయకత్వంకానీ, నీకు చలేమిటయ్యా? తాపత్రయాలతో సలసల కాగిపోతున్న నా హృదయంలోనే కదా నీవున్నావు' అన్నాడట. 

6 కామెంట్‌లు:

  1. నేను కూడా ఎప్పుడూ అదే అనుకుంటానండీ అభిషేకం పేరుతో ఇన్ని నీళ్లు శివయ్య పై పోసేస్తున్నాం శివయ్యకి చలేస్తుందేమో, జలుబు చేస్తుందేమో అని. అమ్మ చిన్న పిల్లాడికి స్నానం చేశాక శుభ్రంగా తల తుడిచినట్లు శుభ్రంగా తలంతా తుడిచేస్తే బాగుండేది ఇక జలుబు చేయదు అని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకోసారి మదిలో కదిలాడే భావనలు చాల తమాషాగా ఉంటాయి. మీ భావనలో భగవంతుని పట్ల ఆత్మీయత ఉంది.
      మీ స్పందనకు ధన్యవాదాలు మహిగారు.

      తొలగించండి