23, జులై 2015, గురువారం

ప్రేమమయం --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [నాల్గవభాగం]

గత మూడు టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాల్గవ చక్రమైన అనాహతచక్రం గురించి తెలుసుకుందాం -

అనాహతచక్రం :-
ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః 

ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ  అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం. 

హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని శబ్దబ్రహ్మం ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు. దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం చర్మం. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. 

ఈ చక్ర మానసిక స్వభావం :-
మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు. 

తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత వికసించటం. 

మనోమయకోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది. 

మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు రాకినిఅధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి. స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు  ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు. 

ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే - 
ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి. 
ఇక  ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలును, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది. 

తదుపరి చక్రం 'విశుద్ధచక్రం' గురించి తదుపరి టపాలో ... 


3 కామెంట్‌లు:

  1. In Lalitha it is said "మహావీరేంద్రవరదా రాకిన్యంబా స్వరూపిణీ". You have may be mistake entered it as KA kini which belongs to Swadhishtanam. Therefore you may please correct it as RA kini

    రిప్లయితొలగించండి
  2. శ్రీ అజ్ఞాతగారికి,
    నమస్సులు.

    ఈ చక్ర అధిదేవత 'కాకిని'గా పొరబడితిని. 'అమ్మ'కృపచే మీ వ్యాఖ్యతో నా తప్పిదమును గ్రహించి, ఈ చక్ర అధిదేవత "రాకిని" అని తెలుసుకొని, సరిదిద్దాను. గమనించగలరు.
    కృతజ్ఞతలతో ... మనసార మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. Dear Bharathi Garu,
    I congratulate you for being courageous, humble and setting aside the sweet little ego to make the correction in the said article. When I read your article, I being the ardent Lalitha Parayana for the past 11 years could not take it. Initially I felt that it could been just a typing error and wrote the same to you. But then you had your views(?). I felt bad that you didn't want to correct it. But then Mother Lalitha worked through you to accept the folly. Great. You are Blessed. Please continue to write articles. Best wishes - AGNATHA

    రిప్లయితొలగించండి