15, నవంబర్ 2015, ఆదివారం

మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!

మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!
ఆహా ... ఎంతటి భరోసా, ఎంతటి సౌఖ్యత, ఎంతటి భద్రత...
ఏ బంధము ఇవ్వగలదు... ఇంతటి హాయిని. ఇది ఒక్క స్నేహమునకే చెల్లుతుంది.

నిన్న వుదయం నా మిత్రురాలు 'హరిప్రియ' వస్తూనే అడిగిన ప్రశ్న 'భారతీ, స్నేహమంటే ఏమిటీ'?

అంతరంగమున అదో ఆత్మీయస్పర్శ, హృదయాన్ని తాకే ఆనందవీచిక, అపురూపమైనది, అమృతతుల్యమైనది, మదిని మురిపించే, మరిపించే మధురభావన. అంతా తానై లోలోన ఆత్మీయంగా కదిలాడే ఆ అవాజ్యనురాగభావం అనిర్వచనీయం. ఎంతచెప్పినా తక్కువే అయ్యేటటువంటి ఆ అద్భుతబంధంగురించి ఏమని చెప్పగలను... అందుకే  దానిని ఆస్వాదించగలనే తప్ప, వ్యక్తం చేయలేనురా అన్నదే నా ప్రత్యుత్తరం మయింది. అప్పుడు చూశా... తన కళ్ళలో కన్నీరు. ఏమైందిరా అని అనునయంగా అడగగా అడగగా ...
ఎంతో ఆధ్యాత్మిక అవగాహన, వాక్పటిమ, మంచిమనస్సున్న తన సత్సంగమిత్రురాలు ఓ విషయంలో సరైన మార్గంలో వెళ్ళడం లేదని, అందుకే తన శ్రేయస్సును కోరుకుంటూ, ఆ విషయమై వారిస్తూ, తప్పనిసరై పరుషంగా తనతో మాట్లాడానని, దానికై తను నాకు స్నేహమంటే ఏమిటో తెలియదని, స్నేహానికి వున్న విలువను గుర్తించడం నాకు చేతకాదని, ఇకపై నాతో మాట్లాడానని, నా స్నేహమే వద్దనేసింది... అని చెప్పింది.
అందర్నీ అర్ధం చేసుకుంటూ, అందరితో ఆత్మీయంగా మసులుకుంటూ, ఎవ్వరినీ, ఎప్పుడూ నొప్పించని స్వభావం నా ప్రియాకు పెట్టని ఆభరణం. అలాంటిది తనే పరుషంగా, చెలిమిలో స్పర్ధ కలిగేటట్లు మాట్లాడడమా ... ఆశ్చర్యంగా అన్పించి అదే అడిగాను. తన మేలు కోరి, తప్పక కటినంగా మాట్లాడానని అన్నది. స్నేహమనే కాదు, ఏ బంధంలోనయినా కటినంగా మాట్లాడితే ఆ బంధం బలహీనపడదా? అలా ఎందుకు చేశావమ్మా ... అని అడగగా, గతంలో సరళంగా చెప్తే తను విన్పించుకోలేదు, కాబట్టి కాస్త కరుకుగ్గా చెప్పాను, ఏం ... నీవు కూడా నాకు స్నేహం తెలియదని, స్నేహధర్మాలు తెలియవని, తప్పు చేశానని అంటావా అని అంటుంటే ...
లేదు నాన్న, నిజమైన స్నేహం అమ్మలా లాలిస్తుంది, ప్రేమిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది, రక్షిస్తుంది. గురువులా బోధిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ మువ్వురిలా తప్పుచేస్తే శ్రేయస్సు కోరి దండిస్తుంది. నీవు తన హితాన్ని కోరి ఇలా చేశావని తప్పక తను గ్రహించి, మరల నీదరి చేరుతుంది. బాధపడకురా, తాత్కాలిక మనస్పర్ధలు ఎదురైనా ఉత్తమమైత్రి బలపడుతూనే వుంటుందిరా...  అని నేననగా, తను నన్ను అర్ధంచేసుకున్నా, లేకున్నా; నాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా ... పర్వాలేదు భారతీ, నేను కోరుకున్న మంచి తనకి జరిగితే చాలు అని అంటున్నా ప్రియను చూస్తూ మనస్సులో ఇలా అనుకున్నా ... "ఎవరుంటారు మిత్రుల కంటే శ్రేయోభిలాషులు".

ప్చ్ ... తనను తననుగా గుర్తించి, అభిమానించి, ఆత్మసములుగా భావించి, ఆత్మీయంగా స్వీకరించే స్నేహితులుతో చిరు బేదాభిప్రాయం వచ్చిందనో, పరుషంగా మాట్లాడిందనో ఆ స్నేహంను వదులుకునే ముందు నన్ను నన్నుగా అభిమానించే ఫ్రెండ్ ఎందుకు అలా మాట్లాడిందో అవగాహన చేసుకోవడం మిత్రధర్మం.

కృష్ణ కుచేలల మైత్రి, రామసుగ్రీవుల మైత్రి చిరస్మరణీయాలు. ఒక్కసారి వారి వారి స్నేహాలను గమనిస్తే, మిత్రులు ఎలావుండాలో. మిత్రధర్మాలు, మిత్రలక్షణాలు అవగతమౌతాయి.
ఉదాహరణకు రామ సుగ్రీవ మైత్రిని పరిశీలిద్దాం -
వాలిని సంహరించి, తన మిత్రుని కష్టాన్ని తొలగించి వానరరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. కొన్ని నెలల అనంతరం (వానాకాలం ముగిశాక) సీతాన్వేషణ జరిపి, ఆమెను సంపాదించడంలో నీవు చేసే ప్రయత్నంలో సహకరిస్తానని మాట ఇచ్చిన సుగ్రీవుడు ఆ మాట మరిచాడు. తన మిత్రుడు మాట తప్పాడని నింద పడకూడదని, తన వాగ్ధానమును తనకి గుర్తుచేయాలని భావించి, లక్ష్మణుని పంపి సుగ్రీవుణ్ణి హెచ్చరించాల్సివచ్చింది. ఎంతటి ఉదాత్తమైన ఆలోచనిది.
వానరులంతా సేతునిర్మాణం చేసుకొన్నా మొదటి రాత్రి, వానరులతో కలిసి ఒక ఎత్తైన పర్వతం ఎక్కిన రాముడు లంకానగరపు నిర్మాణక్రమాన్ని గమనిస్తుండగా, అదే సమయంలో లంకానగరంలో ఓ ఎత్తైన మేడపై తిరుగుతున్నా రావణుని గమనించిన సుగ్రీవుడు, నా మిత్రునికి ఇంత కష్టాన్ని కలిగించినది ఈ రాక్షషుడే అని అనుకుంటూ, తన శక్తియుక్తులను మరిచి, ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరి, రావణుని పై దూకి, పిడిగుద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసి, తిరిగి రక్తసిక్తమైన దేహంతో ఎగశ్వసతో రాముని ముందు వాలగా, సుగ్రీవుడు చేసిన పనికి నొచ్చుకొని, నీవు మా అందరికీ నేతవు... నేత తలతో సమానం, తలపోతే మిగతా శరీరానికి ఏం విలివ? 'సుగ్రీవా! నీకు ఏమైనా అయితే, నాకు సీతతో ఏం పనయ్యా' అని అంటాడు రాముడు. పైగా, నీకు ఏమైనా అయితే, నీ మాట నిజం చేయటం కోసం రావణున్ని చంపి, సీతను విడిపించి, అయోధ్యకు చేర్చి, వానరులందరినీ కిష్కింధకు చేర్చి, ప్రాయోపవేశంలో మిత్రువైన నిన్నే తలచుకుంటూ వదిలేద్దాం అనుకున్నాను అని అంటాడు రాముడు. ఎంతటి అవాజ్యనురాగమిది.

జీవితంలో ఎందఱో తారసపడుతుంటారు. అందులో కొందరు మంచి పరిచయస్థులుగా వుంటారు. అతికొద్దిమంది అతి తక్కువ సమయంలోనే స్నేహితులుగా, ఆత్మసములై అల్లుకుపోతారు. శరీరాలు రెండయినా, ఏకాత్మభావనతో ఒకటిగా వుండటం నిజమైన మైత్రి.

నిజమైన మైత్రి, తన మిత్రులు సరైన మార్గం తప్పితే వెంటనే హెచ్చరిస్తుంది. అపార్ధం చేసుకున్నా, తిట్టినా, చివరికి దూరం చేసినా వారి శ్రేయస్సును కోరి మంచినే చేస్తుంది, చెప్తుంది. చిరు భేదాభిప్రాయాలు వచ్చాయనో, పరుషంగా మాట్లాడారనో అపార్ధం చేసుకోకుండా, అవగాహన చేసుకుంటూ, అర్ధంకాకుంటే ఎందుకలా మాట్లాడావని తననే అడిగి తెలుసుకోవడం ఉత్తమగుణం.

పాపా న్నివారయతి యోజయతే హితాయ
గుహ్యంచ గూహతి గుణాన్ ప్రకటీ కరోతి
అపద్గతంచ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణ మిదం ప్రవదంతి సంతః
సన్మిత్రులు తమ స్నేహితులను చెడుపనులనుండి వారిస్తారు. మంచి పనులు చేయుటకు ప్రోత్సహిస్తారు. రహస్యాలను గోప్యంగా వుంచుతారు. స్నేహితుల సద్గుణాలను ప్రకటిస్తారు. ఆపదవచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోక, ఆదుకుంటారు. సమయం వచ్చినప్పుడు అవసరమైన వాటిని సమకూర్చుతారు.

కరా వివ శరీరస్య నేత్రయోరివ పక్ష్మణీ / అవిచార్య ప్రియం కుర్యాత్ తన్మిత్రం మిత్రముచ్యతే... శరీరానికి చేతులవలె, కళ్ళకు రెప్పలవలె అప్రయత్నంగా అనుకోకుండా, అలవోకగా మంచిచేసే మిత్రులే మిత్రులు.
సుహృదం హితకామానాం యం: శృణోతి న భాషితం ... మన మేలు కోరేవారే నిజమైన మిత్రులు. అట్టి మిత్రుల మాటలను వినాలి.

మైత్రీ సమానుశీలేషు ... సమానశీలం కలిగిన వారియందు మైత్రిభావం అధికం. వారి అనుభూతులు, ఆలోచనలు, స్పందనలు ఒకేలా వుంటాయి. వారి హృదయాలు ...  ప్రతీక్షణం సంభాషించుకుంటాయి, మనకోసం మనకై వున్నారో ఆత్మీయ వ్యక్తి అన్న మధురభావనతో అనిర్వచనీయ ఆనందంను పొందుతుంటాయి. ఓ అనియంత్రణశక్తి ఏదో కలిపి వుంచుతుందన్న అనుభూతి. అయితే, స్నేహితుల స్వభావాల రీత్యా అప్పుడప్పుడు వారి వారి అభిప్రాయలు నప్పనూ వచ్చు, నప్పకపోవచ్చు. అప్పుడే విభేదించక సరికానివి సరిచేసుకుంటూ, సరైనమార్గంలో సాగిపోవడమే సన్మిత్రుల లక్షణం.

స్నేహితుడంటే ... నవమాసాలూ మోయని తల్లి, రక్తం పంచిన తండ్రి, బెత్తం పట్టుకోని గురువు, చుట్టరికం లేని బంధువు, అక్షరాలకతీతమైన పుస్తకం. ఇంకా యింకా ... స్నేహం గురించి చెప్పడానికి ఎన్ని ఉపమానాలైన తక్కువే. ఆ అనుబంధం అన్ని బందాలకన్నా బెత్తుడు ఎక్కువే ... అని స్నేహ రసజ్ఞులు అంటుంటారు.
యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం ... మిత్ర ముండె నేని సిద్ధౌషదం అక్కరలేదన్నది భర్తృహరి సుభాషితం.


మరి ఇటువంటిస్నేహాన్ని జీవితాంతం నిలుపుకోవడం ఎంతో ఉత్తమోత్తమం కాదా?
                                          మిత్రమా!
నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక... కాదు కాదు మరుజన్మలో కూడా! 
                                                                                                               3 కామెంట్‌లు:

 1. మాటల కందని మధుర భావనను ...అమృతరుల్యమైన ఉదాహరణలతో మైత్రి యొక్క విశేషణ ఆర్ధ్రంగా హత్తుకునేలా వివరించావు భారతి.....మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక! అన్న నీ మాట.... ధన్యోస్మి!

  రిప్లయితొలగించండి
 2. ఈ పోస్ట్ ఎందుకు పెట్టావో నాకు అర్ధమైనది. థాంక్స్ రా.
  ఉదయం నీవు ఈ పోస్ట్ పెడతానని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆశ్చర్యమేసింది. ఆధ్యాత్మిక విషయాలు, భగవంతుని స్మరణ మాత్రమే వుండే స్మరణ బ్లాగ్ లో స్నేహమును స్మరించడమా... అని!
  కానీ, నీ పోస్ట్ చదివాక అర్ధమైంది, రామసుగ్రీవుల మైత్రిని ఉదహరిస్తూ... నీ రామస్మరణను నిరాటంకంగా స్మరించేశావని. హేట్సాప్ రా.

  రిప్లయితొలగించండి
 3. భారతి గారు, హాట్సాఫ్ టు యు .. నిజంగా హృదయం ద్రవించేలాంటి పోస్ట్ పెట్టారు .. హరిప్రియగారికి నా ధన్యవాదాలు .. మీనుండి ఇంతటి అనుభూతిపూర్వక భావాల్ని వెలికి తీసినందుకు.. స్నేహం దారి తప్పించదు .. చెడ్డదారి పట్టించదు.. కటువుగా వున్నా అందులో ప్రేమ వుంటుంది ..దూరంగా వున్నా అనుక్షణం తలపుల్లో వుంటుంది ..మనల్ని మనల్నిగా అద్దంలో చూపిస్తుంది .. మీనుండి ఇంకా మంచి పోస్ట్ లు భవిష్యత్తులో ఆశిస్తూ ...

  రిప్లయితొలగించండి