21, జులై 2016, గురువారం

సనత్సుజాతీయం (ద్వితీయ భాగం)





దృతరాష్ట్రుడు పాండవుల పట్ల తన కర్తవ్యాన్ని ఆచరింపకపోతే అతని కుమారులకు మృత్యువు తప్పదని విదురుడు చేసిన హెచ్చరికతో అధర్మాన్ని అన్యాయాన్ని సరిచేయాలని అనుకోకుండా, మృత్యువు గురించి, అమృతత్వం గురించి ఎఱుకపరిచే బ్రహ్మవిద్యను తెలుసుకొని తన కుమారులు మృత్యువాత పడకుండా చేద్దామని తలచి దానిని తెలుపమని సనత్సుజాతులవారిని ఇలా ప్రశ్నిస్తాడు -

దృతరాష్ట్ర ఉవాచ -

సనత్సుజాత యదిదం శృణోమి
నమృత్యుర స్తీతి తవోపదేశమ్
దేవాసురా ఆచరన్ బ్రహ్మచర్య
మ మృత్యవే తత్కతరంను సత్యమ్

మృత్యువు లేదని మీరు చెప్పిన ఉపదేశాలు గురించి విదురుని ద్వారా విన్నాను. దేవతలు, అసురులు కూడా మృత్యువు జయించుటకోసం బ్రహ్మచర్యం ఆచరించారని విన్నాను. వారేమో మృత్యువు జయించడానికి ప్రయత్నం చేశారంటున్నారు. మీరోమో మృత్యువే లేదంటున్నారు. పరస్పర విరుద్ధంగా వున్న  ఈ మాటల్లో ఏది సత్యం? ఏది నమ్మాలి?
అని దృతరాష్ట్రుడు సనత్సుజాతులవారిని ప్రశ్నించగా -

శ్రీ సనత్సుజాత ఉవాచ -

ఉభేసత్యేక్షత్రియాద్య ప్రవృత్తే
మోహోమృత్యు: సంమతో య:కవీనాం
ప్రమాదంవై మృత్యుమహం బ్రవీమి
సదా ప్రమాదమమృతత్వం బ్రవీమి

ఓ క్షత్రీయుడా! మృత్యువు లేకపోవడం, మృత్యువును తరించడం ... ఈ రెండూ నిజమే. ఈ రెండూ సత్యేమేనని తెలుసుకో.
దేవతాసురులు మృత్యువును ప్రయత్నపూర్వకంగా జయించడమంటే ......
మృత్యువు అంటే మోహం. "నేను" అన్న అహం. హృదయగ్రంధి నందు అహం ఉంటే మృత్యువున్నట్లే దానిని జయించడానికి ప్రయత్నించాలి. హృదయాంతరమున ఆంతర్యామే ఉంటే మృత్యువు లేనట్లే. ప్రమాదం (పొరపాటు) మృత్యువు. అంటే పొరపాటు ఉన్నచోట మృత్యువుంటుంది. పొరపాట్లు చేయకుండా జీవించడమే అమృతత్వం. పొరపాట్లు లేని చోట మృత్యువుండదు. 
మానవుడు తన ఇంద్రియాలను పరమాత్మునిలో ఐక్యం చేసుకుంటే మృత్యువనేది ఉండదు. మట్టితో చేయబడిన కుండకు పగిలిపోవడముంటుందిగాని మట్టికి వినాశనం ఉండదు. అలాగే ఆత్మతో నిండియున్న శరీరాదులకు మార్పు ఉంటుంది గాని ఆత్మకు మార్పు ఉండదు. ఆంతర్యామితో జీవించేవారికి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు స్థానంలో ఆత్మే నిలుస్తుంది. ఇలా ఆత్మనిష్ఠులైన వారికి మృత్యువుండదు.

సృష్టాది నుండి శాశ్వతమూ, నిత్యమూ, సత్యమూ అయినటువంటిది, వేదశబ్ద వాచ్యమయినటువంటి ధర్మమున్నది. అది సనాతనమైనది. ఈ సనాతన ధర్మమును తెలుచుకొని తదనుగుణంగా జీవిస్తే మృత్యువు లేనట్లే. ఆ ధర్మమును తప్పితే పొరపాటు చేసినట్లే, మృత్యువు ఉన్నట్లే.

అని చెప్తూ ఇంకా ఇలా వివరిస్తున్నారు సనత్సుజాతులవారు - 

ప్రమాదాద్వా అసురాః పరాభవన్ 
అప్రమాదాద్ బ్రహ్మభూతాః సురాశ్చ 
సవైమృత్యుర్వ్యాఘ్ర ఇవాత్తి జస్తూన్ 
సహ్యస్వరూప ముపలభ్య తేహి

ప్రమాదం అంటే పొరపాట్లు వలన అసురులు పరాభవం పొందారు. పొరపాటు పడకుండా ఉండడం వలన సురులు బ్రహ్మభూతులైనారు. 
(అమృతత్వం కోసం దేవాసురులు ప్రయత్నించారు కానీ, మోహినిపై మోహంతో అసురులు అంతవరకు తాము దేనికై ప్రయత్నం చేస్తున్నారోనన్న విషయం మరిచి పరాభవం పొందారు.పొరపాటు పడకుండా, తాము దేనికై  ప్రయత్నం చేస్తున్నారో గుర్తుంచుకోవడం వలన సురులు బ్రహ్మభూతులైనారు). ఏది యుక్తమో, ఏది అయుక్తమో గ్రహించి, ఏమరుపాటు లేకుండా బ్రహ్మచర్యం (పరబ్రహ్మ యందు చరించుట) పాటించువారికి మృత్యువుండదు. 

దేహాత్మ బుద్ది గలవారు అసురులు. ఇంద్రియ సుఖాలు కోసం జీవించేవారు అసురులు. అసురులు అంటే దుర్బుద్ధులు. దుర్బుద్ధి ఎక్కడుంది? మన బుద్ధిలోనే ఉంటుంది.  ఆత్మనిగ్రహం ఇంద్రియనిగ్రహం కలవారు సురులు. సురులంటే సద్బుద్ధి. ఇదీ మన బుద్ధిలోనే ఉంటుంది.

మృత్యువనేది మృగంలా రాదు. పులిలా వచ్చి కబళించదు. మన దినచర్యలో మనం ఆచరించుకొంటున్నటి పనులేవైతే ఉన్నాయో, వాటివలన మృత్యువు ఉండటమో, లేకపోవడమో ఉంటుంది. అజ్ఞానంతో దేహమే నేననుకుంటే ఆ దేహం విడుస్తున్నప్పుడు మృత్యువు వచ్చిందంటారు. దేహాత్మభావన లేనప్పుడు దేహం విడుస్తున్నాననుకుంటారు. వీరికి మృత్యువు లేదు. అంతేకాని దీనికి రూపముండదు.

అని ఇంకా మరింత వివరణ ఇస్తున్నారు శ్రీ సనత్సుజాతులవారు -

ఆ వివరణ తదుపరి టపాలో ...









5 కామెంట్‌లు:

  1. యోగులు తమ కార్యం పూర్తి అవ్వకుండా వెళ్ళిపోరు, అందుకు కావలిసిన అభ్యాసం అంతా పై శ్లోకాల ద్వారా తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. ఈ పోస్టును ఫేస్ బుక్ లో పెట్టాను. అంతగా నచ్చడానికి కారణం జనన మృత్యువుల గురించి ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం (నేను మెంబర్.ని) లో కూడా ఏమి చెబుతారంటే.... భగవంతుడి పై నిశ్చయం ఉంటే జీవనం అనిశ్చయం వస్తే మరణం అని. నాలుగున్నర లక్షల మంది ఈ లోకంలో రాబోయే వినాశనానంతరం శరీరాలు నశించకుండా ఉంటాయి వారు యోగ బలం తో తమ ఆత్మకు దగ్గరి ప్రకృతి ఈ శరీరాన్నీ ఇంకా బయట ప్రకృతినీ కూడా సుఖదాయినిగా మారుస్తారు. మిగతా ఇందరు 5 , 7 వందల కోట్లమందీ వినాశనంలో సమసి పోతారు. మిగిలిన నాలుగున్నర లక్షల జనాభాతో కొత్త ప్రపంచం తిరిగి మొదలౌతుందని చెబుతారు. దానికి కావలసిన పద్ధతి పై శ్లోకాల ద్వారా తెలుస్తున్నది కదా...

    రిప్లయితొలగించండి
  3. శ్రీ రమణగార్కి, నమస్సులు. మంచి విషయాలను ప్రాచుర్యం లోనికి తెస్తున్నందుకు అభినందనలు. నిజమేనండి...యోగులు తమ కార్యం పూర్తి అవ్వకుండా వెళ్ళిపోరు. మీకు ఈ పోస్ట్ నచ్చినందులకు ధన్యవాదములు. తదుపరి భాగములు కూడా చదవండి. వీలైనంత క్లుప్తంగానే నా అవగాహన మేరకు వివరిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  4. ధృతరాష్ర్రుడు మృత్యువు గురించి సనత్సుజాతీయుల వారిని వివరణ నిమ్మని కోరుట.. వారి వివరణను నీదైన శైలిలో చక్కగా విశదీకరించి చెప్పావు భారతీ!..

    శరీరం నుండి ఆత్మవియోగంతో కలిగే దు:ఖానికే మృత్యువని పేరు.మృత్యువు వలన కలిగే వియోగ దు:ఖాన్ని సహించేందుకు ధృడమైన మనస్సు, ఆత్మవిశ్వాసం, ధైర్యమవసరం. ధర్మానికి ప్రధమ లక్షణం ధైర్యం.

    పరమాత్మను తెలుసుకొని మృత్యువును దాటాలి - అధిగమించాలి. పరమాత్మ ఆశ్రయం మోక్షదాయకం. ఆతని అనాశ్రయం మరణదాయకం...

    భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ. శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు. మరణానంతరం జీవాత్మతో ధర్మమొకటే వెళుతుంది...

    నాకు తెలిసిన రెండుమాటలతో మరోసారి అభినందనలతో....చక్కటి పోస్ట్ ను అందించినందుకు థాంక్యూ....

    రిప్లయితొలగించండి