9, డిసెంబర్ 2016, శుక్రవారం

"దత్తోహం"

బ్రహ్మ మానసపుత్రులైన సప్తర్షులలో ఒకరు అత్రి మహర్షి. ఈయన విశేష తపఃసంపన్నుడు. అత్రి అంటే "ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రిశబ్దవాచ్యో జీవన్ముక్తో కశ్చిన్మహర్షి:" ఆధ్యాత్మిక, అధిదైవిక, ఆధిభౌతికములనే మూడు తాపత్రయములు లేనివాడు. సత్త్వ, రజో, తమోగుణాలు, గ్రంధిత్రయాలు లేనివాడు అత్రి.


కర్దమ ప్రజాపతి ద్వితీయ పుత్రిక అనసూయాదేవి. "యస్యాం నవిద్యతే అసూయ సా అనసూయ" ఏ స్త్రీయందు అసూయ వుండదో ఆమె అనసూయ. అనసూయ అంటే అసూయను వీడిన తత్త్వం. పరిశుద్ధంగా వుండే తత్త్వం.

అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ. ఈమె మహాసాధ్వి. ఈమె పాతివ్రత్య ప్రభావం గురించి ముల్లోకాల్లోనూ నారదులవారివలన విస్తరించగా, లక్ష్మి, పార్వతి, సరస్వతులు ఒకింత అసూయతో (ఈ మువ్వురమ్మలకు అసూయ ఏమిటి? వారు శక్తి స్వరూపులు కదా ... అని నాకు ఈ కధ చెప్తున్న మా తాతయ్యగారిని నేనడగగా, తల్లీ! కైకేయి ఆ వరాలు  కోరకపోతే రాముని అవతార కారణం సఫలం కాదు, అలాగే మానవాళిని జ్ఞానమార్గంలో తరింపజేయలన్న తలపుతో శ్రీ దత్తుని అవతారం లోకోద్ధారణకు అవశ్యం కాబట్టి ఆ అమ్మవార్లు మానవాళి శ్రేయస్సుకై అలా స్పందించారని చెప్పారు)ఆ మువ్వురమ్మలు అనసూయను పరీక్షింపదలచి, తమ భర్తలను పంపగా, ఆ త్రిమూర్తులు ఓ మధ్యాహ్న వేళ, మునివేషాలతో అత్రిమహర్షి ఇంట్లోలేని సమయాన అతిథులుగా వచ్చి,  భోజనాల సమయంలో ఆమెను వివస్త్రయై వడ్డించమనగా, వారిని పసిబిడ్డలుగా మార్చేసి, పుత్రవాత్సల్యంతో తన స్తన్యపానము చేయిస్తుంది. పిమ్మట ఇంటికి వచ్చిన అత్రిమహర్షి దివ్యదృష్టితో సత్యాన్ని గ్రహించడం, అటుపై కొంతకాలానికి మువ్వురమ్మలు  తమ భర్తల స్థితిని గతిని తెలుసుకొని, 


అత్రిమహర్షి ఇంటికి అరుదెంచి పతిభిక్ష పెట్టమని అర్ధించగా, వారి కోరిక మేరకు అత్రిమహర్షి త్రిమూర్తులను ప్రసాదించడం,  ఆపై కొంతకాలమునకు మాండవ్యుడనే మహర్షి, మరునాటి సూర్యోదయంలోగా మరణిస్తావని సుమతి అనే పతివ్రత భర్తను శపించడం, ఆ పతివ్రత సూర్యోదయంను ఆపేయడంతో, ఆ అకాల ప్రళయంను నిలువరించమని దేవతలు అనసూయను వేడుకోగా, ఆమె సుమతికి నచ్చజెప్పి, సూర్యోదయంను చేయించి, విగతప్రాణుడైన సుమతి భర్తను బ్రతికించడం, 

ఈ అద్భుతకార్యంకు సంతసించిన త్రిమూర్తులు వరం కోరుకోమనగా, తనకు ఇతరత్రా కోరికలు లేవని, భర్తకు పూర్వమిచ్చిన వరమును పూర్తిచేయవలసిందిగా కోరిన కొద్దికాలానికి మువ్వురు అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ఆ పుణ్యదంపతుల తపఃఫలంగా పుత్రులై ప్రభవించినట్లు  పురణాల కధనం.


                                                                     దత్తాత్రేయుడు

శ్రీ దత్తాత్రేయుడు మూర్తిత్రయాత్మక స్వరూపుడు. (మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకత్వాన్ని సూచించే స్వరూపం.
స్థూల సూక్ష్మ కారణము లనెడు దేహత్రయమును దత్తముజేసినవాడు (దత్తమనగా ఇవ్వబడిన లేక త్యజింపబడిన) దత్తాత్రేయుడు. దేహత్రయాతీత సాక్షిచైతన్య స్వరూపుడు.
జాగ్రత్ స్వప్న సుషుప్తులనెడి అవస్థాత్రయం లేనివాడు దత్తాత్రయుడు.
సత్వ, రజో, తమో గుణాలు మూడింటికీ అతీతుడైనవాడు దత్తాత్రేయుడు.
అకార ఉకార మకారములనెడు మూడుమాత్రలకు మూడక్షరములకు మూలస్వరూపుడై, త్రిమూర్తులకు పరమై, సత్యజ్ఞానానందమూర్తియైన శ్రీ దత్తాత్రేయుడు షోడశ కళా పరిపూర్ణుడైన పరబ్రహ్మతత్త్వంకు ప్రతీక.

దశావతారాలలో దత్తాత్రేయుని అవతారం లేనప్పటికీ త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తుడిది అత్యంత విశిష్ట జ్ఞానావతారం. భాగవతంలో పేర్కొన్న ఏకవింశతి (21) అవతారములలో ఒకటి దత్తావతారం.  సాధారణంగా భగవంతుడు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణకై అవతరిస్తుంటాడు. అటులనే ఈ దత్తావతారంలో జ్ఞానత్వం ద్వారా మనలో ఉన్న దుష్ట సంస్కారాలను, అజ్ఞానమనే అసురత్వాన్ని సంహరించడం జరిగింది.   భగవానుని అనేక అవతారములు, వారు అవతరించడానికి కారణమైన కార్యము పూర్తయ్యాక తిరిగి అంతర్ధానం అయ్యాయి. కానీ, శ్రీదత్తునిది నిత్యావతారం.

శ్రీ దత్తుడు గురువు, దైవమూ కూడా. అందుకే ఆయనను 'గురుదేవదత్త'గా కొలుస్తారు. స్మరించిన మాత్రమునే సంతుష్టుడై సంరక్షిస్తాడని 'స్మర్తృగామి' అని కీర్తిస్తారు. తత్త్వ జ్ఞానాభిలాషులకు "యోగి"లా, ఇతరులకు "బోగి"లా దర్శనమిచ్చే శ్రీ దత్తుడు, ఐహికాముష్మిక ఉభయ ఫలప్రదాత. జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే భక్తసులభుడు.

యోగమే శ్రీ దత్తుని మార్గం.
నిస్సంగత్వమే శ్రీ దత్తుని ఉపదేశం.
జ్ఞానమే శ్రీదత్తుని ఉపాసన.


లోకంలోని సర్వులకు జ్ఞానమార్గంలో తరింప చేయగోరి, అనసూయమాత తన పాతివ్రత్య భక్తితో, 
అత్రి మహర్షి తన తపోశక్తితో, 
ఆదిగురువుగా, తనని తాను లోకాలకు దత్తం చేసుకున్న శ్రీ దత్త భగవాన్ అవతరించినట్లు చేసిన ఈ పుణ్యదంపతులకు ముందుగా నమస్కరిస్తూ ...


                                                        
            
శ్రీ దత్తాత్రేయ స్తుతి 
                                      అనసూయాత్రి సంభవం అఖండ జ్ఞాన వైభవం
                                      అనందతేజో స్వరూపం దత్తాత్రేయమహం భజే ||

                                      త్రిగుణ రహితం దేవం త్రిమూర్తి స్వరూపం విభుం 
                                      సద్గురుం కరుణామయం దత్తాత్రేయమహం భజే || 
ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ:  
ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ:  ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ: 

దత్త ఆరాధకులు, ఆధ్యాత్మిక సాధకులు "దత్తోహం" అని ధ్యానిస్తూ ఉంటే, దత్త స్వరూపులుగా, అవధూతలుగా మారతారని ప్రతీతి.


మార్గశిర శుక్ల పూర్ణిమ "శ్రీ దత్త జయంతి". సందర్భంగా ఈ దత్త స్మరణ ... 
                                             
                                                                      "దత్తోహం" 

1 కామెంట్‌:

  1. "దత్తోహం" పోస్ట్ నీదైన అద్భుత శైలిలో చక్కగా వివరించావు భారతీ!
    శ్రద్ధాభక్తితో భార్గవరాముడు సేవించగా త్రిపురా రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు..స్మర్తృగామి యని తెలుసుకొని దీలాదనుడు స్మరింప తక్షణమే ప్రత్యక్షమై వజ్రకవచమును బోధించిన దత్తదేవా ..మంగళమయ్యా గురుదేవా!...జై గురుదేవ దత్త.

    రిప్లయితొలగించండి