1, మే 2020, శుక్రవారం

"చెప్పాలని ఉంది, మనసిప్పాలని వుంది"...

లాక్డౌన్ ప్రకటించిన మొదట రెండుమూడురోజులు... మావారు టి.వి చూస్తూ, కబుర్లు చెప్తూ, కాస్త నా పనుల్లో సహాయపడుతూ హుషారుగా గడిపేశారు. ఆ తర్వాత రెండురోజులు... అబ్బా ఏ చానల్ చూసిన కరోన, కరోన... భయం వేస్తుంది, టి.వి చూడడానికి విముఖత, టైం గడవడంలేదు, బోర్, విసుగు, నిట్టూర్పులు. 
                              
ఒకరోజు బంధువులతో, స్నేహితులతో ఫోన్ లో కబుర్లు. ఆరోజు ఉత్సహాంగా గడిచింది. మరుసటిరోజు ముందురోజు మాట్లాడిన వారి ద్వారా, మరికొందరు బంధువుల, మిత్రుల ఫోన్ నంబర్స్ తెలుసుకొని, వరుసగా ప్రతీరోజూ కొందరితో మాట్లాడడం...ఆనాటి బంధాలు, అలనాటి జ్ఞాపకాల ముచ్చట్లు... ఓహో... ఎన్నెన్ని కబుర్లో.....వీరు చెప్పుకునే కబుర్లకు కొదవేలేదు.పెరట్లో ఆడుకునే ఆటలు మొదలు ప్రపంచాన్ని అల్లాడిస్తిస్తున్న కరోన వరకు, మారిన పల్లెలు లగాయతు దేశాల్ని దాటిన పిల్లల వరకు, కర్రబిళ్ళ మొదలు క్రికెట్ వరకు...ఒకటని ఏముందీ...పాత సైకిల్ టైరుని ఒక కర్రతో తోసుకుంటూ ఊరంతా తిరిగేయడం, గోళీలాటలు, గడ్డివాముల్లో దొర్లడాలు, పొలాలగట్ల వెంబడి పరుగులు, తాటిముంజులు, జీళ్ళు పంచుకొని తినడాలు, పిట్టగోడలు పై కూర్చొని దొంగతనంచేసిన జామకాయలు కాకి ఎంగిలి చేసుకొని తినడాలు, పిల్లకాలవలో ఈత కొట్టడాలు, కొబ్బరివాచ్ పెట్టుకొని కొట్టే పోజులు, ఆరుబయట నులకమంచంపై పడుకొని, చేతుల్ని తలక్రింద దిండుగా చేసుకొని  చుక్కల్ని లెక్కిస్తూ, మేఘాలతో ఆడుకుంటున్న చందమామని చూస్తూ పాడుకునే పిల్లరాగాలు మొదలు .....ఎన్నెన్నో కబుర్లు... అహంలేని అప్పటి అమాయకత్వంలో ఆనందం, అహంతో పాటు పెరిగిన  ఆస్తులు, అనారోగ్యాలు గురించి వీరు మాట్లాడుకుంటూ, ఆ ఆత్మీయత పలకరింపుల పులకరింతల నడుమ లాక్డౌన్ మాటే మరిచారు. మావారి తీరు బహు బాగు బాగు అనిపించి, ఈ విషయాన్ని నా సన్నిహితులతో చెప్పాను. 
                         
మన జీవితాల్లో ఎన్నో బంధాలు, ఎందరో బంధువులు, ఎన్నెన్నో పరిచయాలు, మరెన్నో స్నేహాలు....కానీ; నేడు బంధాలన్నీ ఒకప్పటిలా లేవు.  కొన్ని సజీవంగా, కొన్ని మరుగున పడి, మరికొన్ని ఉండీ ఉన్నట్లు...వున్నాయని అర్ధమైంది. ఎందుకిలా బంధాలు బలహీనమౌతున్నాయని మమ్మల్ని మేం ప్రశ్నించుకుంటూ, తరచి చూసుకున్నాం. 
                          
నావరకు నాలో నాకు నచ్చని అంశాలు రెండున్నాయి. మొదటిది - నా వ్యక్తిగత బాధ్యతల నిర్వహణలో మునిగి, నా కుటుంబంకే పరిమితమై, మిగతా బాంధవ్యాలను సరిగ్గా పట్టించుకోక పోవడం. వ్యక్తిగత బాధ్యతలకు పూర్తిగా ప్రాధన్యత ఇచ్చి, ఎదుటివారికి అవసరమైన సందర్భాలలో స్పందించకపోవడం... ఇదీ ఓ విధమైన నిర్లక్షమే. మనుషుల్ని దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషాలు కంటే ప్రధానమైంది నిర్లక్షమే. నిజానికి ఈ మధ్యనే ఇలాంటి నిర్లక్ష్యానికి నేనూ గురైయ్యాను. ఆ బాధ వర్ణానాతీతం. ఇప్పుడర్ధమైంది, నేను కొందర్ని ఎంతగా నొప్పించానన్నది.  మనవళ్ళ సంరక్షణ, కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా వున్నను, అప్పుడప్పుడైన కొంత సమయం ఆత్మీయ బంధాలకు కేటాయించాల్సింది...ఇప్పుడు కాస్త తీరికై వెనక్కి చూసుకుంటే, బంధాల నిర్వహణలో ఒకింత విఫలమైనయ్యానని అర్ధమైంది. ఆత్మీయంగా ఓ పలకరింపు, చిరునవ్వుతో ఓమాట... వీటితో పోయేదేముంది, అవతల మనిషిలోని కలత తప్ప. తప్పు చేసాను... సరిదిద్దుకున్నానిప్పుడు. 
ఇక రెండవది చివర్లో ప్రస్తావిస్తాను.  
                           
నా సన్నిహితులతో ఈ విషయమై మాట్లాడాక, 'బంధాలు - అనుబంధాలు' సాధారణంగా ఏ కారణాలచే బలహీనమౌతాయో అర్ధమైంది. మేమందరం వీలైనంతవరకు మా మా బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొని, అందరికీ ఫోన్ చేసి, సడలిన, వడలిన బంధాలను పునరుద్దరించుకోవడానికి శ్రీకారం చుడుతూ, "చెప్పాలని ఉంది, మనసిప్పాలని
వుంది" అనుకుంటూ, కొందరి దగ్గర ఆత్మీయంగా ఒదిగి, కొందరికి పెద్దరికంగా హితం చెప్పి, కొందరికి  ఏం కోల్పోయామో మృదువుగా తెలుపుతూ, కొందరికి క్షమపణలు, కొందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ప్రేమతో మనసార మాట్లాడి, అందర్నీ అభిమానంగా పలకరించడంతో, అన్నీ మరచి, ఆత్మీయంగా అందరం ఆనందంతో అనుబంధాలను దృఢపర్చుకున్నాం.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఆత్మీయ అనుబంధాలతో విరాజిల్లేవి.  ఉమ్మడి కుటుంబాలల్లో ఆప్యాయతలు, ఆ ఆప్యాయత వెనుక ఆశీర్వాదాలు, ఆ ఆశిస్సులు వెనుక అండదండలు... అద్భుతం. అర్ధవంతమైన ఆరోగ్యకరమైన వాతవరణంలో స్థిరంగా సాగే తొందరలేని జీవనాలు ఆనాటివి. కానీ; కాలమాన పరిస్థితులబట్టి కుటుంబవ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. 
చాలావరకు చాలామంది వ్యక్తిగత అభిరుచులకు, ఆకాంక్షలకు భిన్నంగా వున్నాయి, నేటి బ్రతుకులు. తప్పదు, ఈమార్పులకు సహకరించక తప్పదు. ఈ మార్పును స్వాగతించక తప్పని నేపద్యాలు...అంత మాత్రమున మంచి బంధాల నుండి, మంచి స్నేహాల నుండి దూరం కానవసరం లేదు.

మనం సంఘజీవులం. బంధాలు లేనిదే మనుగడ లేదు. మనకు అనుబంధాలు తప్పనిసరి. పరస్పరం సహకరించుకుంటూ జీవనగమనం సాగించడానికి, జీవితమును అర్ధవంతం చేసుకోవడానికీ, ఆనందమును అనుభవం లోనికి తెచ్చుకోవడానికి అనుబంధాలను ఏర్పరచుకుంటాం. ఇలా ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యాల విషయంలో అందరికీ చిరు చిరు ఒడిదుడుకులు వొస్తుంటాయి. అందరం చిన్న చిన్న తప్పుల్ని చేస్తుంటాం. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ వుండరు కదా. బంధాలు అనుబంధాలు ఆనందంగా ఆహ్లాదంగా కలకాలం సాగాలని, సాగించాలని ఎవరికుండదు? అందరికీ ఉంటుంది. కాకపోతే ఏ బంధంలోనైన అప్పుడప్పుడు చిరు చిరు మాటపట్టింపులు, కలతలు, అపోహాలు సాధరణంగా వుంటుంటాయి. అలానే కుటుంబీకులు కూడా ఒకోసారి మన ఆలోచనలకు విలువనివ్వకపోవడమో, అర్ధం చేసుకోలేకపోవడమో, వారి భావాలను మనమీద రుద్దడమో జరుగుతుంటుంది. అటువంటప్పుడు ఆవేదన కలుగుతుంది. కానీ, అప్పుడు ఒకటి గుర్తుంచుకొండి...ఎదుటివారు మన సంబంధీకులు, మనవారు! వారితో వెంటనే వాదనచేసి దూరం పెంచుకోకండి. తర్వాత మనకు కల్గిన బాధను నెమ్మదిగా అర్ధమయ్యేటట్లు చెప్పవచ్చు. అంతేగానీ, తక్షణమే గొడవపడి అహమును అడ్డుతెరగా నిలపకండి. అపార్ధమనే అడ్డుగోడల్ని కట్టకండి. అర్ధం చేసుకొనే వారధిని కట్టుకొండి. అలానే, ఎవరేం అనుకుంటారో, ఎవరెలా అర్ధం చేసుకుంటారో...ఇత్యాది సంశయాలతో మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం కూడా తప్పే. దానివలన సంబంధాలు బలహీనమవ్వవొచ్చు. అపార్ధాలు తొలగాలంటే వాదించడంవలనో, మౌనంగా ఉండడంవలనో ప్రయోజనం వుండదు. నేర్పుతో, ఓర్పుతో, సహృదయతతో అవతలివ్యక్తి అభిప్రాయాన్ని అర్ధం చేసుకుంటూ, ప్రేమతో మాట్లాడవలసిన చోట మాట్లాడండి...నిదానంగా స్పష్టంగా! 
ఇక, వాదించేవారికి మనం ఎంత తక్కువగా స్పందిస్తే, అంత ప్రశాంతంగా వుండగలుగుతాం. అలానే అప్పుడప్పుడు మన అభిరుచుల్ని మార్చుకోవల్సి వస్తుంది. ఒకానొక చిరాకు స్థితిలో, వాళ్ళకోసం నా ఇష్టాల్ని వదులుకున్నాను, వాళ్ళకై ఇది చేసాను, అది చేసాను, మరి వాళ్ళు ఏం చేసారు నాకై... అని దుఃఖపడతాం. ఎన్నో త్యాగాలు చేసినట్లు భావిస్తాం. ఒకటి గుర్తుంచుకొండి - ఇది వ్యాపారం కాదు; బంధం! శాశ్వతబంధాలలో చిన్న చిన్న త్యాగాలు తప్పనిసరి. ఏ బంధంలోనైన కాస్తంత సంయమనం, సర్ధుబాటుతత్త్వం తప్పనిసరి.

అలానే  సన్నిహితులతో బంధాలు గురించి మాట్లాడుతున్నప్పుడు, మా గమనిక లోనికి వచ్చిన మరికొన్ని విషయాలు ఏమిటంటే - మనముందు ఒకలా మన పరోక్షంలో మరోలా కొందరు  మాట్లాడుతుంటారు. ఒకరి గురించి మంచిగా చెప్పకపోయిన పర్వాలేదు, చెడుగా మాత్రం చెప్పకండి. మీరు చేసే కామెంట్స్ వలన కొందరి బంధాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. నిజాన్ని కప్పిపుచ్చి సగం సగం మాట్లాడకండి. మనిషి మంచివాడు కావాలంటే మంచిపనులు చేయనక్కరలేదు, ఎదుటివారు గురించి చెడుగా  మాట్లాడకుండా వుంటే, అంతేచాలు.

ఒకోసారి ఏదీ నిర్ణయించుకోలేని సందిగ్ధపరిస్థితులు ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, కుటుంబ పెద్దలు లేదా దగ్గరలోనే ఉండే శ్రేయోభిలాషులు తగు సూచనలు, చేయూత ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి లేదు కాబట్టి, స్నేహితులనో సన్నిహితులనో సలహా అడగడం  సహజం. అలా అడిగినప్పుడు - 'కొంచెం బిజీగా ఉన్నాను కాసేపు ఆగి నా పనులు పూర్తయ్యాక చెప్తాను'...అని చెప్పి, అలా... గంటలు రోజులు, రోజులు వారాలౌతాయి. వారినుండి బదులుండదు. చిన్నమాట చేయూతకు అంత జాప్యమా? నిజంగా వారికి ఏం చెప్పాలో తెలియకపోతే, ఆ మాటే చెప్పేయవచ్చు ముందుగా. కానీ, వారిని నిరీక్షణలో పెట్టేస్తారు. మాట లేదా చేత...చేయూత అడిగినప్పుడు చేయగలిగితే వెంటనే చేయండి. లేదంటే, 'చేయలేనిప్పుడు ఏ సహాయమును' అని ముందే చెప్పేయండి. దాహంగా ఉండి నీరు అడిగినప్పుడు ఉంటే ఇవ్వండి, లేదంటే లేవని వెంటనే చెప్పేయండి. తీరిక అయినప్పుడు ఇద్దామనుకుంటే, ఆ వ్యక్తి అంతవరకు నిలబడి ఉంటారో, సొమ్మసిల్లి పడిపోతారో ఆలోచించండి. (ఇది ఒక సారూప్యత కోసం ఉదహరించాను)

ప్రతీ మనిషిలో మంచి చెడు ఉంటాయి, మంచినే చూద్దాం. ప్రతి ఒక్కరు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు, ఇతరుల ప్రవర్తనని సానుకూలంగా నిర్వచించుకుందాం. స్వంత అభిప్రాయాలు ఏర్పరచుకొని ఆ కోణంలో ఎదుటివార్ని విశ్లేషించక, వారి కోణంలో కాస్తా ఆలోచించండి. నిజానికి ఏ బంధంలోనైన, చాలావరకు విభేదించే విషయాలకంటే ఏకీభవించే విషయాలే ఎక్కువ. ఇది నిదానంగా మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఏదీ పోట్లాడి, పోరాడి సాధించలేం. మంచిగా బ్రతకాలంటే మేధస్సు కాదు, మనస్సు వుండాలి. పొరపాట్లు మన్నించే మనస్సుండాలి.  ప్రేమించే మనస్సుండాలి. సఖ్యసంబంధాలు నెలకొనాలంటే సమైక్యభావన వుండాలి, అధికులమన్న భావన, చిన్నచూపు తగదు. అతిగా స్పందించడం తగదు. చిన్న చిన్న అపార్ధాలతో, అందమైన ఆనందకర అనుబంధాలను అర్ధరహితంగా, అర్ధాంతరంగా ఆపేయకండి. కలుపుకు పోయే తత్త్వం మనలో వుంటే, అందరూ మనతోనే ఉంటారు. పొరపాట్లు అవతలివారిలో ఉందనుకుంటే క్షమించడం, అవసరాలకి కాక ఆత్మీయతలకి విలువనిచ్చినప్పుడు, మనుషులతో కాకుండా మనసులతో మాట్లాడినప్పుడు, ఏ బంధమైన దృఢంగానే నిలుస్తుంది.

మనిషికి ఎన్నోరకాల ఆలోచనలు కలుగుతుంటాయి. అందులో ఏవి మంచివి, ఏవి చెడువి అంటే, అవి ఆయా సందర్భాల మీద అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. మనిషికి ఇలాగే వుండాలి, ఇలాగే ఆలోచించాలి, ఈ పనులే చెయ్యాలి, ఈ అలవాట్లే వుండాలి అని అందరికీ వర్తించేటట్లుగా సిద్ధాంతీకరించడం అసాధ్యం. కానీ, ప్రేమతత్వంలో ఉన్న ఘనతను, మహత్తును తెలుసుకుంటే, సాధ్యమైనంతవరకు మన సంబందీకులతో ప్రేమగా సఖ్యతగా ఉంటూ జీవితాన్ని నందనవనం చేసుకోవచ్చు. కానీ, ప్రేమను పంచుకోం, మనసార మాట్లాడం, ఏదీ ఒకంతట వ్యక్తం చేయం, అన్నీ మనసుపొరల్లో దాచిపెడతాం. కొందరైతే వారి మాట, చేత, ఇష్టాలకు తందాన తాన అంటేనే, వారి ప్రేమను అందిస్తారు. ఇదా ప్రేమంటే? ఈ ప్రేమలో సహజత్వం ఉందా? స్వచ్చత ఉందా? స్వార్ధం ఉందా? ఇలాంటి ప్రేమతో బంధాల్లో అశాంతి, అసహనం, అపశృతులు రావా మరి. ఒక్కసారి మనలో మనం మధించి చూసుకుంటే ప్రేమలో ఎన్ని లోపాలో... ఇష్టాయిష్టాలతో ప్రేమను ముడిపెట్టి చూడకండి. ప్రేమంటే మానసికమైన ఉద్రేక ఉద్వేగాలు కాదు, కరచాలనం ఆలింగనాలు కాదు, ప్రేమంటే హృదయాన్ని స్పృశించడం. ఇది అంతర్గత స్పందన, నిరంతర ప్రవాహం. శాసింపులు, షరతులు ఉండవు. అవసరమైన చోట చిరు కఠినత్వమే తప్ప, నిరంకుశత్వమెరుగదు. ప్రేమ మృదువుగా మాట్లాడిస్తుంది, మృదువుగా వ్యవహారాల్ని చక్కబెడుతుంది, మృదువుగా హెచ్చరిస్తుంది. నిజానికి ప్రేమకి మించిన పదునైన ఆయుధం లేదు. ఈ ప్రేమ మనలో లేనిది కాదు, మనలోనే అనేక భావోద్వేగాల (ఆవేశం, అసహనం, ఆవేదన, అవమానం, అసూయ, అసంతృప్తి లాంటివి)క్రింద అణిగివుంది. ఆ ఆయుధాన్ని బయటికి లాగండి.  ద్వేషించడం వలన ద్వేషాన్ని రూపుమాపలేం. ద్వేషానికి సరైన మందు ప్రేమ. ప్రేమతోనే మానవసంబంధాలు పటిష్టంగా ఫరిడిల్లుతాయి.

చీకటితో ఎంత పోరాడినా ఏమీ లాభం వుండదు, వెలుగు వైపు అడుగులేస్తేనే చీకటి తనదారి తాను చూసుకుంటుంది. వెలుగు విలువ తెలుస్తుంది. అలానే వడలిన బంధాలను తలచుకొని బాధపడితే ఏమీ లాభం వుండదు, సరిచేసుకోవడానికి ఓ అడుగు ముందుకువేయండి. బంధాల్లో ఆనందం తెలుస్తుంది. 

మన కుటుంబవ్యవస్థను "ఉదారచరితానాంతు వసుదైక కుటుంబం" అని కీర్తిస్తారు. కుటుంబీకుల నడుమ పరస్పర అనురాగం గౌరవం ఉన్నను;  ఒకొకప్పుడు కుటుంబీకులను బాధపెట్టలేక కొన్ని విషయాల్లో రాజీపడతాం. ఎదుటివారి అభిరుచుల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం కోసం  కొంత తగ్గుతాం. అవతలివారి ఆధిపత్యానికో, పెద్దరికానికో ... భయంతోనో, భక్తితోనో కొంత మూగబోవల్సివస్తుంది... ఫలితం అసంతృప్తి. ఇలా ప్రతీ బాంధవ్యంలో ఎంతో కొంత అసంతృప్తి సహజం. అటువంటప్పుడు స్నేహితుల చెంత, ఆ అసంతృప్తి మర్చిపోవడానికి ప్రయత్నించిన, అదీ అన్నివేళలో సంతృప్తికరంగా ఉండదు. 
వీటన్నిటినీ అధిగమించడానికి మన ప్రవర్తనా శైలిలో, మన అభిరుచుల్లో, ఆలోచన సరళిలో ఓ మార్పు రావాలి. ఆ మార్పు మనకి ఆహ్లాదపరిచే తోడు కావాలి. ఆ తోడు మన అభిరుచుల్లో దొరుకుతుంది. ఎవరికో నచ్చినట్లుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సివస్తుంది. అదే మనకి నచ్చినట్లుగా బ్రతికితే, జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మనస్సు హాయిగా వున్నప్పుడే, సవ్యంగా ఉండగలుగుతాం. మనస్సుని నిర్మలంగా, వ్యవహారశైలిని సౌమ్యంగా నిలపగల్గేవి, మన అభిరుచులే. బంధాలు అప్పుడే పటిష్టంగా శోభిల్లుతాయి.

నా ఆత్మీయ నేస్తమొకరు ప్రకృతి ప్రేమికురాలు. సూర్యోదయమును ఆస్వాదిస్తారు, చంద్రరాజును చూస్తూ పులకిస్తారు, పక్షుల కువకువలు, పుష్పాల సొగసులు, గాలి గుసగుసలు...అన్నీ ఆమె మురిపింపులకు హేతువులే. రంగవల్లులు, పుష్పాలంకరణలు, దీపారాధనలు, మంచి సంగీతం మంచి సాహిత్యం ...ఇలా ఆమె అహ్లాదంగా సాగే దారులు ఎన్నెన్నో! తన ఈ అభిరుచులే తనకి చక్కటి తోడు. వీటితో తనకి చక్కటి అనుబంధం. ఇలా అభిరుచులతో అనుబంధం ఏర్పరచుకున్న ఆమె, తన అన్ని సంబంధబాంధవ్యాలతో ప్రేమగా నిత్యనూతనంగా నిలకడగా ఆనందంగా ఉండగలుగుతున్నారు.
ఈ కాంక్రీట్ కట్టడాల్లో, ఉరుకుల పరుగుల కాలంలో... ప్రకృతి, భావుకత్వంలతో జీవించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా...ఒక మిత్రురాలి సందేహం. ఊహు...నా ఉద్దేశ్యం తనని అనుసరించమని కాదు, చక్కటి అభిరుచులు ఇచ్చే మానసిక, శారీరిక ఉల్లాసాలు అత్యద్భుతమని తెలుసుకోమంటున్నాను. 
అందరం  ప్రకృతిశక్తితో అనుబంధం ఏర్పరచుకొని జీవించడం సాధ్యం కాదు కానీ, అసంతృప్తి లేకుండా, జీవించడం అసాధ్యం కాదు కదా. బాహ్య పరిస్థితుల మీద, ఆనందం ఎప్పుడు ఆధారపడదు. అది మన మనస్సులోని 
కదిలాడే భావాల పరిస్థితి మీద ఆధారపడి వుంటుంది. మానసిక ఉల్లాసం ఇచ్చే క్రొంగ్రొత్త దారులు కోకొల్లలు. ఎవరి అభిరుచులుకు తగ్గట్లు ఆ అభిరుచులతో అనుబంధం ఏర్పరచుకొని నచ్చిన మార్గంలో పయనిస్తే జీవనగమనం సవ్యంగా సాగదా? అయితే అభిరుచుల అన్నింటా అంతర్లీనంగా, ఇది అంతా భగవంతుని సృజన, ప్రతిభ అన్న స్పృహ, భగవత్ప్రేమ ఉంటే ఆ పొందే ఆనందంలో నిండుతనం ఉంటుందని నా భావన.
గమనించండి... మంచి ఆరోగ్యకర అభిరుచులతో(పుస్తకపఠనం, చక్కటి సంగీతమును ఎంజాయ్ చేయడం, మంచిపాటలువినడం, హయిగా పాడుకోవడం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం మొ||) అనుబంధం ఉంటే మనస్సు హడావిడి తగ్గిపోతుంది ముందు. మనస్సెంత సందడి లేకుండా నిర్మలంగా వుంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది.

మంచి చెడు, కష్టం సుఖం, రాత్రి పగలు, చీకటి వెలుతురు...ఇలా ద్వంద్వాలతోనే జగత్తు ముడిపడి ఉంది.  కొన్ని బంధాలు బాగా బాధపేట్టేవిగా ఉంటాయి. రెచ్చగొట్టేవారు, చిచ్చు పెట్టేవారూ ఉంటారు. వారికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. అవే గుణాలు మనలో ఉంటే మార్చుకోవడం మంచిది. అహం, సంకుచిత్వం, స్వార్ధం ఉన్నవారితో కాస్త దూరంగా ఉండవచ్చు. అవే లక్షణాలు మనలో ఉంటే వదిలించుకుంటేనే ఆనందం. ఒకోసారి ఒకొకరికి వారితో వున్నవారి వలన చితికిపోయే స్థితి కలుగుతుంది. అప్పుడు వారు, వారివారి అనుభవాల బట్టి వారి బంధాలను నిర్ణయించుకుంటారు. అది ఇక్కడ చర్చాంశం కాదు. 
                          
ఇక నాలో నాకు నచ్చనిరెండవ అంశం - నన్ను ఎవరైన నొప్పిస్తే మాటకు మాట అన్నట్లుగా, వెంటనే బదులిచ్చి వార్ని నొప్పించలేక, వారే తెలుసుకుంటారు వారి తప్పుని, అన్న భావంతో మౌనమైపోతాను కొద్దిరోజులు. నా ఆత్మీయ నేస్తాల్లో ఓ ఇద్దరు అప్పుడప్పుడు వారి మాటలతో, చేతలతో బాగా గాయపరిచేవారు. వారిని ఏదో అని బాధపెట్టలేక, వారే తెలుసుకుంటారు వారి తప్పుని అన్న భావనతో, మౌనమైపోయేదానిని కొద్దిరోజులు. తర్వాతమాములుగా మాట్లాడేదానిని. కానీ చిత్రమేమిటంటే, వారు తప్పును గ్రహించేవారు కాదు, అదే నడవడిక... ఎందుకిలా జరుగుతుందని... నాలో ఏమైన లోపముందేమోనని స్వీయ పరిశీలన చేసుకునేదానిని. నా తప్పు నాకు తెలియరాక, సూటిగా వార్నే అడిగేదానిని... నాలో ఏమైన లోపాలున్నాయా...చెప్తే సరిదిద్దుకుంటానని. ఏమీ లేవనేవారు. మీ ప్రవర్తన నన్ను నొప్పిస్తుంది అని కూడా చెప్పేదానిని. కొద్దిరోజులు బాగా ఉండేవారు. ఆపై మరల మాములే. నేనే సర్ధుకుపోయేదానిని బంధానికి విలువనిస్తూ. కానీ, నా ఈ బలహీనత వారికి ఆట అయింది. కోపం వచ్చిన రెండు మూడు రోజులే... తనే మరల మాట్లాడుతుంది అన్న భావన వారిది. ఇది సరికాదని నాకే అనిపించి, వారంటే ఎంత అభిమానం ఉన్నను, వారికి కారణం చెప్పి, పూర్తిగా మౌనమైపొయి, కొన్ని నెలలు అయింది. కొన్ని పరిచయాలు మనకు ఎంతో దూరంగా ఉన్నా, దగ్గరనిపిస్తాయి. కొన్ని బాంధవ్యాలు ఎంత దగ్గరగా ఉన్నా, దూరంగా అనిపిస్తాయి.
ఎందుకో మరి కొందరు మనస్సుకు చేరువుగా వచ్చి బరువుగా మారిపోతుంటారు. ప్చ్... మనస్సు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానముండదు. ఒకోసారి మనస్సుకు తగిలిన మాట చాల లోతుగా గాయం చేస్తుంది. కాలానికి కూడా దానిని మాన్పించే ఔషదం దొరకకపోవచ్చు. ఈ విషయం గ్రహించి చక్కటి చేతలతో, చల్లని మాటలతో, చిక్కటి బంధాలకు శ్రీకారం చుడితే బాగుంటుంది. 

ఆపేక్ష సత్సంబంధాలకు పునాది. మంచివ్యక్తిగా ఉండటంకన్నా, ఆపేక్ష చూపించగల మనిషిగా ఉండటం తృప్తినిస్తుంది. 
అర్ధం చేసుకోగల మనస్తత్వం, ప్రేమతత్వం, క్షమాతత్వం వున్నప్పుడే అన్ని అనుబంధాలు చక్కగా అమరుతాయి.
మనజీవితం ఆనందాన్ని వెతుక్కునేదిగా కాకుండా ఆనందాన్ని పంచుకునేదిగా అయినప్పుడు మన అనుబంధాలు అద్భుతంగా రాజిల్లుతాయి.

నా బంధువొకామె, నేను ఫోన్ చేసి మాట్లాడేసరికి ఆశ్చర్యంతో అమితానందంగా, నిజంగా నీవేనా...నీవేనా అక్కా... మాట్లాడుతున్నది... మన పెద్దవారి మధ్య స్పర్ధలు రావడం ఏమిటో, వారి ఆంక్షలకు... వారి పిల్లల కుటుబాలు కుటుంబాలు దూరమవ్వడం ఏమిటో, ఇప్పటికీ అర్ధం కాదు. ఆ పెద్దలు ఇప్పుడు లేరు కానీ,  ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది కష్టసుఖాల్లో కూడా కలుసుకొలేంతగా! ఎన్నోసార్లు అనుకున్నాను, నీతో మాట్లాడలని...కానీ, నీగురించి ఎప్పటికప్పుడు చాలామందిని అడిగి తెలుసుకుంటాను. ఒకప్పుడు తరచుగా మాట్లాడేదానివని, ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు వెళ్ళి తక్కువగా మాట్లాడుతున్నావని వినడంతో, బంధాలు మరల గుర్తుచేయడం ఎందుకని మాట్లాడలేకపోయానని... ఎన్నో చెప్తున్న తనని, ఒక ప్రశ్న అడిగాను - ఆధ్యాత్మికం అంటే ఏమిటమ్మా అని. 

చక్కటి మంత్రాలతో పద్ధతిగా పూజలు చేయడం, శ్లోకాలు వల్లెవేయడం, ఎప్పుడూ భగవంతుని ధ్యానంలో ఉండడం, ప్రాపంచిక విషయాలు పట్టించుకోకపోవడం, బంధాలకు దూరంగా ఉండడం, ఏ ఆలోచనలూ లేకుండా ఉండడమే కదక్కా ఆధ్యాత్మికత్వం...
తన భావన అర్ధమై, నాకు తెలిసినంతలో చిన్న వివరణ ఇచ్చానిలా - 
ఆధ్యాత్మికత అంటే మంత్రాలు వల్లెవేయడాలు,  శ్లోకపూరిత అనుష్టానాలూ కాదమ్మా. ప్రాపంచికతను పట్టించుకోకపోవడం కాదు, బంధాలును వదిలించుకోవడం కాదు. ఆధ్యాత్మిక పయనం పలాయనవాదం కాదమ్మా. 
ఆధ్యాత్మికత అంటే - తొలుత అపార శ్రద్ధ, నమ్మకం, భక్తితో కూడిన దైవచింతనగా మొదలై, క్రమేణా మానసిక పరివర్తనకు దారితీయడం. దైవత్వం అంటే ఏమిటో అవగాహనకు రావడం. ధ్యానాదులచే మనలోనికి మనం చూసుకోవడం. మనోశుద్ధతకై 
యత్నించడం. పరిపక్వత చెందడం...ఇలా ఒకో మెట్టు అధిరోహిస్తూ, ఆత్మతో అనుబంధం ఏర్పర్చుకోవడం. 
ఆధ్యాత్మికత ఒక్కటే మనిషి దైనందిక జీవితంలో సృజనాత్మక వైఖరిని ప్రవేశపెట్టి, ఆనందమయమైన మనుగడను ఇస్తుంది. ఆధ్యాత్మికత మనిషిని ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితిలోనికి తీసుకెళ్ళే చైతన్య స్రవంతి. ప్రేమ కరుణ కృతజ్ఞతల కలబోత ఆధ్యాత్మికం. అందుకే, ఆధ్యాత్మికతత్వాన్ని జీవితం నుండి విడదీసి చూడకు, అలా విడదీసి చూస్తే అది ఆధ్యాత్మికమే కాదు. ఇది మనల్ని మనకి చూపిస్తుంది. మానసిక కాలుష్యాన్ని తొలగిస్తుంది, మనకి ఏది అక్కర్లేదో ఏది కావాలో తెలుపుతుంది, అంతర్గత శక్తిని పెంచుతుంది. జీవితం మీద ప్రేమ నశించపోకుండా ఉండటానికి, ప్రాప్తించిన దాంతోనే సంతోషంగా సంతృప్తిగా జీవించడానికి, సంపూర్ణత్వం తీసుకురావడానికి దోహదపడుతుంది. జరిగే అన్నింటినీ అంగీకరించడం నేర్పుతుంది. సరళంగా, సదావగాహనతో, సానుకూలంగా జీవించడం అలవర్చుతుంది. జరిగే సంఘటల వలన మనకి సుఖదుఃఖాలు కలగవు, మన కర్మల ఫలితంగా సుఖదుఃఖ అనుభవాలను పొందాలి కాబట్టి, ఆయా సంఘటనలు జరుగుతున్నాయనే అవగాహన వస్తుంది. ఆధ్యాత్మికం వలన సుఖదుఃఖాలు తొలగవు. సుఖదుఃఖాలను కూడా ఆనందంగా అంగీకరించే శక్తినిస్తుంది. మితిమీరిన మనో వ్యాపకములన్నీ మరణమృదంగములే అని గ్రహింపుకుతెచ్చి ఆ వ్యాపకాలను తగ్గించుకొని జీవనగమనం ఇష్టంగా (ఇలా వుంటేనే కావాలి అనిపించడం ఇష్టం)కాకుండా, ప్రేమతో (ఎలా వున్నా కావాలి అనిపించడం ప్రేమ)సాగేటట్లు చేస్తుంది. ఇక, ఆలోచనలు ఎవరికీ అస్తమించవమ్మా, కాకపొతే ఆలోచనలలో కామ్యకమైన ఆర్తి చల్లబడుతుంది, అంతే! ఇది అర్ధమౌతే, అన్నీ అవే అవగాహనకొస్తాయిరా... అని సంభాషనను ముగించి ఇవన్నీ స్మరణలో పదిలపర్చుకుంటుండగా, వాట్సాప్ లో ఓ విడీయో...ఆ విడీయో నచ్చి దానిని పదిలపరుస్తున్నాను ఇక్కడ -
                            

22 కామెంట్‌లు:

  1. ఓపికతో విలువైన విషయాలు వ్రాశారు. అయితే మనసిప్పాలని అని వ్రాయడం సరికాదు. మనసు విప్పాలని అని వ్రాస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. ' చెప్పాలని ఉందని మన
    సిప్పాలనిఉం ' దనే విశిష్టపు హెడ్డింగ్
    అప్పాల భోజనోపరి
    కప్పురపున్ విడెము సేయు కళ నొప్పారెన్ .

    రిప్లయితొలగించండి
  3. భావమునం దుదాత్తతయు , భాషపయిన్ గడు పట్టు , దైవ సం
    సేవన మార్గ దేశికత , చింతన , పారణ , బ్రహ్మవిద్యలో
    చేవ , యనేక గ్రంధ పరిశీలన చేసిన ధారణల్ , మిమున్
    కేవల వ్యక్తిగాగ గమకింతుమె ? భారతిగారు ! బ్లాగులన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంతకంటే వివరంగా భారతిగారిని వివరించడం కుదరదు।

      తొలగించండి
    2. నమస్తే మాస్టారు గారు.
      అతి సామాన్యురాలిని సర్.
      ఇంకా తెలుసుకొనవలసినది, నేర్చుకొనవలసినది చాలా వున్నది.
      మీ స్పందనకు మనసార ధన్యవాదాలు.

      తొలగించండి
    3. అన్యగామి గారు,
      చాలాకాలానికి.
      బాగున్నారా?
      మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు.

      తొలగించండి
  4. భారతిగారు మీ ఈ టపా నాకు ఎంతగానో నచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న మావారికి, ఊరి నుండి వచ్చి ఉండిపోయిన మా బాప్పకు ఈ టపా చదవమని ఇస్తే చదివి, అదేమిటీ కొన్ని మనకొసమే రాసినట్లు ఉన్నాయి...మనం ఆవిడకు తెలుసా అని బాప్ప అంది. ఎన్నో ఎందరినో పరిశీలించి ఆవిడ అనుభవాలు కూడా జొడించి రాసారు. అందుకే కొన్ని కొన్ని మనకి అన్వయించి రాసినట్లు అనిపిస్తుంది అని మావారు అన్నారు. మీ పోస్ట్స్ ఎప్పుడూ ఏదోకటి నేర్పిస్తుంటాయి

    రిప్లయితొలగించండి
  5. ఎదుటివారి కోణంలో ఆలోచించడం, లోపంలేని వ్యక్తి ఎవరూ ఉండరు, అతిగా స్పందించడం, ప్రేమతో మాట్లాడండి,సరిచేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయండి,సంతోషమన్నది బాహ్య పరిస్థితులమీద కాదు మానసిక వైఖరి పై ఆధారపడి ఉంటుంది, మొదలగు మాటలు చాల ఆలోచింపజేసాయి. నాలో తప్పులు తెలియజెప్పాయి. ఎవరైన ఏదైన అంటే అతిగా స్పందించి వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా నేనిలా నేనలా అంటూ నన్ను నేను సమర్ధించుకుంతూ తెలివైనదాన్ని మంచిదానిని చక్కటి ప్లానింగ్ నాది ఇలా నన్ను నేను ఉన్నతంగా exhibit చేసుకునేదానిని. తప్పని తెలిసిన అంగీకరించని అహం. మీ పోస్ట్ చదివాక అహం వీడి కొందరుతో మాట్లాద్డాను. తప్పొప్పులు అంగీకరిస్తూ ఆనందంతో కన్నీటిపర్యతమయ్యాం. నిజంగా చాలా realize అయ్యాను. మనస్సు తెలికైంది భారతిగారు మనస్పూర్తిగా మీకు ధన్యవాదములు





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రియలైజ్ అయ్యాను...గొప్ప మాట.👏
      సంతోషం వసుంధర గారు

      తొలగించండి
  6. స్మరణ భారతీయ ఙ్ఞాన విపంచిక
    నన్ను బోలు నట్టి నరుల మీటి
    చక్కజేసి మిగుల సత్కృతి వడసెను
    ఫలిత మిదియె మంచి పనుల వలన .

    రిప్లయితొలగించండి
  7. ఆధ్యాత్మికత గురించి మీరు వ్రాసినది చాలా నచ్హింది.

    రిప్లయితొలగించండి
  8. ఉదయం నుండి రెండు మెయిల్స్ పెట్టాను మీ నుండి ఎటువంటి రిప్లై లేదు. గాభరాగ ఉంది. మీరు ఉంటుంది ఎల్ జీ పాలిమర్స్ దగ్గరే కదా ఎలా ఉన్నారు భారతిగారు క్షేమమేనా అందరూ...

    రిప్లయితొలగించండి
  9. పద్మ గారు,
    మేం ఎల్జీ పాలిమర్స్ కు సుమారుగా 3.5km దూరంలో ఉన్నామండి. మాకు ఈ లీకేజ్ ప్రభావం తక్కువగానే ఉంది. 12 గంటలు వరకు వుండివుండి కాస్త హార్డ్ గా గ్యాస్ వాసన రావడంతో, కాస్త ఆందోళనగా ఉండడంతో
    ఉదయం నుండి మెయిల్స్ చూడలేదండి. తగు జాగ్రత్తలతో ఇంట్లో సురక్షితంగా ఉన్నామండి. ప్రమాదం తప్పినట్లేనండి. మీ అభిమానముకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి
  10. భారతిగారు ఎలా ఉన్నారు? మాధవధార, మురళీనగర్, మర్రిపాలెం తదితర ప్రాంతల వారంతా మరల గ్యాస్ లీక్ కావడంతో అర్ధరాత్రప్పుడు వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లు వార్తల్లో చూసాను. ఎలా ఉన్నారండి? నా ఫోన్ నంబర్ అడ్రెస్ మెయిల్ పెట్టాను. మా ఇంటికి వచ్చేయండి మీరందరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడు నాలుగు ప్రాంతాల వారు అర్ధరాత్రి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసారు. మేమున్న చోట ఇదే పరిస్థితి. మా టెనెంట్స్ ను తీసుకొని మా అమ్మాయి ఇంటికి రాత్రి వెళ్ళి ఇప్పుడే ప్రమాదం లేదని నిర్ధారించుకుని తిరిగి వచ్చాం. అందరమూ క్షేమమేనండి పద్మగారు.

      తొలగించండి
  11. భారతి గారి కుశల వార్త ముదావహం . అయినా ,
    మరికొన్ని రోజులు ముందు జాగతరత్త పాటించండి .
    నమ్ముకున్న వాళ్ళను పరమాత్మ సదా కాపాడు కుంటాడు . నమస్సులు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే మాస్టారు గారు. తగు జాగ్రత్తలతో క్షేమంగానే ఉన్నామండి. కానీ, నిన్న తెల్లవారుఝామున మాకు దగ్గరున్న ప్రాంతంలో...చూస్తుండగానే ఎక్కడివారు అక్కడ పడిపోవడం... అక్కడ దృశ్యాలు హృదయవిదాకరం.
      ఇక నిన్న అర్ధరాత్రి...కార్లు మీద వెళ్ళేవారే కాదు, పసికందులును ఎత్తుకొని కొందరు, చిన్నపిల్లలు మొదలు వృద్ధులు వరకు కాలి నడకన నా కనుల ముందు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడం...మనస్సును కలచివేసింది. బాధగా ఉంది మాస్టారు గారు.

      తొలగించండి
  12. భారతి గారు,
    మీ క్షేమం గురించి సమగ్రమైన వార్త తెలిసిన తరవాత మనసు కుదుట పడిందండి. మీరంతా గండం గట్టెక్కినందుకు అమ్మకు కృతజ్ఞత. శ్రీ మాత్రేనమః
    సంఘటన గురించి మొదటగా వచ్చిన వాట్స్ ఆప్ వీడియోలు చూసి కడుపుతరుక్కు పోయిందండి.కొంతమంది బలైపోయినందుకు బాధగా ఉందండి.పద్మగారు చూపిన చొరవకి ఆనందం కలిగిందండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారమండి.

      >> మీ క్షేమం గురించి సమగ్రమైన వార్త తెలిసిన తరవాత మనసు కుదుట పడిందండి.

      మీ అందరి ఆశీస్సులు శ్రీరామ రక్ష. మీ మీ
      ఆత్మీయత మనస్సును సేద తీర్చుతుందండి.
      ఇది ఒక విషాదకర ఘటన. విషవాయువు ప్రభావంతో కొందరు మరణిచడం, కొందరు అపస్మారకస్థితికి వెళ్ళడం, చాలామంది అస్వస్థతకు గురవ్వడం...బాధాకరం. వ్యక్తిగత పరిచయం లేకున్నా పద్మగారు చూపించిన అభిమానం, ఆపేక్ష...తన దొడ్డ మనస్సుకు 🙏



      తొలగించండి

  13. మీరు చెప్పింది బాగుంది కానీ; ఈ రోజుల్లో ఎవరండీ ఇంతలా బంధాలు గురించి ఆలోచించేది? ఆత్మీయత అనుబంధాలను త్రుంచుకుంటున్నారు, అహాన్ని పెంచుకుంటున్నారు.

    వాస్తవాన్ని అంగీకరించలేని ఈ "అహం"
    ఒక నయంకాని "రోగం"

    తాము పట్టుకున్న కుందేలుకి మూడేకాళ్ళు అన్నటువంటి బాపతులకి ఈ అనుబంధాలు విలువ ఎన్నటికీ తెలియరావండి...

    - లలిత

    రిప్లయితొలగించండి