8, అక్టోబర్ 2021, శుక్రవారం

సాయి సర్వజ్ఞత

 ఈ మధ్య నా స్నేహితురాలు తన బ్లాగ్ లోమృత్యుంజయుడు - శ్రీ సాయిబాబా అనే చక్కటి టపా పెట్టారు. అయితే ఆ టపాకు సంబంధం లేని  ప్రశ్నలను ఓ అజ్ఞాత గారు  వ్యాఖ్యగా పెట్టారు. 

ఆ ప్రశ్నలు  ఏమిటంటే  - బాబా దేవుడా? గురువులకు గుడులేమిటి?

ఇటువంటి ప్రశ్నలు అప్పుడప్పుడు అక్కడక్కడ వినిపిస్తున్నాయి.
ఇలాంటి ప్రశ్నలు వింటున్నప్పుడంతా - శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ నండూరి శ్రీనివాసరావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, శ్రీ పరిపూర్ణానంద స్వామివారు లాంటి పూజ్యుల ప్రవచనాలు... అలాగే, నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలు గుర్తుకొస్తాయి. పై ప్రశ్నలకు సమాధానం చిన్నగా స్ఫురిస్తుంది. ఆ స్ఫురణే ఈ టపా.
ఈ ప్రశ్నలకు సమాధానం నేను సరిగ్గా చెప్పలేకపొతే అది నా అవగాహన లోపంగా, తప్పిదంగా గుర్తించి మన్నించవల్సిందిగా మనవి.
ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు దైవం, దైవత్వం, గురువు, గురుతత్వం, జీవుడు, శివుడు అంటే ఏమిటో కొంత అవగాహన చేసుకుందాం. 

భారతీయ వాంగ్మయాల ప్రకారం - ఈశావాస్యమిదం సర్వం...ఈ సర్వసృష్టీ ఈశ్వరమయం. సర్వత్రా నిండి నిబిడికృతమై వున్న పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వ వ్యాపకుడు, సర్వ శక్తిమంతుడు సర్వేశ్వరుడని దృఢంగా విశ్వసించే సంస్కృతి మనది. 

అంతటా, అన్నింటిలో పరమాత్మను దర్శించి, తరించమని తెలియజెప్పే విశిష్టమైన ధర్మమే హిందు ధర్మం.   

దేవుడు ఒక వ్యక్తి కాదు - ఒక తత్త్వం...మహాతత్త్వం. ఆ తత్త్వాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరింపజేసేదే హిందూధర్మం.

దేవుడు ఎక్కడో ఒక లోకంలోనో, ఒక ప్రాంతంలోనో,
ఒక మూలనో... ఉన్నాడని కాదు, అనంతమై, అఖండమై అంతటా నిండి, అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడనే తత్త్వాన్ని ప్రబోధిస్తుంది మన హిందూ ధర్మం. 
                    

ఈ చరాచర ప్రకృతి అంతా భగవత్స్వరూపమే. అందులో భాగమైన మానవుడు కూడా మాధవుడు కాగలడని నిరూపింపజేసేదే హిందూ ధర్మం. 

ఈ నిబద్ధతతో కూడినవే మన సంస్కృతి సంప్రదాయాలు.

సమస్త సృష్టిని సృజించే అద్భుతశక్తిని దైవంగా విశ్వసించి, నిరాకారుడును చంచలమైన మనస్సుతో పట్టుకోలేం కాబట్టి, ఆదిలో ఓ రూపాన్నో, నామాన్నో ఆశ్రయించి ఆరాధిస్తుంటాం, అర్చిస్తుంటాం, అభిషేకిస్తుంటాం. ఈ రీతిగా సాగే గమనంలో ఏదో ఒక తరుణంలో అనిపిస్తుంది దైవాన్ని దర్శించాలని. ఇక ఆ దిశగా సాధన మొదలెడతాం. అయితే, దైవాన్ని శోధించాలంటే ఓ ఆలంభన కావాలి. ఆ ఆలంభనే గురువు. 
                        

పలు రూపాల్లో, పలు నామాల్లో దైవత్వాన్ని కాంచి, పూజించి తృప్తి చెందుతున్న భక్తులను - కళ్ళు మూస్తే ధ్యానం లోనూ, తెరిస్తే ప్రకృతి లోనూ "దైవాన్ని" చూడగలిగే స్థాయికి తీసుకెళ్ళినవారే గురువులు. కోరుకున్నదే కాక, కోరుకోవల్సింది కోరుకోకపోయినా అపార కృపతో అనుగ్రహించేది గురువే. 
                        

జీవుల క్షేమం యోగక్షేమం వహించేవాడు గురువు. మనలో వున్న ఈశ్వరుడుని దర్శించే దారి చూపేవారే  సద్గురువులు. 
గురువులు - పరతత్త్వ స్పర్శను అందివ్వడానికే ఈశ్వరాంశతో అవతరిస్తుంటారు. పరతత్త్వం  గురుతత్త్వం ధర్మానుబద్ధుడై జీవించేటటువంటి వ్యక్తిని ఆశ్రయించి వుంటుంది. ఆ రూపం ద్వారా మనకి అందుతుంది. మొదట ఆ వ్యక్తిలో గురుతత్త్వం చూసి, ఆ గురువు పాదాలను ఆశ్రయించగా,  అప్పుడు ఆ వ్యక్తిలో పరతత్త్వంతో సంబంధం ఏర్పడుతుంది. కానీ; ఆ వ్యక్తిలో ప్రస్ఫుటమయ్యే గురుతత్త్వాన్ని, దైవత్త్వాన్ని గుర్తించక వాటిని వదిలి, మనం నిర్వచించుకొనే దేవుడి  కోసం వెతకడమే అసలైన సమస్య...ఫలితంగా అనేక సందేహాలు. 
                       

స్వీయ సాధనతో, స్వానుభవంతో తప్పా, వేరొక్కరి అభిప్రాయాలతోనో, అనుభవాలతోనో దైవాన్ని దర్శించలేం. అందుచే అంతర్యామిని తెలుసుకోవాలంటే సరైన సాధన చేయాలి. సద్గుణ శీలత్వమును తొలుత అలవర్చుకోవాలి. 
                       

సద్గుణ శీలత్వమే దైవత్వం. అందుకే సాధకులు దేవుడి కంటే దైవత్వం మీదకు దృష్టి మరల్చి, తమలో దైవత్వాన్ని పెంపొందించుకునే దిశగా సాధన చేయాలని ఋషులు చెప్తారు. అప్పుడే సాధన సరళంగా, మానవత్వం నుంచి దైవత్వం దిశగా సాగుతుంది. 

దాచిన ధనం...నిన్ను ధనవంతుడ్ని చేస్తుంది.
దానం చేసిన ధనం...ధర్మాత్ముడిగా నిలుపుతుంది. 
నీవు సంపాదించిన ధనం...కాటి వరకైన రాదు. 
నీవు  సంపాదించిన ధర్మం...దైవం దరికి చేరుస్తుంది.
                       

మానవత్వానికి మించిన దైవత్వం లేదని, అందుకే మానవత్వాన్ని, సేవా తత్పరతను ముందు అలవర్చుకోమని పెద్దలు చెప్తుంటారు. దైవత్వాన్ని పొందడానికి మానవత్వమే పునాదిరాయి.  మానవత్వం పరిపూర్ణంగా వెల్లివిరియడమే దైవత్వం.
ఏకత్వం, దైవత్వం, మానవత్వం లను ప్రతిబింబించేవే మన సంస్కృతి సంప్రదాయ ధర్మాలు.

ఇక బాబా గురించి - 

సనాతన ధర్మవిహితమైన సంప్రదాయం దత్తాత్రేయుల అవతారంతో మొదలవ్వగా, అప్పటినుండి 
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా కాకుండా, విశిష్టమైన లక్షణాలతో, విలక్షణమైన చర్యలతో, చక్కటి బోధలతో, 
తగు శిక్షణలతో, మానవులలో ఉత్తమ గుణాలను పెంపొందించే విధానంతో కొనసాగింది దత్తావతార పరంపర.
 
జీవులలో పేరుకుపోయిన మనోమాలిన్యాలను, పూర్వ పాపాల ప్రారబ్ధ కర్మలను తమ స్మరణ చేత తొలగించి, లోభపూరిత సంచిత కర్మలను తమ సద్భోధల చేత సరిజేసి, ఆర్తులను ఉద్ధరించి సంస్కరించే అవతారాలే ఈ దత్తావతారులు.

దత్తావతార పరంపరలో దత్తావతారులుగా 
శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్యప్రభువు, అక్కల్ కోట మహారాజు, సాయిబాబా లను చెప్తుంటారు. 
                      

మొదట శ్రీ సాయి, శిరిడి గ్రామ పొలిమేరలో ఒక వేపచెట్టు క్రింద సుమారు పదహారు సంవత్సరాల బాలుడుగా ప్రకటితమై, ఆ పిమ్మట కొంతకాలానికి, పెండ్లివారితో పాటు వచ్చి ఖండోబా ఆలయపూజారిచే "ఆవో బాబా" అని స్వాగతింపబడి, భక్తులు పెట్టిన "సాయిబాబా" అనే పేరుతో, అందరి కోరిక మీదట అక్కడే స్థిరపడ్డారు.

ఆ కాలంలో శ్రీ జనార్ధన స్వామి అనే మహనీయులు తన శిష్యుడైన ఏకనాధుడనే ప్రఖ్యాత భక్తునికి దుర్లభ్యమైన శ్రీ దత్తాత్రేయులవారి భౌతిక రూపాన్ని దర్శింపజేస్తానని చెప్పి, శ్రీ సాయినాధుడిని దర్శింపజేసి వీరే దత్తాత్రేయులని తెలిపిరి.
                     

ఆధ్యాత్మిక విద్యను మానవులకు ఆచరణ ద్వారా అందించిన శ్రీ దత్తాత్రేయులవారే శ్రీ సాయినాధునిగా అవతరించారని పూనా వాస్తవ్యులైన శ్రీ గుళవణీ మహారాజ్ వారు చెప్పారు.

శ్రీ సాయి పరమ గురువనీ, తమ కంటే ఎంతో అధికులని ఖేడ్గాం నివాసి శ్రీ నారాయణ మహరాజ్ అనే సిద్ధ పురుషుడు చెప్పారు. 

ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిపాలించడానికి విభిన్న సాంప్రదాయాలకు చెందిన సద్గురువులు, మహనీయులు ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తుంటారనీ, అందులో శ్రీ సాయినాధుడు మహిమాన్వితుడని, అవతార్ మెహర్ బాబా చెప్పారు.
ఇలా ఎందరో యోగులు, మహనీయులు చెప్పిన సత్యాన్ని, సామాన్యులమైన మనం సందేహించడం తగునా? 

ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, మానవత్వంతో తోటివారికి సహాయపడే వ్యక్తిని, కష్టాల్లో వున్న వారిని ఆదుకునే వ్యక్తిని, నీవు మనిషివి కాదు మా పాలిట దేవుడవయ్యా అని ఆనందంతో కృతజ్ఞతగా మనసార అంటాం. 

అలాంటిది ప్రేమగా మన కష్టాలను తాను స్వీకరించి, తనకి చేకూరిన శక్తుల్ని మనకై దారపోసే బాబాని దేవుడు అనడం  తప్పు కాదు కదా. 

పుట్టామా, బ్రతికామా, మరిణించామా అన్నట్లు బ్రతికేవారు కొందరు. ఇతరులను బాధపెట్టో, గాయపరిచో, అణిచో, పడగొట్టో, దోచుకునో బ్రతికేవారు కొందరు. తమ శక్తి కొలది సంపాదించి,  ఎవరెలా ఉంటే నాకేంటి ... ఉన్నంతలో నేను హాయిగా  సుఖంగా వుంటే చాలనుకొని బ్రతికే ఉదాసీనులు కొందరు. ఈ మూడు పరిధులను దాటి జనహితం కోసం, విశ్వశాంతి కోసం తన శక్తిని, యుక్తిని, సామర్ధ్యాన్ని అర్పించిన మానవుడు మాధవుడే అన్నది ధర్మవచనం. 
                      

మరి తన తపఃశక్తిని, యోగశక్తిని మన హితం కోసం, మన ఇహపర సౌఖ్యాల కోసం వినియోగించిన సాయిని దైవం అనడం ధర్మ సమ్మతమే కదా. 

జనన మరణ చక్రభ్రమణంలో పడిన జీవులందరికీ, అనన మలం(జీవుడికి స్వతఃసిద్ధంగా ఉండే అజ్ఞానం), కాయిక మలం(కర్మల ద్వారా వచ్చే మాలిన్యం), మాయిక మలం (మనస్సులో ఆలోచనలు, సంపర్కాలు వల్ల ఏర్పడే మాలిన్యాలు) అనే మాలిన్యాలు ఉంటాయి. ఈ మాలిన్యాలు ఉంటే జీవుడు. ఈ మాలిన్యాలు లేని శుద్ధమైనవాడు శివుడు అన్నది శాస్త్ర వచనం. 
మరి ఈ మాలిన్యాలు లేని (సాయి సచ్చరిత్ర చదివిన అందరికీ ఇది విదితమే) సాయిని దైవమనడం శాస్త్ర సమ్మతమే కదా.

దృష్టి దోషం, శ్రవణ దోషం, వాక్ దోషం, మనో దోషం, క్రియా దోషం... ఈ పంచ దోషాలు లేకపొతే అదే పరమాత్మ స్వరూపం అని ఋషులు తెలిపారు.
మరి ఈ దోషాలకి అతీతంగా ఉన్న సాయిని దైవమనడం సమంజసమే కదా. 

శ్రీరాముడే దైవమని కొందరు, శ్రీకృష్ణుడే దైవమని కొందరు, శివుడే దైవమని కొందరు, అమ్మ ఆదిపరాశక్తే దైవమని కొందరు...వివిధ భావనలు.
స్వర్ణాభరణాలు వివిధ రకాలు. వేర్వేరు రూపాలు...కానీ; అందులో నిబిడికృతమై ఉన్నది బంగారమే. అలానే దైవ స్వరూపాలు వేర్వేరు...నిబిడికృతమై ఉన్నది మాత్రం మూలతత్త్వమే. 
                    

బాహ్యదృష్టిలో చూసినప్పుడే అంతటా భేదం కనిపిస్తుంది. ఒక్కసారి గురువు ద్వారా సంస్కరింపబడిన సాధకుడు అంతర్ముఖత చెంది, తనలో అవగతమయ్యే తత్త్వాన్ని గుర్తిస్తే, అదే పరిపూర్ణ స్థితి. ఈ స్థితిని పొందిన సాధకునికి ఏ భేదమూ ఖేదమూ వుండవు. ఒక్కటైన తత్త్వమే భాసిస్తుంది. దీనినే దైవమనీ, మూలతత్త్వమనీ, అంతిమ సత్యమనీ పరతత్త్వమని చెబుతుంది శాస్త్రం.

అన్వేషిస్తే 'సత్యం' అవగతమవుతుంది. విచారణ చేస్తే 'సత్యం' చేరువవుతుంది. ధ్యానిస్తే 'సత్యం' స్థిరమై వుంటుంది. సందేహిస్తే 'సత్యం' అగోచరమవుతుంది.
అందుకే సుందర చైతన్యానందులు వారు అంటారు - "మనసును తగిలించుకుంటే మానవుడువి అవుతావు, మనస్సును విడిపించుకుంటే మాధవుడువి అవుతావు" అని!
                        

ఆంతర్యామి తత్త్వాన్ని అర్ధం చేసుకొని ఉన్నదంతా ఒకటే చైతన్యం...దైవం అని గ్రహించి, భాగవతం దశమ స్కంధంలో అత్యద్భుతంగా బమ్మెర పోతన చెప్పింది ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేను. 
తనువున నంటిన ధరణీ పరాగంబు, పూసిన నెఱిభూతి పూతగాక... అనే పద్యం నందు - 
తన శరీరమంతా దుమ్ముకొట్టుకుపోయేలా ఆటలాడుకుంటున్న కృష్ణయ్య దివ్యమంగళ స్వరూపం - ఒంటినిండా విభూతి ధరించి, ఆనందతాండవం చేస్తున్న పరమశివుడిలా తోచింది ఈ భాగవోత్తముడికి.
యశోదమ్మ -
కన్నయ్య ఉంగరాల జుట్టు పైకి మడిచి ముత్యాలపేరుతో ముడివేస్తే - అది శివయ్య జుటంపై చంద్రవంకలా కనిపించింది మన కవివర్యులకు.
నుదుటిపై తీర్చిదిద్దిన ఎర్రని తిలకంలో - మన్మధుడుని మసి చేసిన ముక్కంటి మూడవకన్ను గోచరించింది పోతనామాత్యులవారికి.
మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిలా నున్న పెద్ద నీలమణి శివుని కంఠంలో హలాహలపు మబ్బులా తోచింది మన బమ్మెర వారికి.
మెడలో హారాలయితే - చెప్పేదేముంది...శివుడు ధరించిన సర్పాలే అని కళ్ళకి కట్టినట్లు అబేధ తత్త్వాన్ని తెలిపారు ఈ అద్వైత జ్ఞాని. 

బాబా కూడా ఎందరికో ఎన్నో రూపాల్లో దర్శనం ఇచ్చారు.  
                    

కొందరికి  పండరీనాధునిగా, జిన్నూరు నాన్నగారికి హనుమంతునిగా, నా స్నేహితురాలికి (వనితావని వేదిక బ్లాగర్) ఉగ్ర నరసింహస్వామి రూపంలో, ఓ  సత్సంగ మిత్రురాలికి శివునిలా....ఇలా ఎందరికో అబేధ తత్త్వాన్ని తెలిపే ఎన్నో అనుభూతులు. 

మన జీవితంలో ఏదో ఓ తరుణలో సృష్టిమూలాలను అన్వేషించాలనే కోరిక ప్రతీవారికి తప్పకుండా వచ్చి తీరుతుంది. దీనికై తపన పడే ప్రతీ మానవునకు ఈ అవకాశం అందివచ్చే విధంగా చేయకపోతే, వారికి యదార్ధమైన జ్ఞానాన్ని అందివ్వకపోతే, సత్యం తెలుసుకోలేరు కాబట్టి, మన శాస్త్రాలు ఆలయాల ఆవశ్యకతను బోధించాయి.  
ఒకోసారి కొందరికి ఈ సాధక భాదకలనుండి రక్షించేవారు ఎవరు అన్న భావన కల్గుతుంది. వారికై దైవం గురించి తెలియజెప్పడానికి గుడులు కొందరు కడతారు.
మన ముందు తరం వారికి మన మూలాలు ఔనత్యం తెలపాలని కొందరు గుడులు కడతారు. 
                   

ఇక గురువులకు గుడులేమిటి...
బహుశా గురువులకు మఠాలు ఉంటాయి కదా, గుడులెందుకు అని  ప్రశ్నించిన వారి భావన కావొచ్చు...
తమకి మాత్రమే పరిమితం చేసుకోకుండా సమాజంలో అందరికీ బాబా తెలియాలని, బాబా అనుగ్రహం అందరూ పొందాలని, ముందున్న తరాలకి బాబా గురించి తెలియాలని భక్తిప్రపత్తులతో గుడులు కట్టినవారు కొందరు. పారమార్ధిక చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన సాయి దేవుడే అని తమ స్వానుభవంతో ఎఱిగి, భక్తితో సాయికి గుడి కట్టినవారు మరికొందరు. నన్ను నమ్మినవారిని పతనం కానివ్వను. ఎవరైన సరే ఒక అడుగు నావైవు వేస్తే పది అడుగులు వారివైపు వేస్తాను...ఇది బాబా ఇచ్చినమాట. ఈ మాట భక్తుల జీవితంలో ఋజువు కావడం వల్లనే కోట్లాదిమంది బాబాకు భక్తులై ప్రేమతో బాబా మందిరాలు నిర్మిస్తున్నారు. భక్తుల మనోగతం వారి ప్రేమైక చేష్టలు విశ్లేషించడం ఎవరి తరం? గుడులు కట్టిన, పొర్లు  దండాలు పెట్టిన అంతా భక్తి పారవశ్యతోనే.

గుడులు వలన పవిత్రమైన వాతావరణం, ప్రతివారిలో పవిత్ర భావనలు, దైవం యందు నమ్మకం ఏర్పడతాయన్నది సత్యం.  భక్తులు నమ్మి ఆరాధించే దేవుళ్ళును  సందేహించక సమైక్య సామరస్యాలతో ఉండమని బోధిస్తుంది భారతీయ సంస్కృతి.

అజ్ఞాత కృష్ణుడు కోసం నిర్మించిన ఆలయం తన ఆవాసంగా  అడిగి బాబా చేసుకోలేదా...అని అడిగారు. 

సిద్ధపురుషులు, సద్గురువులకు తమ అంతిమ సమయం గురించి పూర్తి జ్ఞానం వుంటుంది. పరోపకారం కోసం అవతరించి, నిశ్చయించుకున్న కార్యం పూర్తయ్యాక, ఇక శరీరాన్ని త్యజించాలని అనుకున్నప్పుడు, ధరిత్రిపై ఒరిగిపోయాక శరీరాన్ని త్యాగం చేసిన చోటును కూడా భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగంలో పెట్టాలని, తమ సమాధిని ఎక్కడ నిర్మించాలో వారే నిర్ణయించేవారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారు, సొరకాయ స్వామివారు, మొగలిచర్ల స్వామివారు తదితరులు ఇలా చేయడం విధితమే కదా. 

బాబా కూడా అలానే నిర్ణయించుకుని, తన సమాధిని బాపూ సాహెబ్ బుట్టీ అనే శ్రీమంతుడిచే నిర్మింపదలచి, శిరిడిలో భవనం కట్టుకోవాలనే సంకల్పం బుట్టీకి కలిగేలా చేసి, పిమ్మట బుట్టీకీ, శ్యామకి ఒకేసారి "పూజాగదితో సహా ఒక వాడాని నిర్మించు" అనే స్వప్న సందేశమివ్వడం... బాబా అనుమతితో పని ప్రారంభించడం... అదే తరుణంలో హాల్ లో రెండు గోడలు కట్టి మురళీధరుణ్ణి ప్రతిష్టించాలని బుట్టీకి అనిపించడం... బాబా అనుమతితో ఆ కార్యక్రమమునూ మొదలుపెట్టడం జరిగింది. వాడా, మందిరం నిర్మాణం పూర్తయ్యే తరుణంలో బాబా అస్వస్థులవ్వడం... బాబా బంగారు పాద స్పర్శ వాడాలో ఉండదా... అని బుట్టీతో సహా అందరూ తల్లడిల్లడం... "నన్ను వాడాలో ఉంచండి" అన్న బాబా అంత్యకాలపు ఆజ్ఞతో, బాబా కృష్ణుడు వేరు వేరు కాదు అన్న అద్వైత తత్త్వసారాన్ని గ్రహించి, అమరకాంతులీనే బాబా పవిత్ర శరీరాన్ని శాశ్వతంగా వాడా మందిరంలో ఉంచడం జరిగింది.
బుట్టి, ఆనాటి శిరిడి వాసులు, భక్తులు అర్ధం చేసుకున్నట్లు మనమూ ఆ అద్వైతసారాన్ని గ్రహిస్తే ఏ సందేహాలకూ తావు వుండదు. 
బాబా అనుగ్రహం తోనే  మందిరం నిర్మించాలనే సంకల్పం నా స్నేహితురాలి శ్రీవారికి కలగడం... వారు బాబా అనుమతి మనసారా కోరుకోవడం... బాబా అనుమతి ఇచ్చిన అనుభూతి పొందడంలో అతిశయోక్తి లేదు... ఆశ్చర్యం లేదు.  బాబా జీవిత చరిత్ర చదివితే ఇలాంటి మహత్తర విషయాలు, అనుభూతులు అర్థమౌతాయి. మందిర నిర్మాణమనే పవిత్ర కార్యమునకు వీలైతే సహకరిద్దాం...లేకుంటే వారి సంకల్పం నెఱవేరాలని హృదయ పూర్వకంగా ప్రార్థిద్దాం. 

సమ్మతితో ఉండు - సద్గతి పొందు. 

25 కామెంట్‌లు:

  1. అత్యద్భుతం.
    మీరు ఏది రాసిన అందులో జీవం తొణికిసలాడుతుతుంటుంది.
    సాయి శరణం

    రిప్లయితొలగించండి
  2. అద్భుతంగా వివరించారు భారతిగారు. సందేహాలు తీరాయి. శ్రద్ద సబూరిల గురించి కాస్త వివరించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు పద్మ గారు.
      శ్రద్ధ సబూరి...మరో టపాలో తెలియజేస్తానండి.

      తొలగించండి
  3. చక్కటి వివరణ భారతీ!ధన్యోస్మి.. బాబాగారి అనుగ్రహ ఆశీస్సులు నీకు సదా ఉండాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. చాల అద్బుతంగా వివరించారు భారతి గారు, మీ పోస్టులు చదువుతున్నప్పుడు తెలియని ఒక ఆనందం కలుగుతుంది. మీ లాంటి వాలా పోస్ట్‌లు ఈ తరం కి చాల అవసరం . ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  5. ఎంత బాగా చెప్పారో...
    ఎవర్నీ నొప్పించక ఒప్పించేలా మెప్పించేలా రాయడంలో మీకు మీరే సాటి. 👌👌👌

    రిప్లయితొలగించండి
  6. భారతిగారు, టి.వి లో బాబా దేవుడా కాదా అన్న చర్చ జరిగినప్పుడు బాబా భక్తుడనయినా నాలో ఎదో బాధ. సందేహంలో పడేసేవారు. చాల కలతపడేవాణ్ణి. ఇప్పుడు మనస్సుకు ఎంతో తేలికగా హాయిగా వుంది. ఎంతో బాగ చెప్పారు. ధన్యవాదములు మీకు. బాబా ఆశిస్సులు ఎప్పుడూ మీకుంటాయి.

    రిప్లయితొలగించండి
  7. మీ టపాలోని ఒక ఛాయాచిత్రం క్రింద "పుణ్యం పాపం ఏకకాల మందు చేయటం చేత ఒకదానికి ఒకటి పోతున్నాయి. ఏం‌ మిగలటం లేదు"‌ అని చదివాను. ఈమాటలు చెప్పినది ఎవరైనా కాని, ఇది తప్పుడు అవగాహన. పుణ్యపాపాలు అనేవి లాభనష్టాల వంటివి కావు ఒకటి ధనాత్మకమూ మరొకటి ఋణాత్మకమూ అన్నట్లుగా ఒకదానిలో మరొకటి ఎంతో కొంత చెల్లు వేసుకుందుకు. అలా వీలు లేదు. జీవుడు పుణ్యపాపకర్మల ఫలితాలను విడివిడిగా వేటికవి అనుభవించవలసిదే. మాటవరసకు పుణ్యాతిశయం వలన పుత్రపౌత్రాభివృధ్ధిని పొందాడొక జీవుడు అనుకుందాం. కాని పాపకర్మానుభవం జరిగినప్పుడు పుత్రశోకాదులో దారిద్ర్యమో రోగమో మరొకటో కలుగవచ్చును. చెల్లులు వేసుకోవటం‌ ఉండదు. ఎన్నో కొటేషన్లు కనిపిస్తుంటాయి. కొన్ని ఇలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

    రిప్లయితొలగించండి
  8. నమస్తే, మరికొంచెం వివరణ ఇద్దామని వ్రాస్తున్నాను. ఒక జీవుడు పాపపుణ్యసమ్మిశ్రితమైన జీవితం గడపుతున్నాడు; పాపపుణ్యాలను ఒకదానిలో ఒకటిగా చెల్లువేసుకొంటూనే అనుకుందాం. అలాగ గడపుతూ ఉండగా అవసాన కాలాం సమీపిస్తూ ఉండగా కొంచెం‌ పాపమే మిగిలినది. కాని అవసానానికి వచ్చేసరికి అప్పట్లో తెలిసో తెలియకో చేసిన కొంచెం పుణ్యం అదనంగా జమ ఐనది. ఆశ్చర్యం ఏమిటంటే పాపపుణ్యాల లెక్కలో ఫలితం శూన్యం ఐనది. జీవితం కూడా ఆస్థితిలో ముగిసినది. ఇప్పుడు మరలా ఆజీవి జన్మ ఎత్తవలసి ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి చెప్పండి. పాపమూ లేదు పుణ్యమూ లేదాయె. ఆహా. ఇంక మోక్షమే కలగాలి కదా. ఇటువంటి మోక్షలబ్ధిని శాస్త్రాలు చెప్పటం లేదు కదా. భగవదనుగ్రహంతో నిమిత్తం‌ లేకుండా పాపపుణ్యాల బేలన్స్ సున్నా ఐతే మోక్షం అన్నది ఒకటి ఉన్నదని ఇప్పుడు మనం ఎలా సిధ్ధాంతం చేస్తాం? చేయలేం కదా. పిండితార్ధం ఏమిటంటే పాపకార్యమైనా పుణ్యకార్యమైనా అది ఇచ్చే‌ ఫలితాన్ని కర్త అనుభవించవసిందే. కర్తను కానూ, కేవలం‌ చేయవలసినది చేసానూ, ఫలం భగవంతుడికే అర్పితం అన్నప్పుడు మాత్రమే కర్తృత్వరాహిత్యం వలన ఫలానుభవం ఉండదు. లేకపోతే పుణ్యపాపఫలాలు తప్పకుండా అనుభవించాలి.వాటితో అర్ధమెటిక్ చేయటం వీలుపడదు. అంతేనండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు,
      నమస్కారమండి.
      కర్మ సిద్ధాంతం లోతైనది. పూర్తి అవగాహన లేదండి. మీరు చెప్పింది అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను.
      మీకు మనసార ధన్యవాదములు.

      తొలగించండి
    2. భారతి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఒకప్పుడు ఈకర్మసిధ్ధాంతం గురించి కొంత వివరంగా వ్రాద్దామని అనుకున్నాను. కాని కారణాంతరాల వలన వ్రాయలేదు.

      తొలగించండి
    3. ఇప్పుడైనా వ్రాయండి సర్. అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.

      తొలగించండి
    4. భారతి గారు,
      మీరు శ్రీకోట సుబ్బారాయ గుప్త గారి కర్మసిధ్ధాంతము అన్న గ్రంథాన్ని దిగుమతి చేసుకొని తప్పక పరిశీలించండి. మీకు అథ్యయనోపయోగకారి కావచ్చును.

      తొలగించండి
    5. శ్యామలీయం గారు,
      తప్పకుండా చదువుతానండి.
      మీకు మనసార ధన్యవాదములు.

      తొలగించండి
  9. నమస్కారమండి. వనితావని వేదిక బ్లాగ్లో అనామిస్ గా కామెంట్స్ చేసింది నేనే. నెను ఆ బ్లాగర్ కు తెలుసు. మేం లలితాదేవి శ్రీరామున్ని వేంకటేశ్వర స్వామిని కృష్ణున్ని బాబాని అందరినీ పూజిస్తుంటాం. బాబా చాల సందర్భములలో తన కృపను మాపై చూపారు. టి.వి లలో డిష్కన్స్ చేసేవారు శ్రీరాముడే గొప్పయని, శ్రీ కృష్ణుడే దేవుడని, ఎన్నెన్నో వాదనలు. మేం ఆరాధించిన రూపమే దేవుడు... మిగిలిన వారు నమ్మకంతో భక్తితో ఆరాధిస్తున్న దైవాలు అసలు దైవాలే కాదనడం మంచి పద్ధతేనా? మా దైవమే అసలైన దైవం; మిగిలిన దైవాలు దేవుళ్ళే కాదు అని ప్రచారం చేసుకుంటున్న క్రైస్తువులకు వీరికి ఏమిటి తేడా? అలాగని నేను క్రైస్తవున్ని కాను. బ్రాహ్మణుని. పక్కా హిందువుని. రామభక్తులు అందరిలో రామున్ని, కృష్ణ భక్తులు అందరిలో కృష్ణున్ని శాక్తేయులు అందరిలో శక్తి రూపాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? అందుకె బాధతో సాయిభక్తులైన వారిని ప్రశ్నించాను. కానీ సంతృప్తికరంగా సంపూర్ణ సమాధానం మీరిచ్చారు. మీకు శతకోటి వందనములు.

    రిప్లయితొలగించండి
  10. ప్రశ్న: రామభక్తులు అందరిలో రాముణ్ణి, కృష్ణ భక్తులు అందరిలో కృష్ణుణ్ణి శాక్తేయులు అందరిలో శక్తి రూపాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు?
    జవాబు: అది వ్యక్తుల లోపం కాని వారు ఆరాధించే దైవముల తత్త్వముల యందు అలా చూడలేకపోవటానికి కారణం ఆరోపించలేము కందండీ. రాముడు శివలింగ ప్రతిష్ఠ చేయలేదా, శ్రీకేష్ణుడు స్వయంగా శివుని కొఱకు తపస్సు చేయలేదా? అమ్మవారిని విష్ణుసహోదరి అని కదా అంటున్నాం. వ్యక్తుల పరిణతి సరిగా లేకపోవటం గమనిస్తే అది చితించవలసిన విషయం. శ్రీరామో లలితా రూపః అంటారు. తులసీదాసు గారు రామభక్తులు. ఒకసారి ఆయన ఒక నూత్నదేవాలయంలో మూలవిగ్రహస్థాపనోత్సవానికి వెళ్ళారు. అక్కడ ఎవరో ఆయన్ను మేలమాడారు, దాసుగారు కృష్ణాలయానికి వచ్చారే, రాముడి గుడి అని పొరబడ లేదు కదా అని. ఆయన శాంతంగా అవునా రాముడే అనుకున్నానే అని ఊరకున్నారట. దేవుడికి తెరతీయగానే అక్కడ అందరకూ శ్రీరామదర్శనం ఐనది. ఇకపోతే అదృష్టవశాత్తు మరలా శివవిష్ణుశాక్తేయాలుగా చీలిపోవటం లేదు. నేడు సాయిభక్తులం‌ అని చెప్పుకొనే వారిలో కొందరు మాత్రం ఇతరదైవాలను పూజించకండి సాయినే పూజించండి అని ఒక గుళ్ళల్లో ప్రచారం చేయటం చూసాను అదెక్కడో కాదు తిరుమల కొండ మీదనే! ఒకాయన నాతో రామాయణం కనా సాయిచరిత్ర పవర్‌ఫుల్ అన్నాడు. నాకు సమాధానం చెప్పాలి అనిపించక మిన్నకున్నాను. ఈమధ్య వ్యాసపూర్ణిమను అత్యుత్సాహంతో కొందరు సాయిపూర్ణిమగా హడావుడి చేయటం చూస్తున్నాను. ఐతే ఇలాంటి హ్రస్వదృష్టులు నేను సాయికి ఆరోపించలేను కదా. అందుచేత శాంతగా ఉండండి. అణువణువూ‌ భగవంతుని అంశతో నిండినదే‌ జగత్తులో. లేకపోతే రాతిస్థంభం నుండి నరసింహావతారం ఎలాగు వచ్చింది? మనుష్యమాత్రులం మన అవగాహనా శక్తి మేర వివిధంగా దైవత్వాన్ని అవగతం చేసుకొని ఆమేరకే ఆరాధించగలుగుతున్నాం. అనంతాన్ని అనంతమే తెలుసుకోగగలదు. నా రుద్రః రుద్రమర్చయేత్ అన్నట్లు.

    రిప్లయితొలగించండి
  11. బాబాయే దైవమంటున్నారు. బహుశా మీరు బాబానే పూజిస్తారనుకుంటా. పూర్తిగా బాబా భక్తులైవుంటారు. అందుకే ఇంత చక్కగా వివరించగలిగేరు.
    ~ శ్రీను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనుగారు,
      బాబాయే దైవమనలేదు. బాబాని దేవుడు అనడంలో తప్పులేదని తెలిపాను.
      బాబా గురించి చెప్పడానికి బాబా భక్తులమే కానవసరం లేదు కదండీ...

      తొలగించండి