25, ఫిబ్రవరి 2023, శనివారం

బ్రోచేవారెవరురా .....

డిసెంబర్ ఇరవై ఒకటిన ఓ సత్సంగ మిత్రురాలు నుండి మెసేజ్... క్షేమమేనా మీరు? కుటుంబ వ్యవహారాల్లో బిజీనా...ఈ మధ్య వాట్సప్ సత్సంగ గ్రూప్ లో గానీ, బ్లాగ్లో గానీ అస్సలు కనిపించడం లేదెందుకని... నిజమే...కొన్ని నెలలుగా బాధ్యతల నిర్వహణల వలన కొంత ఒత్తిడి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఒకింత నిస్సత్తువ....వెరసి గ్రూప్ లకు, బ్లాగ్ కు కాస్త దూరం. పై మిత్రురాలు మెసేజ్ తో బ్లాగ్ చూడాలనిపించి, నా బ్లాగ్ ఓపెన్ చేసి, కొన్ని టపాలు చదివాను. అలా చదువుతుంటే కొన్ని కొన్ని క్రొత్తగా, అప్పుడే తెలుసుకుంటున్నట్లు... ఈ టపాలు పెట్టింది నేనేనా అన్న సందేహం కలిగింది...నాకు వచ్చిన మరుపు వలన! కరోనా తగ్గిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగానో, వయస్సు (56) రీత్యనో చెప్పలేను గానీ, నిస్సత్తువ తదితరాలతో పాటుగా చిరు మరపు కూడా జతైంది. అప్పుడప్పుడు నా కుటుంబ సభ్యులు మర్చిపోతున్నావని, కొన్ని కొన్ని సందర్భాలలో అంటున్నా, పట్టించుకోలేదు కానీ, ఆధ్యాత్మిక విషయాలను, విశ్లేషణలను మర్చిపోతుండడం చాలా బాధని కల్గించింది.
ఇలా అయితే క్రమేణా రామ స్మరణ కూడా మర్చిపోతానేమో... ఈ భావన మరింత బాధగా మారింది. అన్నీ మర్చిపోయే స్థితి వస్తే, నన్ను అమ్మా అని కాకుండా రామా అని పిలవమని, నాతో ఏది మాట్లాడినా రామ నామాన్ని జోడించి చెప్పండని నా కుటుంబసభ్యులకు కోరుదామని అనుకున్న, వారు బాధ పడతారేమోనన్న వెరపు. ఏడుస్తూ రామున్నే శరణు కోరాను చాలా రోజులు.
నీ అనుగ్రహంతో, అలవడిన నీ నామ స్మరణతో నా జీవనగమనం సాఫీగా సాగిపోతుంది. ఇలానే శేష జీవితం నీ స్మరణంతోనే ముగించవయ్యా...రామయ్య.
ఒకరోజు నా ఈ బాధను నా మిత్రులకు చెప్పగా, ప్రియంవద అనే మిత్రురాలు అన్నదిలా - ఇదేం పెద్ద సమస్య కాదు, అలాగని చిన్నది కాదు, నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోక, కొంచెం ప్రయత్నించు...
నేను ఎక్కడో చదివిన ఓ కథను చెప్తాను...ఆ రీతిలో ప్రయత్నించమని ఈ క్రింద కథను ప్రియా చెప్పింది. ఒక ఊర్లో ఓసారి ఎప్పుడూ వచ్చిన కాపరి కాకుండా, కాపరి కొడుకు గోపి రెండురోజులుగా తమని మేతకు తీసుకువెళ్లడం గమనించిన ఓ ఆవు, "ఏంటి రా గోపి, బడికి వెళ్లకుండా గేదలు కాయటానికి వచ్చావ్" అని అడిగింది గేదలు ఆవుల మందలో వెనకనున్న ఆవు. "నాకు ఇక చదువు రాదని మానాన్న మరియు మా సర్ మొన్న ఈ నిర్ణయనికి వచ్చారు" బాధగా చెప్పాడు గోపి. "చదువేముందిరా, నేను గడ్డి తిన్నంత సులువు" అంది ఆవు. "అలానా, ఎలా?" ఆశగా అడిగాడు గోపి. అప్పటికే పొలం వచ్చింది. "ముందు నన్ను కాస్త తిననివ్వు, తరువాత చదువు మర్మం చెపుతా" అని మేతలో మునిగి పోయింది ఆవు. కాసేపు ఓపిక పట్టిన గోపి, "ఏం చేస్తున్నావ్? నాకు ఏదో చెపుతానని, నీవు తింటూ ఉన్నావ్" అని అడిగాడు. "నేను ఏకాగ్రతగా అంతర గ్రహణం చేస్తున్నా.... కదిలించకు" అంది ఆవు. "అదేమిటి? అంతర గ్రహణమా? కొత్తగా ఉందే ఈ మాట" అని గోపి అనగా, "ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని అంతర గ్రహణం అంటారు. అంటే క్లాస్ లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిది. ఇక్కడ శ్రద్ధ అవసరం. అర్ధమైన, కాకున్నా ముందు ఆలకించాలి. ఇది చదువు యొక్క మొదటి లక్షణం. అర్థమయిందా" అని చెప్తూ, "ముందు నన్ను సరిపడినంత తిననివ్వు. మిగిలినది తరువాత చెపుతా" అంటూ తినటం కొనసాగించింది. గోపి ఆవుని బాగా గమనిస్తూ ఆలోచనాపరుడై, తినటంలో ఉన్న శ్రద్ధ వినటంలో ఉండాలన్నమాట అని గ్రహించాడు. కాసేపు గడిచాక ఆవు, గోపి ఇద్దరూ చెట్టు కిందకు చేరారు. "అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావ్" వింతగా అడిగాడు గోపి. దానికి ఆవు నవ్వుతూ ..... "దీనిని నెమరు వేయటం అంటారు. అంటే జీర్ణక్రియ. ఇందాక తిన్న ఆహారాన్ని, తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం. ఇది చాలా ముఖ్యం. "ఎందుకలా" అడిగాడు గోపి. "సర్ చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి. కానీ, కాసేపటికి మర్చిపోతాం. అందుకే ఇంటికి వచ్చాక తీరుబడిగా నెమరు వేసుకోవాలి. ఎవరికైతే నెమరు వేసే అలవాటు ఉంటుందో, వారికి చదువు బాగా జీర్ణమౌతుంది... నిజానికి చదువు లోని మర్మం ఇదే" అని రహస్యంగా చెప్పింది ఆవు. గోపీకి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది. తాను ఏనాడు ఇంటికొచ్చి పుస్తకం పట్టింది లేదు. సాయంత్రమయ్యింది. గేదలు అవులు ఇంటికి మరలాయి. గోపి చూపు అంతా ఆవు మీదనే ఉంది. అది ఉదయం కన్నా హుషారుగా ఆనందగా ఉంది. "ఏంటి విషయమ"ని గోపి అడిగగా, ఆ ఆవు ఇలా అంది... "దీనిని శోషణం మరియు స్వాంగీకరణ అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి, మనకు శక్తిని హుషారును ఇస్తుంది. జీర్ణం సరిగ్గా జరిగితేనే, ఈ ఆనందం అనుభవించగలం. దీనిని నీ చదువుకు అన్వయించుకో... శోషణం మరియు స్వాంగీకరణ అంటే చదువు నీకు అర్థమై ఒంటపట్టటం. అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది. నీకు ఒక పేరును గుర్తింపును తెస్తుంది. నీ ముఖంలో ఓ వెలుగు, నీ పేరుకు ఓ మెరుపు వస్తాయి" అంది ఆవు. గోపి గుండె పట్టుదలతో కొట్టుకోగా, రక్తం వేగంగా, పంతంగా పరిగెత్తింది. "ఇంతేనా... ఇంకేమైనా ఉందా? ఆలోచనగా అడిగాడు గోపి. ఇంకో విషయం ఉంది. పేడతట్ట తీసుకొని రా, చెపుతా అంది అవు. గోపీకి విషయం అర్థమై తట్ట తెచ్చి, పేడ పట్టి, పక్కన పెట్టి, చెప్పు అన్నాడు. "చివరి విషయం మల విసర్జన. చదువులో కూడా ఇంతే. పనికి మాలిన పనులు వదిలేయడం. కబుర్లు.... సెల్ ఫోన్, టీవి, ముచ్చట్లు తదితర వాటిని విసర్జించాలి. అప్పుడు నీకు జీర్ణం చేసుకోవటానికి మరింత సమయం దొరుకుతుంద"ని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు. ఆవుకు మేత పెట్టి, గోపి ఇంటికెళ్లాడు. నెల గడిచింది. గోపికి ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ .... సర్ ఆశ్చర్యముగా మెచ్చుకోలుగా చూస్తూ, ఎంతగానో అభినందించారు. ఈసారి గోపి ఇంటి కెళ్లకుండా నేరుగా ఆవుల కొష్టం వద్దకు బయలు దేరాడు. "ఆ రోజు" సాయంత్రం ఆవు నడిచిన నడకలోని శక్తి, ఆనందం "ఈ రోజు" గోపి అడుగులలో కనిపిస్తుంది. ఈ కథను అర్థం చేసుకొని కొన్నేళ్లుగా వదిలేసిన పుస్తక పఠనం తిరిగి ప్రారంభించు, మననం చేసుకుంటూ ఉండు. అలానే మునుపటిలా సత్సంగములో చర్చించడం, చక్కటి ప్రవచనాలు వినడం మొదలెట్టు... అన్నీ గుర్తుకొస్తాయని అంది. ఇక మిత్రులందరూ చక్కటి టాపిక్స్ ప్రస్తావిస్తూ చర్చించడం ప్రారంభించారు. మరో మిత్రురాలు శారద ఈమధ్య కుటుంబ నిర్వహణలో సాధన లేక ఆధ్యాత్మిక అంశాల్లో కొంత మరుపు వచ్చిందనుకుంటాను. ఏది ఏమైనా రామనామం మర్చిపోలేదు. అదొక్కటి బలంగా పట్టుకో...
నామమే కలియుగంలో రక్ష. అదొక్కటి బలంగా నీ మనస్సులో నాటుకుంటే, నిరంతరం స్మరిస్తుంటే చాలు.....అని చెప్తూ, తనూ ఒక కథను ఫార్వర్డ్ చేసింది. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. పువ్వులు, పండ్లు, ధూప దీప నైవేద్యాలతో పాటు, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మినవాడు. కానీ, అలా ఏమీ జరగకపోవడంతో అసంతృప్తి మనసులో ఉండేది.
ఒకసారి ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. అతను మహా జ్ఞాని అని విని, ఏదైనా మంత్ర దీక్ష తీసుకుని చేస్తే బాగుంటుందని తలచి, ఆ జ్ఞాని దగ్గరకు ఎంతో ఆశగా వెళ్ళి, దర్శనం చేసుకుని , తన మదిలో మాటలను విన్నవించాడు. సాధువు అంతా శాంతంగా విని, "నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను. కానీ, నీ తపన చూస్తుంటే ఇవ్వాలనిపిస్తుంద"నగానే, భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు. "అయితే, ఈ జప విధానం కొంచెం కష్టం. నీవు చేయగలవో, లేదో" అని సాధువు అనగా, "ఎంత కష్టమైనా, నేను చేయగలను... మంత్రం ఫలిస్తే చాలు" అన్నాడు భక్తుడు ఆనందంగా. ఐతే విను... నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు కానీ, రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి... అలా తొమ్మిది రోజులు చేయు...ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే......."దేవుడున్నాడు". భక్తుడు అయోమయంగా చూసాడు. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఇన్ని లక్షల... కోట్ల జపం చేయాలని విన్నాడు కానీ, ఇదేమిటి? పైగా ఇది పంచాక్షరి మంత్రమట... ఏమిటది... దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది... మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అదీ ఇంకొకరితో... తనను పిచ్చివాడి క్రింద జమ కడ్తారేమో....ఎన్నెన్నో సందేహాలు భక్తునికి. సాధువు ఒకటే మాట చెప్పాడు "నన్నేమీ ప్రశ్నించ వద్దు. మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి, ఆపై నాకు కనిపించు". భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా, ఎవరితోనైనా "దేవుడున్నాడు" అని ఎలా అనటం? ఏమిటీ గందరగోళం... ఇంతలో అతని భార్య వచ్చి, పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను అప్రయత్నంగా అన్నాడు... "దేవుడున్నాడు". అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా, లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమయి కానట్లు... వింత భావన కలిగింది. ఆపై, ఇంక ఏ మంచి కనిపించినా "దేవుడున్నాడు" మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతోనూ, ఏదైనా చెడు కనిపిస్తే "దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతోనూ , అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే... "దేవుడున్నాడు" శిక్షిస్తాడనే అర్థంతోనూ, పూజలు అనే విషయం వస్తే "దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. తొమ్మిది రోజులు గడిచాయి. అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు "నువ్వు ఎప్పుడు, ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు" భక్తుడు మొదట తెల్లబోయినా, వెంటనే తేరుకుని అన్నాడు... "నాకు తెలిసింది ఏమిటంటే, దైవం సర్వాంతర్యామి. అంతటా వున్నాడు. సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది, మనం దాచగలిగేది ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో తెలిసినవాడు, దయాసాగరుడు, ఆనందస్వరూపుడు…" అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు... "ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు?" భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి "దేవుడున్నాడు" అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు"...అని చెప్తుండగా, ఆపి, ఆహా! మంత్రం ఫలించింది...ఆనందంగా ఉండు...చెప్పాడు సాధువు. ఈ కథను ఒకటికి రెండుసార్లు చదవండి. మనసారా విశ్వసించటమే మనం చేయాలి. రాముడున్నాడని విశ్వసించండి...
"రాముడున్నాడు" అనేపంచాక్షరీ మంత్రాన్ని నిర్మలమైన మనస్సుతో నిత్యం జపించండి...అంతా సర్ధుకుంటుంది భారతిగారు... అని! 


అలాగే మరో సత్సంగ మిత్రురాలు అనవసరంగా భయపడకండి. ఒకోసారి మరుపు సహజం. నామాన్ని మర్చిపోలేదు కదా. రామ నామం చేస్తున్నారంటే అది రామానుగ్రహం. అది ఎన్నటికీ మర్చిపోలేరు...అని ఎన్నో రీతుల్లో ధైర్యం చెప్తూ, తనూ ఓ చక్కటి కథను చెప్పింది. కొన్ని శతాబ్దాల క్రితం, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు భక్తులు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజూ వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టు పట్టేవాడు. ఇలా రోజూ ఆలయ అధికారులకి అతనికి క్రొంత వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే, ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుందని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కి పోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు. ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి, ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా! నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికీ సేవలు చేయడంతోనే నా సమయం సరిపోతుంది, వారిని వదిలేసి, నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను. పైగా, నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను, నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను? మీరే దయతల్చండి అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్.. నాకంత వరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే నీకు భూత భృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థి యై రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు. ఆ నాటి నుండి ఆ వైష్ణవుడు మరల కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాల భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరకి రామానుజులకి తెలియ చేసారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు. కొంత కాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటుతుండగా, ఈ వైష్ణవుడు స్వామీ, స్వామి అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయన కనుల నుండి ధారగా కన్నీరు కారుస్తూ, మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు ఆ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను "భూతభృతే నమ:" జపాన్ని చేస్తున్నాను...అని చెప్పాడు ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎవరా పిల్లవాడు? వాని పేరేమి అని అడుగగా, ఆ పిల్లవాడు తాను రామానుజా దాసుడనని చెప్పాడని చెప్పాడు వైష్ణవుడు. ఆ బాలుడు ఇంకెవ్వరు సాక్షాత్ శ్రీరంగనాదుడే...అని గ్రహించి, ఉప్పొంగి పోయారంతా. భూత భృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని అర్ధం.
అందుకే భారతి, నామానికి ఉన్న శక్తి ఎంతటిదో అర్థం చేసుకుని, ఆ నామ పారాయణం అఖండంగా చేయు...నీకు ఏది అవసరమో, అది ఆ పరమాత్ముడే ఇస్తాడు. 

ఇలా ఇంకా చాలామంది సహృదయంతో చక్కని మాటలతో, సలహాలతో ఎంతో ఊరటని ఇచ్చారు. 


ఇక, పై స్ఫూర్తిదాయక కథా రచయితలు ఎవరో గానీ... వారికి, అనునిత్యం రాములోరికి వారి కీర్తనల ద్వారా అక్షరార్చన చేస్తున్న శ్యామలీయం గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. అందరి సలహాలను వందశాతం అమలు చేశాను. రామానుగ్రహంతో ఇప్పుడు నా పరిస్థితి మెరుగ్గా ఉంది. కొద్దిరోజులు క్రితం మా అక్కగారమ్మాయి విద్య సాయి, 'భారతాంటీ! ఈ మధ్య ఏమీ వ్రాయడం లేదు, వ్రాయండి' అనడం...ఇదే మాటను మరి కొొందరు అడగడంతో... గత కొంత కాలముగా, నాలో జరిగిన సంఘర్షణలో కొంత ఈ టపా ద్వారా తెలుపుతున్నాను. 
 అలాగే ఝాన్సి అనే మిత్రురాలు ఓ చమత్కారపు సలహా ఇచ్చారు. దాని గురించి మరో టపాలో ...

17 కామెంట్‌లు:

  1. చాలా కాలానికి పోస్ట్ పెట్టారు. మీ ఆరోగ్య సమస్యలు... బాధగా ఉంది.
    రూపం - నిత్యం, నామం - నిత్యం, నామ స్మరణ - సున్నిత సురక్షిత సుశిక్షిత మార్గం.
    రాముణ్ణి నమ్ముకున్నారు - అవలీలగా మీ సమస్యను అధిగమిస్తారు భారతీ గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రూపం - అనిత్యం, నామం - నిత్యం, నామస్మరణ - సున్నిత సురక్షిత సుశిక్షిత మార్గం.
      టైపింగ్ లో తప్పు దొర్లిందండి.

      తొలగించండి
    2. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు పద్మ గారు.

      తొలగించండి
  2. మంచి కధలతో మీ బాధని కూడా ఆధ్యాత్మిక కోణంలో స్పూర్తివంతంగా విశీదకరించారు. చక్కటి స్నేహ సాంగత్యం. మీరు త్వరగా కోలుకొని మరిన్ని మంచి మంచి విషయాలను తెలపాలని,భగవంతున్ని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. రాముడిని ఎక్కడ మర్చిపోతానో నన్న మీ బాధలో మీ ఆర్తిని, భగవత్ప్రేమను చూసానమ్మా. ఇక మర్చిపోతానేమో అన్న భావన వద్దమ్మా... ఆ రాముడు మీలోనే ఉంటాడు జీవితాంతం.
    ఆ చమత్కారపు సలహా కూడా తెలుసుకోవాలని ఉందమ్మా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జోగరావు గారు,
      ధన్యవాదాలండీ ...
      ఆ చమత్కారపు సలహాను తదుపరి టపా లో చెప్తానండి.

      తొలగించండి
  4. తల్లి భారతికి
    వందనం
    మీకు చెప్పేటంత వాడిని కాదేమో! ఐనా చిన్నమాట
    స్తబ్దుగా ఉండిపోవడం అందరికి ఉండేదే అనుకుంటా! ఐతే అలాగే స్తబ్దుగా ఉండిపోకూడదు, కాలంలో దానినుంచి బయట పడాలి. ఎలా? అది మీ మిత్రులు చేసి చూపించారు,చెప్పి చూపించారు, చిన్న కథలద్వారా! అంతేకాదు సత్సంగత్వం ఏంటో కూడా నిరుపించారు.
    సత్సంగత్వే నిస్సంగత్వం
    నిస్సంగత్వే నిర్మోహత్వం
    నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
    నిశ్చలతత్త్వే జీవన్ముక్తి
    భజగోవిందం భజగోవిందం
    గోవిందంభజ మూఢమతే

    ఇలా మెట్టుపై మెట్టు ఎక్కాలిగా అందులో భాగమే ఇది అనుకుంటా.
    శంకరులమాట గుర్తొచ్చింది తల్లీ
    తల్లికి మరల వందనం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారికి, పాదాభివందనం.

      రామాయణం యుద్దకాండలో ఇంద్రజిత్తు నికుంబల హోమం చేసి మేఘమండలంలో నుండి అదృశ్యరూపంలో మాయా యుద్ధం చేస్తూ, సంధించే బాణ పరంపర వలన కొన్ని కోట్ల వానరులు నెత్తురోడుతూ ప్రాణాలు పోయి, కాళ్ళు చేతులు తెగి నేల పడిపోయాయి. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణా! లక్ష్యంకు దొరకక ఇంద్రజిత్తు మేఘాలలో అంతరహితుడై వుండడం వలన ఈ బాణాలను ఓర్చడం తప్ప, ప్రతిఘటించే అవకాశం లేదు కనుక, ఓర్చుకొని స్పృహను పొంది వుండు అని చెప్పగా, ఒళ్లంతా రక్తమయం కాగా, కాసేపటికి వీరిద్దరూ నేల పడిపోయారు. ప్రదోషవేళ మేఘనాథుడు (ఇంద్రజిత్తు) యుద్ధభూమి నుండి వెడలాక, ఇతని శక్తి తెలిసి వెళ్లిపోయిన విభీషణుడు అసలు ఎవరైన ప్రాణాలతో ఉన్నారా? ముఖ్యమైన వాళ్లంతా ఎక్కడున్నారో చూడడానికి కాగడా పట్టుకొని వచ్చి, అక్కడే ఉన్న
      ఏ అస్త్రం చేత బందింపబడని వాడైన హనుమతో కల్సి వెతకగా, అందరిలో పెద్దవాడు, బ్రహ్మ యొక్క అంశలో వచ్చిన జాంబవంతుని చూసి, తాతా! కుశలమేనా అని విభీషణుడు అడగగా, నాయనా! ఇంద్రజిత్తు కొట్టినటువంటి బాణాల పరంపరకు నాలో నెత్తురోడిపోయి కనురెప్పలు ఎత్తి చూడలేకపోతున్నాను...ఇంతకు వానరులలో శ్రేష్టుడైన హనుమ కుశలంగా వున్నాడా... అని అడిగాడు జాంబవంతుడు. అంతట విభీషణుడు ఆశ్చర్యంగా అదేమిటి తాతా, నీవు అడగవల్సింది రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని...కానీ, నీవు హనుమ కుశలంగా ఉన్నాడా అని అడుగుతున్నావేం...అని అడగగా, రామలక్ష్మణులతో కల్సి వానరులంతా పడిపోయినా నష్టం లేదు. హనుమ ఒక్కడు ఉంటే, మళ్ళీ అందరూ బ్రతుకుతారు, క్షేమంగా ఉంటారు...అందుకే హనుమ గురించి అడిగానని బదులిస్తాడు జాంబవంతుడు. ఇప్పటికీ ఇది చాలు. మిగతా కథ ఇక్కడ అప్రస్తుతం. భక్తి,
      జ్ఞాన ప్రచారం చేస్తున్న మీలాంటి వారు, ప్రవచనకారులు, గురువుల వలననే... ఈ కలియుగ మాయా ప్రపంచంలో పడిపోతున్న నాలాంటి పెక్కుమంది తిరిగి లేవగలుగుతున్నాం, క్షేమంగా ఉండగల్గుతున్నాం. ఇది అతిశయోక్తి కాదు, మనస్సు లోలోపల నుండి వచ్చే మాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇహ పర పరంగా అయోమయస్థితిలో పడినప్పుడు మీ బ్లాగ్ ద్వారా సమాధానం దొరికేది. గాడి తప్పిన నేను మరల సరైన దారిలోకి వచ్చేదానిని. మీరు నాకు గురు సమానులు. అలాంటి మీరు, మీకు చెప్పేటంత...అనే మాటలతో నొప్పించకండి బాబాయ్ గారు.
      శంకరులమాట గుర్తు చేసినందుకు మనసార ధన్యవాదాలు.

      తొలగించండి
    2. తల్లీ భారతి
      నా చిన్న మాట మిమ్మలి పెద్దగా కదిలించింది. చిన్నమాట కదలిక తీసుకురావడానికేగాని బాధించడానికి కాదని అమ్మకి తెలియనిదా? లోకకోసం అమ్మ అలా అంటుంది, అంతే, అపార్ధాలేం లేవు.
      శ్రీ మాత్రేనమః

      తొలగించండి
  5. భారతి గారు, కీర్తనల ద్వారా అక్షరార్చన చేస్తున్న శ్యామలీయం అన్నారు. సంతోషం. క్రియాసిధ్ధి ర్భవతి మహతాం నోపకరణే అన్నట్లుగా ఒక పనిముట్టుగా రామకీర్తనలను వెలువరించటంలో ఈఉపాధి పనిచేస్తున్నది కాని ఇందులో నా ప్రతిభ యేమీ లేదండి. అందుకే ఆయన సంకల్పం మేరకు ఒక రోజున నాలుగైదు రావటమూ కొన్నిరోజుల పాటు ఒకటీ వెలువడకపోవటమూ కూడా జరుగుతూ ఉంటుంది. అంతా ఆయన ఇఛ్ఛమేరకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారు,
      క్రియాసిధ్ధి ర్భవతి మహతాం నోపకరణే ...
      ఇలా భావించడం... ఉత్కృష్ట వినయ సంపత్తి.
      మీకు హృదయపూర్వక నమస్సులు.

      తొలగించండి
  6. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాధాయ నాధాయ సీతాయాపతయే నమః. రామ.... శ్రీరామ .. సత్సాంగత్య ప్రాముఖ్యత,మీ స్నేహితుల ద్వారా మీకు లభించిన జ్ఞాన సంపద మరల మీరు మాకు ఇలా తెలపడం.. ధన్యవాదాలు మీకు.. గోవు కధ ,శ్రీరంగనాధుని కరుణాకటాక్షాలు. కధ..అద్భుతమైనవి.. బాగుంది చాలా..కంటిన్యూ చేయండి. .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు, విశాల, మీ అందరి స్నేహ సహకారాలకు ధన్యవాదాలు రుక్మిణీ జీ!

      తొలగించండి
  7. అంత మంచి స్నేహితులు ఉండడం మీ అదృష్టం. అందరూ అలా ఉండరమ్మా. ఒకప్పుడు ఎంతో ఆదరణ... ఏమౌతుందో తెలియదు, సడన్ గా నిరాదరణ. మొదట్లో మనమే లోకమన్నట్లు... క్రమేణా మనమెవ్వరమో అన్నట్లు... వాల్లకేం... బాగానె ఉంటారు... నాలాంటి సెన్సిటీవ్ వాళ్ళు ... ఆ బాధ మీకు తెలియదు amma. బంధాలు బరోసాగా వుండాలి గానీ, బంధాలే బాధలుగా మారితె బ్రతుకు బలహీనమవుతుందమ్మా...

    రిప్లయితొలగించండి