http://www.sodhini.com

30, సెప్టెంబర్ 2026, బుధవారం

షోడశోపచార పూజ -2 (ఆసనం - అమ్మకు ఆసనం సమర్పించి హృదయంలో స్థానం కల్పించడం)

రత్నసింహాసనం - అమ్మకు హృదయంలో స్థానం

జై చండీ మాత 🙏

ఆవాహనం ద్వారా మన మనస్సును అమ్మవారి సన్నిధి వైపు తిప్పుకున్నాం.

ఇప్పుడు అమ్మను మన పూజలో సాదరంగా ఆసీనురాలిని చేసుకోవాలి. అందుకే తదుపరి ఉపచారం -

“రత్నసింహాసనం సమర్పయామి.”

అంటే,

“అమ్మా! నీకు రత్నాలతో అలంకరించబడిన సింహాసనాన్ని సమర్పిస్తున్నాను.”

🌸 ఒక చిన్న ప్రశ్న

అమ్మ జగత్తుకే అధిష్ఠానశక్తి. ఆమెకు మనం సమర్పించే ఈ చిన్న సింహాసనం ఎంత?

మన ఇంట్లో ఉన్న చిన్న పీటైనా, పూజా మంటపంలోని ఆసనమైనా కావచ్చు.

అయితే “రత్నసింహాసనం” ఎందుకు సమర్పిస్తున్నాం?

ఇక్కడే పూజలోని అంతరార్థం మొదలవుతుంది.

మనకు చేతనైనంత శ్రద్ధగా అమ్మకు ఆసనం సమర్పిస్తూ,

“అమ్మా! నాకు నీవే ప్రధానం. నా హృదయంలో కూడా నీకే మొదటి స్థానం.”

అనే భావాన్ని సమర్పించడం.

🌺 రత్నసింహాసనం సమర్పించే విధానం

ఆసన మంత్రాన్ని భక్తితో జపించి, “రత్నసింహాసనం సమర్పయామి” అని పలికి, అక్షతలను అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తాము.

ఈ చిన్న బాహ్యక్రియకు అంతరంగా, ఏమనుకోవాలి?

“అమ్మా! నీకు ఈ ఆసనాన్ని సమర్పిస్తున్నాను. నీవు ఈ ఆసనంపై ఆసీనురాలవ్వాలి. అలాగే నా హృదయాన్నే నీ సింహాసనంగా సమర్పిస్తున్నాను. నా హృదయంలో నీవు శాశ్వతంగా కొలువై ఉండాలి.”

అని భక్తితో భావించవచ్చు.

🌺 రత్నసింహాసనం అంటే?

“రత్నం” అంటే అమూల్యమైనది.
“సింహాసనం” అంటే అత్యున్నతమైన ఆసనం.

అందుకే రత్నసింహాసనం సమర్పించేటప్పుడు ఒక క్షణం ఇలా భావించవచ్చు:

“అమ్మా! బయట నీకు ఒక ఆసనం సమర్పిస్తున్నాను. అంతరంగంలో నా హృదయాన్నే నీ సింహాసనంగా సమర్పిస్తున్నాను.”

అక్షతలు సమర్పించేటప్పుడు కూడా:

“అమ్మా! నీవు ఈ సింహాసనంపై ఆసీనురాలవ్వాలి. నా హృదయ సింహాసనంపై కూడా శాశ్వతంగా ఆసీనురాలిగా ఉండాలి.”

అని భావించవచ్చు.

అక్షతలు చిన్నవే.
కానీ వాటితో మనం సమర్పించే భావం చిన్నది కాదు.

🌿 హృదయంలో అమ్మకు స్థానం

అమ్మను హృదయంలో కూర్చోబెట్టడం అంటే ఆ హృదయం కూడా అమ్మకు తగిన పవిత్ర స్థలంగా మారాలి. అందుకే మన అంతరంగంలో కోపానికి, అహంకారానికి, అసూయకు స్థానం తగ్గించి... ప్రేమకు, క్షమకు, ప్రశాంతతకు ఎక్కువ స్థానం కల్పించడమే ఆసన ఉపచారం వెనుక ఉన్న అసలైన అంతరార్థం. 

అప్పుడు “అమ్మా! నా హృదయంలో ఆసీనురాలవ్వు” అనే మాట మన జీవితంలో కూడా అర్థవంతమవుతుంది.

🌸 పూజగది నుంచి జీవితంలోకి 

పూజలో అమ్మకు సింహాసనం సమర్పించిన తర్వాత, రోజువారీ జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఒక చిన్న జాగృతి మనకు తోడుండాలి. ఏదైనా మాట్లాడే ముందో, లేదా ఒక పని చేసే ముందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

“అమ్మ నా హృదయంలో ఆసీనురాలై ఉన్నప్పుడు, నా మాట అమ్మకు తగినదేనా? నా పని అమ్మ సన్నిధిలో చేయదగినదేనా?"

ఈ చిన్న ఆలోచన మన ప్రవర్తనను నెమ్మదిగా మార్చే సాధనగా మారవచ్చు.

🌺 ఈరోజు మననం

“అమ్మా! నీకు బయట రత్నసింహాసనం సమర్పిస్తున్నాను. అంతరాన నా హృదయాన్నే నీ శాశ్వత సింహాసనంగా సమర్పిస్తున్నాను. నా హృదయం నీకు తగిన స్థలంగా పవిత్రంగా ఉండేలా అనుగ్రహించు.” 🙏🌺

రత్నసింహాసనం సమర్పించడం — అమ్మను ఒక ఆసనంపై కూర్చోబెట్టడం మాత్రమే కాదు;
మన హృదయంలో అమ్మకు స్థిరమైన స్థానం ఇవ్వడం.

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : షోడశోపచార పూజ - 3 (పాద్యం - అమ్మ పాదాలను కడిగి, అహంకారాన్ని సమర్పించడం)

షోడశోపచార పూజ -1(ఆవాహనం - అమ్మను ఆహ్వానించి, మనస్సును దైవం వైపు తిప్పడం)

 

ఆవాహనం — అమ్మను పిలవడం కాదు, మనసును అమ్మవైపు తిప్పడం

జై చండీ మాత 🙏

పూజగదిలో చేసే పూజ వల్ల మనలో ఒక మార్పు రావాలి.
పూజ పూర్తయ్యాక మన మాటల్లో కొంచెం మృదుత్వం, ప్రవర్తనలో కొంచెం సహనం, మనసులో కొంచెం శాంతి కనిపిస్తే - అదే పూజ ఇచ్చే అందమైన ప్రసాదం.

ఈ రోజు మనం మొదటి ఉపచారం ఆవాహనం గురించి తెలుసుకుందాం.

🌸 ఒక చిన్న ప్రశ్న

అమ్మ సర్వవ్యాపకురాలు కదా!
అయితే పూజ ప్రారంభంలో “ఆవాహయామి” — “అమ్మను ఆహ్వానిస్తున్నాను” — అని ఎందుకు అంటాం?

అమ్మ ఎక్కడో దూరంగా ఉండి, మనం పిలిచిన తర్వాత మన దగ్గరకు వస్తుందా?

కాదు.

ఆవాహనం అంటే అమ్మను ఎక్కడి నుంచో తీసుకురావడం కాదు.
మన చంచలమైన మనస్సును అమ్మ సన్నిధి వైపు తిప్పుకోవడం.

అమ్మ ఎప్పుడూ ఉంది. కానీ మన మనస్సు మాత్రం ఎన్నో విషయాల మధ్య తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆవాహనం సమయంలో మనం అమ్మను పిలుస్తున్నట్లు కనిపించినా, నిజానికి మన దృష్టినే అమ్మవైపు తీసుకువస్తున్నాం.

🌼 ఒక చిన్న ఉదాహరణ

సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాడు.

ఉదయం మనం ఇంటి తలుపు తెరిచినప్పుడు సూర్యుడు ఇంట్లోకి కొత్తగా వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ సూర్యుడు ఎక్కడి నుంచీ రాలేదు.

తలుపు మనమే తెరిచాం.

అలాగే ఆవాహనం.
అమ్మ ఎక్కడి నుంచీ రావాల్సిన అవసరం లేదు. మన హృదయ ద్వారం తెరుచుకోవాలి.

🌺 ఆవాహనం చేసేటప్పుడు

ఆవాహనం చేసేటప్పుడు ఆవాహన మంత్రాన్ని భక్తితో జపించి, "ఆవాహయామి" అని పలికి, అక్షతలను అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తాము.

ఈ చిన్న బాహ్యక్రియకు అంతరంగా,

"అమ్మా! నా పూజను స్వీకరించేందుకు నీ సన్నిధిని ఇక్కడ అనుగ్రహించు"

అనే భావాన్ని ఉంచుకోవచ్చు.

“ఆవాహయామి” అని పలికేటప్పుడు మనసులో ఇలా భావించవచ్చు:

“అమ్మా! నీవు ఎక్కడో లేవు; నాలోనూ, ఈ మూర్తిలోనూ, జగత్తంతటా నీవే ఉన్నావు. ఇంతవరకు బయట విషయాల్లో తిరిగిన నా మనస్సు ఇప్పుడు నీ వైపు తిరిగింది. నా పూజను స్వీకరించు తల్లి.”

ఇలా భావించినప్పుడు ఆవాహనం కేవలం మంత్రోచ్చారణగా మిగలదు. అది మనస్సును ఏకాగ్రం చేసే సాధనగా మారుతుంది.

🌿 పూజగది బయట కూడా ఆవాహనం

ఆవాహనం పూజాసమయంలో మాత్రమే ఉండాల్సిన భావం కాదు.

ఉదయం లేవగానే—

“అమ్మా! ఈ రోజు నా ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో నీవే వెలుగుతూ ఉండు.”

అని ఒక్క క్షణం గుర్తుచేసుకోవచ్చు.

ఎవరితోనైనా మాట్లాడే ముందు, కోపం వచ్చే సమయంలో, ఒక పని ప్రారంభించే ముందు — క్షణం పాటు అమ్మను గుర్తుచేసుకోవడం కూడా ఒక విధమైన అంతర ఆవాహనగా భావించవచ్చు.

🌸 ఈరోజు మననం

“అమ్మా! నేను నిన్ను పిలవడం కాదు.
నీవు ఎప్పుడూ నా హృదయంలోనే ఉన్నావని గుర్తుచేసుకుంటున్నాను.”

ఆవాహనం అంటే — అమ్మను మన దగ్గరకు తీసుకురావడం కాదు;
మన మనస్సును అమ్మ సన్నిధిలో నిలపడం.

అక్కడి నుంచే పూజ ప్రారంభమవుతుంది. 🌺

జై చండీ మాత 🙏

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి పోస్ట్ : షోడశోపచార పూజ - 2(ఆసనం -  అమ్మకు ఆసనం సమర్పించి, హృదయంలో స్థానం కల్పించడం.

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

షోడశోపచార పూజ - అమ్మ సన్నిధి - ధ్యానం

షోడశోపచార పూజ:  బాహ్యపూజ నుంచి అంతరపూజ వైపు

ధ్యానం - అమ్మవారి సన్నిధిలో మనస్సును నిలపడం

జై చండీ మాత 🙏

గణపతి ధ్యానం అనంతరం, సంకల్పం చేసుకున్న తర్వాత ఎవరి ఆరాధ్య దేవతను వారు ధ్యానించాలి. ఇక్కడ నేను శ్రీ చండికా పరమేశ్వరి  అమ్మవారిని ధ్యానించడం చెప్తున్నాను. 

ఇది అమ్మవారిని ఆవాహనం చేయడానికి ముందు వచ్చే ఒక ముఖ్యమైన అంతర సిద్ధత.

ఇప్పటివరకు శరీరం, శ్వాస, మనస్సును పూజకు సిద్ధం చేసుకున్నాం. గురువును స్మరించుకున్నాం. గణపతిని ప్రార్థించి ఏకాగ్రతను కోరుకున్నాం. సంకల్పం ద్వారా మనస్సుకు ఒక దిశను ఇచ్చుకున్నాం.

ఇప్పుడు ఆ మనస్సును అమ్మవారి స్వరూపంలో నిలపాలి.

🌸 అమ్మవారి ధ్యానం అంటే ఏమిటి?

ధ్యానం అంటే కేవలం కళ్లను మూసుకుని అమ్మవారి రూపాన్ని ఊహించడం మాత్రమే కాదు.

ఆరాధ్య దేవత అయిన శ్రీ చండికా పరమేశ్వరిని మనసులో స్మరించుకుంటూ, ఆమె దివ్యస్వరూపాన్ని హృదయంలో నిలుపుకోవడం కూడా ధ్యానమే.

మనము అనుసరిస్తున్న నిత్యపూజా పద్ధతిలోని ధ్యాన శ్లోకాన్ని భక్తితో పఠించాలి.

సింహాసనా సమారూఢాం
త్రినేత్రాం శూలధారిణీం ।
శంఖచక్రగదాహస్తాం
చండికాం ధ్యాయామ్యహం సదా ॥

అమ్మవారి రూపం మనసులో స్పష్టంగా కనిపించకపోయినా పరవాలేదు.

ఒక్క క్షణం—

“అమ్మా... నువ్వే నా ఆరాధ్య దేవత. ఇప్పుడు నా మనస్సంతా నీ మీద నిలవాలి.”

అనే భావంతో ఉండటం చాలు.

🪷 ధ్యానం నుంచి ఆవాహనకు

ఇక్కడ ఒక అందమైన తేడాను గుర్తుంచుకోవచ్చు.

ధ్యానం — అమ్మవారి స్వరూపాన్ని మనస్సులో స్మరించుకోవడం.

ఆవాహనం — ఆ స్మరణతో, భక్తితో, ఈ పూజను స్వీకరించేందుకు మన ముందున్న విగ్రహంలో అమ్మవారి సన్నిధిని ప్రార్థించడం.

అమ్మ ఎక్కడో దూరంగా ఉండి, మనం పిలిస్తేనే వస్తుంది అని భావించాల్సిన అవసరం లేదు. అమ్మ సర్వవ్యాపిని; మన హృదయంలో కూడా ఆమెనే ఉంది.

అయితే పూజలో మన మనస్సు ఒకచోట నిలవడానికి, మన ముందున్న విగ్రహాన్ని అమ్మవారి సన్నిధికి ఒక ఆరాధనా కేంద్రంగా స్వీకరించి, ఆమె సన్నిధిని భక్తితో ప్రార్థిస్తాము.

ఇదే బాహ్య పూజకు, అంతర భావానికి మధ్య ఉన్న అందమైన వారధి.

🌿 మనసులో ఒక చిన్న ప్రార్థన

“అమ్మా! నువ్వే నా శరణు. నువ్వే నా ఆరాధ్య దేవత. ఎక్కడెక్కడో తిరిగిన నా మనస్సు ఇప్పుడు నీ పాదాల దగ్గర నిలవాలి. నీ స్మరణలో ఈ పూజను ప్రారంభించడానికి నన్ను అనుగ్రహించు.”

ఈ ప్రార్థనను ప్రతిరోజూ పూర్తిగా పలకాల్సిన అవసరం లేదు.

ఒక్క క్షణం భావిస్తే చాలు.

🌸 మన జీవితంలో ఈ ధ్యానం

పూజలో అమ్మవారిని ధ్యానించడం మాత్రమే కాదు — రోజువారీ జీవితంలో కూడా అమ్మను గుర్తు చేసుకోవడం ఈ ధ్యానానికి కొనసాగింపే.

వంట చేస్తున్నప్పుడు అమ్మ గుర్తుకు రావడం...

ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అమ్మను స్మరించడం...

ఏదైనా సమస్య వచ్చినప్పుడు “అమ్మా, నువ్వు ఉన్నావు” అనుకోవడం...

ఇవన్నీ మనస్సును అమ్మవారి సన్నిధిలో ఉంచే చిన్న సాధనలే.

అదే “పూజ గదిలో మాత్రమే కాదు — జీవితం అంతా పూజ” అనే భావానికి ఒక చిన్న అడుగు.

🌺 ధ్యానం తర్వాత — ఆవాహనం

ఇప్పుడు అమ్మవారి స్వరూపాన్ని మనస్సులో నిలిపిన తర్వాత, తదుపరి క్రియ ఆవాహనం.

ధ్యానంలో మనం అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటాం.

ఆవాహనలో అదే భక్తిభావంతో, ఈ పూజను స్వీకరించేందుకు మన ముందున్న విగ్రహంలో అమ్మవారి సన్నిధిని ప్రార్థిస్తాం.

ఆవాహనం ఎలా చేయాలి? దాని మంత్రం ఏమిటి? దాని వెనుక ఉన్న అంతరభావం ఏమిటి? — ఇవన్నీ తదుపరి భాగంలో చూద్దాం. 

🌸 స్మరించుకోవాల్సిన భావం

"అమ్మా! నువ్వే నా ఆరాధ్య దేవత. నా మనస్సును నీ రూపంలో నిలిపి, నీ సన్నిధిలో నేను చేస్తున్న ఈ చిన్న పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించు." 🙏

ధ్యానం అంటే అమ్మను ఎక్కడి నుంచో మన దగ్గరకు తీసుకురావడం కాదు - మనస్సు ఎక్కడికక్కడ తిరగకుండా, అమ్మవారి సన్నిధిని గుర్తించి అక్కడే నిలపడం.

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి పోస్ట్ : షోడశోపచార పూజ -1 (ఆవాహనం - అమ్మను ఆహ్వానించి, మనస్సును దైవం వైపు తిప్పడం)

పూజ - అంతరార్థాల ప్రయాణం (సంకల్పం - అమ్మ సన్నిధిలో పూజా సంకల్పం)

సంకల్పం - పూజకు ముందు మనసుకు దిశ

గణపతి ధ్యానం తరువాత పూజలో మనం చేసే అత్యంత కీలకమైన ఘట్టం సంకల్పం.

పూజ ప్రారంభంలో మనం సంకల్పం చెబుతాం. పేరు, గోత్రం, తిథి, పూజా ఉద్దేశం వంటి వివరాలు అందులో ఉంటాయి.

సర్వాంతర్యామి అయిన ఆ జగన్మాతకు మన గురించి, మన మనసులో భావాలు గురించి అన్నీ తెలుసు. మరి ఇవి ఎందుకు చెబుతాం?

అమ్మకు తెలియజేయడానికి కాదు — మన మనస్సుకు దిశ చూపడానికి.

“నేను ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఒక పవిత్రమైన కార్యం కోసం కూర్చున్నాను. నా మనస్సును పూజపై నిలుపుతాను.”

అనే జాగరూకతే సంకల్పం.

“కుడిచేతి అరచేతిలో కొన్ని అక్షతలు ఉంచుకుని, మన గోత్రనామాలను ఉచ్చరిస్తూ, 'మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా...' అని సంకల్పం చెప్పుకుని, అమ్మా! నీ అనుగ్రహం కోసమే పూజ చేస్తున్నాను, నీ అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండేలా చూడు తల్లీ ... అని అనుకొని, చివరలో ఆ అక్షతలను అమ్మ పీఠం ముందు వదులుతాం. ఇది బాహ్యంగా మనం పూజను ఒక క్రమశిక్షణతో, స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభిస్తున్నాము అనడానికి గుర్తు.

🌿 “మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా...”

దీని భావాన్ని సరళంగా:

“అమ్మా! నాలోని దురితాలు (పాపాలు), అశుద్ధ సంస్కారాలు తొలగి, నా అంతరంగం శుద్ధి చెందేలా ఈ పూజను చేస్తున్నాను.”

అంటే కోపం తగ్గాలి, అహంకారం కరిగాలి, మనస్సు నిర్మలంగా మారాలి.

అప్పుడు సంకల్పం కేవలం ఒక మంత్రవాక్యం కాదు - అమ్మ పాదాల వద్ద మన అంతరంగాన్ని ఉంచే ప్రార్థన.

🌿 ఒక చిన్న ఉదాహరణ...

ఒక ప్రయాణం మొదలుపెట్టే ముందు మనం ఎక్కడికి వెళ్లాలో ముందుగా నిర్ణయించుకుంటాం. గమ్యం తెలియకుండా ఎంత దూరం ప్రయాణించినా, మనం ఎక్కడికి చేరుతున్నామో మనకే తెలియదు.

అలాగే పూజలో కూడా సంకల్పం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి గమ్యాన్ని గుర్తు చేస్తుంది.

“నేను ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో కూర్చున్నాను. ఈ పూజ ద్వారా నా మనస్సు శుద్ధి చెందాలి. నా లోపల మంచి మార్పు రావాలి. అమ్మ స్మరణలో నా మనస్సు నిలవాలి” — అని మనకు మనమే గుర్తు చేసుకోవడమే సంకల్పం.

అందుకే సంకల్పం అనేది కేవలం కొన్ని వివరాలను పలకడం కాదు.
“నేను ఎటువైపు వెళ్లాలి?” అని మన మనస్సుకు చూపించే దిక్సూచి.

పూజలోనే కాదు, మన నిత్యజీవితంలో కూడా ఏ పని ప్రారంభించినా, మనకు ఒక స్పష్టమైన సంకల్పం ఉండాలి. సరైన సంకల్పం లేని పని ఏ దిశా లేని పడవ లాంటిది. మనం ఏ పనిచేసినా కేవలం స్వార్థంతో కాకుండా, ఒక మంచి ఉద్దేశంతో పట్టుదలతో ప్రారంభించడం జీవితంలో '' మనకు నేర్పే గొప్పపాఠం.

🌸 ఈరోజు స్మరణ

సంకల్పం చెప్పేటప్పుడు ఒక్క క్షణం:

“అమ్మా! బయట పరిస్థితులు మారాలని మాత్రమే కాదు, ముందుగా నాలో మార్పు రావాలి. నా మనస్సును శుద్ధి చేసి, నీ స్మరణలోనే నిలిచేలా అనుగ్రహించు.”

సంకల్పం — పూజను ప్రారంభించే ముందు చెప్పే కొన్ని మాటలు మాత్రమే కాదు;
మనస్సును
బాహ్యప్రపంచం నుండి అమ్మ వైపు తిప్పే ఒక బలమైన మొదటి నిర్ణయం.

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా: షోడశోపచార పూజ - అమ్మ సన్నిధి - ధ్యానం 


28, సెప్టెంబర్ 2026, సోమవారం

పూజ - అంతరార్థాల ప్రయాణం (గణపతి ధ్యానం - విఘ్నాలను తొలగించమని ప్రార్థించడం నుంచి అంతరాయాలను గుర్తించి అధిగమించడం వరకు)

గణపతి ధ్యానం - విఘ్నాల నుంచి ఏకాగ్రత వైపు

గురు ధ్యానం అనంతరం నిత్యపూజలో వచ్చే తదుపరి భాగం గణపతి ధ్యానం.

ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించే ముందు గణపతిని స్మరించడం మన సనాతన సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం. గణపతిని విఘ్నేశ్వరుడు, బుద్ధికి అధిపతి, ఏకాగ్రతను ప్రసాదించేవాడుగా భక్తితో స్మరిస్తాము.

ఇక్కడ గణపతిని ధ్యానించడం అంటే బయట నుంచి విఘ్నాలు రాకూడదని కోరుకోవడం మాత్రమే కాదు. మనలోని తొందర, చంచలత్వం, గందరగోళం, అహంకారం వంటి అంతరాయాలు తొలగి, మనస్సు ప్రశాంతంగా ఉండాలని ప్రార్థించడం కూడా.

🕉️ గణపతి ధ్యానం ఎలా చేయాలి?

మనము అనుసరిస్తున్న నిత్యపూజా పద్ధతిలో గణపతి స్మరణకు ఉపయోగించే ఈ శ్లోకాలను భక్తితో పఠిస్తూ, గణపతి స్వరూపాన్ని మనసులో స్మరించుకోవచ్చు.

గణపతి శ్లోకాలు :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ | అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ||

ఆ సమయంలో మన భావం:

"విఘ్నేశ్వరా! నా పూజకు ఆటంకాలు తొలగించి, శుభబుద్ధిని, ఏకాగ్రతను, వినయాన్ని ప్రసాదించు. అమ్మవారి పూజను ప్రశాంతమైన మనస్సుతో చేయగలిగేలా అనుగ్రహించు."

ఇంతే. దీనికోసం ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పూజకు మనల్ని సిద్ధం చేసే ఒక అందమైన తొలిమెట్టు.

విఘ్నాలు అంటే ఏమిటి?

పూజకు కూర్చున్నప్పుడు మనస్సు ఒకచోట నిలవకపోవడం, తొందరగా పూజ పూర్తి చేయాలనిపించడం, అవసరం లేని ఆలోచనలు రావడం, చిరాకు కలగడం, “నేనే చేస్తున్నాను” అనే అహంకారం రావడం - ఇవన్నీ కూడా మన సాధనకు అంతరాయాలుగా మారవచ్చు.

అందుకే గణపతి ధ్యానాన్ని ఒక చిన్న అంతర సిద్ధతగా చూడవచ్చు.

బయట ఏదైనా శబ్దం వచ్చినా, ఎవరో పిలిచినా, ఏదైనా పని గుర్తుకు వచ్చినా - పూజ చెడిపోయిందని భావించాల్సిన అవసరం లేదు.

"విఘ్నం వచ్చినా నా మనస్సు మళ్లీ అమ్మవారి దగ్గరకు రావాలి."

అదే సాధన.

ఒక్కసారి మనస్సు చెదిరినా, మళ్లీ అమ్మవారి స్మరణకు తీసుకురావడం కూడా పూజలోని ఒక భాగమే.

🌸 అమ్మవారి పూజకు ముందు గణపతి ధ్యానం

మన ప్రధాన ఆరాధ్య దేవత అమ్మవారు. అమ్మవారి పూజకు ముందు గణపతిని స్మరించడం వల్ల మన ఆరాధన మారదు.

మన సంప్రదాయంలో శుభకార్యానికి ముందు గణపతిని స్మరించి, కార్యం సక్రమంగా సాగాలని ప్రార్థిస్తాము. ఆ తరువాత మన ఆరాధ్య దేవతను భక్తితో పూజిస్తాము.

అందువల్ల గణపతి ధ్యానం కూడా అమ్మవారి పూజకు మనల్ని సిద్ధం చేసే ఒక అందమైన మెట్టు.

🪷 మన జీవితంలో గణపతి ధ్యానం

ఈ భావం పూజా గదికే పరిమితం కాదు.

ఏ పని ప్రారంభించినా ఒక్క క్షణం:

"గణపతీ! ఈ పని సక్రమంగా జరిగేలా శుభబుద్ధిని ప్రసాదించు."

అని స్మరించుకోవచ్చు.

దీంతో సమస్యలు ఎప్పుడూ రాకుండా ఉండాలని మాత్రమే కోరుకోవడం కాకుండా, సమస్య వచ్చినప్పుడు కూడా మనస్సు తడబడకుండా ఉండే అంతరబలాన్ని కోరుకుంటాం. 

🌸 స్మరించుకోవాల్సిన భావం

"విఘ్నేశ్వరా! బాహ్య, అంతర ఆటంకాలు తొలగి నా బుద్ధి స్పష్టంగా, నా మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. నీ స్మరణతో అమ్మవారి సన్నిధిలోకి ప్రశాంతంగా ప్రవేశించాలి."🙏

మరోసారి చెప్తున్నాను -

వివరణ పెద్దదిగా ఉండవచ్చు - ఆచరణ మాత్రం సరళంగా ఉండాలి.

రోజూ పూజ చేసేటప్పుడు ఈ మొత్తం వివరణను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గణపతి ధ్యానం వచ్చినప్పుడు ఆ ఒక్క క్షణం భావాన్ని స్మరించుకుంటే చాలు.

🌺 భక్తితో చేసే పూజ - భారంగా కాదు, భరోసాగా ఉండాలి. 

గణపతిని స్మరించడంతో మనలోని చంచలత్వాన్ని కొంత పక్కకు పెట్టి, మనస్సును పూజ వైపు తిప్పుకున్నాం.

ఇప్పుడు ఆ ప్రశాంతమైన మనస్సుతో “నేను ఈ పూజను ఎందుకు చేస్తున్నాను?” అనే భావాన్ని స్పష్టంగా చేసుకోవాలి.

అక్కడి నుంచే సంకల్పం ప్రారంభమవుతుంది.

గణపతి ధ్యానం మనస్సును సిద్ధం చేస్తే,
సంకల్పం ఆ మనస్సుకు దిశను చూపిస్తుంది. 🌺

శ్రీమాతా శరణం

శ్రీ రామ జయం

జై హనుమాన్

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (సంకల్పం - అమ్మ సన్నిధిలో పూజా సంకల్పం)

పూజ - అంతరార్థాల ప్రయాణం (గురుధ్యానం - గురుస్మరణ నుంచి జ్ఞానమార్గంలో అంతర్ముఖత వైపు)

🌸 గురుధ్యానం - జ్ఞానానికి మార్గం చూపే వెలుగు

సంప్రోక్షణం తరువాత నిత్యపూజలో వచ్చే పవిత్రమైన దశ గురుధ్యానం.

మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గురువుకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది.

గురువు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు; అజ్ఞానం నుంచి జ్ఞానానికి నడిపించే జ్ఞానప్రకాశం కూడా గురుతత్త్వమే.

🌿 గురువును ముందుగా ఎందుకు స్మరిస్తాం?

ఆధ్యాత్మిక మార్గంలో మనకు దైవాన్ని తెలుసుకునే దిశను చూపినవారు గురువు. అందుకే పూజలో గురువును స్మరించడం ద్వారా:

"నాకు ఈ మార్గాన్ని చూపించిన గురువుకు ముందుగా నమస్కరిస్తున్నాను. వారి అనుగ్రహంతో నేను అమ్మను ఆరాధిస్తున్నాను."

అనే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాం.

🪷 గురు ధ్యానం ఎలా చేయాలి?

మనము అనుసరిస్తున్న నిత్యపూజా పద్ధతిలో మృగముద్రతో గురుధ్యాన శ్లోకాన్ని రెండుసార్లు భక్తితో పఠిస్తూ, గురువును మనసులో స్మరించుకోవాలి.

గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః
గురుర్ దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః ॥

అర్థం:

"గురువు బ్రహ్మస్వరూపుడు, గురువు విష్ణుస్వరూపుడు, గురువు మహేశ్వర స్వరూపుడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. అటువంటి శ్రీగురువుకు నమస్కారం."

🪷 మృగముద్ర ఎలా చేయాలి?

గురుధ్యాన శ్లోకం పఠించేటప్పుడు మన పూజా విధానంలో చెప్పిన మృగముద్రను ఉపయోగిస్తాం.

సాధారణంగా మృగముద్రలో బొటనవేలు, మధ్యవేలు, ఉంగరవేలు కలిపి ఉంచి, చూపుడు వేలు మరియు చిటికెన వేలు సున్నితంగా చాచి ఉంచుతారు.

ముద్రను చేతితో చేస్తూ, దృష్టిని మరియు మనస్సును గురుస్మరణలో నిలపాలి.

మృగముద్రను కేవలం చేతి ఆకారంగా కాకుండా, మనస్సును గురుభావంలో నిలిపే ఒక సంకేతంగా భావించవచ్చు.

ముద్ర సరిగ్గా ఉందా లేదా అనే ఆలోచనలో మనస్సు నిలిచిపోకుండా, గురుభావమే ప్రధానమని గుర్తుంచుకోవాలి.

🌿 రెండుసార్లు ఎందుకు పఠిస్తాం?

రెండుసార్లు పఠించడం మనం అనుసరిస్తున్న నిత్యపూజా విధానంలోని ఆచారం. దాన్ని యాంత్రికంగా కాకుండా, ప్రతి పఠనంలో గురుభావాన్ని మరింత స్థిరపరచుకునే అవకాశంగా తీసుకోవచ్చు.

మొదటిసారి:

“గురువుకు నమస్కరిస్తున్నాను.”

అనే భావం.

రెండవసారి:

“గురువు చూపిన జ్ఞానమార్గంలో నడవడానికి నా మనస్సును సమర్పిస్తున్నాను.”

అనే అంతరభావం.

ఇలా ఆచారానికి మనసును జోడించవచ్చు.

🌺 గురువు — జ్ఞానానికి వెలుగు

దీపం మనకు వెలుగును చూపినట్లే, గురువు ఇచ్చే జ్ఞానం మనలోని సత్యాన్ని మనమే తెలుసుకునేలా చేస్తుంది.

అందుకే గురు ధ్యానం అంటే కేవలం “గురువు బయట ఉన్న ఒక వ్యక్తి” అని స్మరించడం మాత్రమే కాదు.

“గురువు చూపిన జ్ఞానమార్గం నా లోపల వెలుగుగా నిలవాలి.”

అనే భావాన్ని కూడా మననం చేసుకోవడం.

గురువు మార్గాన్ని చూపగలరు; ఆ మార్గంలో నడవాల్సింది మనమే.

కాబట్టి గురువును స్మరించడం అంటే వారి బోధనలను మన జీవితంలో ఆచరించడానికి సిద్ధపడటం కూడా.

🌿 గురుతత్త్వం — మన జీవితంలో

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు — మనకు మంచి మార్గాన్ని చూపిన ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం మనలో వినయాన్ని పెంచుతుంది.

కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక పుస్తకం, ఒక ఉపదేశం కూడా మనలో జ్ఞానాన్ని మేల్కొలపవచ్చు.

అప్పుడు మనలో ఒక భావం కలగాలి:

“నాకు తెలిసినది కొంత మాత్రమే; ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంది.”

ఈ వినయమే జ్ఞానానికి తలుపులు తెరుస్తుంది.

🌸 స్మరించుకోవాల్సిన భావం

“అజ్ఞానం నుంచి జ్ఞానానికి నడిపించిన వారికి నమస్కారం. మీరు చూపిన మార్గంలో నడుస్తూ, అమ్మ సన్నిధిని తెలుసుకునే హృదయాన్ని ప్రసాదించండి.” 🙏

గురుస్మరణతో ప్రారంభమైన ఈ ప్రయాణం, క్రమంగా గురువు చూపిన మార్గాన్ని మన అంతరంగంలో ఆచరించే ప్రయాణంగా మారాలి.

గురువుకు నమస్కారం అంటే - జ్ఞానానికి నమస్కారం.
గురువును స్మరించడం అంటే - జ్ఞానమార్గంలో నడవడానికి సిద్ధపడటం.

శ్రీమాతా శరణం 🙏
శ్రీరామ జయం 🙏
జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (గణపతి ధ్యానం - విఘ్నాలను తొలగించమని ప్రార్థించడం నుంచి, మనలోని అంతరాయాలను గుర్తించి అధిగమించడం వరకు)


27, సెప్టెంబర్ 2026, ఆదివారం

పూజ - అంతరార్థాల ప్రయాణం (సంప్రోక్షణ - పవిత్ర జలస్పర్శ నుంచి పరిసరాలూ, అంతరంగమూ పవిత్రం కావడం వరకు)

💧 సంప్రోక్షణం - పవిత్రతను ఆహ్వానించడం

ఘంటానాదం తరువాత నిత్యపూజలో చేసే ముఖ్యమైన క్రియ సంప్రోక్షణం.

సంప్రోక్షణం అంటే పవిత్ర జలాన్ని మంత్రపూర్వకంగా ప్రోక్షించడం. పూజా ద్రవ్యాలు, పూజా స్థలం, పరిసరాలు పవిత్రంగా ఉండాలని భావిస్తూ చేసే క్రియ ఇది. 

సంప్రోక్షణం ఎలా చేయాలి?

ఒక పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకుని, మన నిత్య పూజావిధానంలో చెప్పబడిన సంప్రోక్షణ మంత్రాన్ని పఠిస్తూ, సంప్రదాయంలో సూచించిన విధంగా పూజాద్రవ్యాలు, పూజా స్థలం మొదలైన వాటిపై నీటిని ప్రోక్షించాలి. 

🌿 సంప్రోక్షణ మంత్రం

పవిత్ర జలాన్ని పాత్రలో తీసుకుని, ముందుగా ఈ మంత్రాన్ని స్మరించాలి:

గంగే చ యమునే చైవ
గోదావరి సరస్వతి ।
నర్మదే సింధు కావేరి
జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥

అర్థం:
“ఓ గంగా, యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరీ నదీ దేవతలారా! ఈ జలంలో మీ పవిత్ర సాన్నిధ్యం కలుగుగాక.”

తరువాత,

పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య ।

అర్థం:
“పూజకు ఉపయోగించే ద్రవ్యాలను, ఆరాధ్య దేవతను, నన్ను — ఈ పవిత్ర జలంతో ప్రోక్షిస్తున్నాను.”

అని భావిస్తూ, సంప్రదాయంలో సూచించిన విధంగా పుష్పంతో పూజా ద్రవ్యాలు, పూజా స్థలం మరియు మనపై కూడా కొద్దిగా జలాన్ని ప్రోక్షించాలి.

ఇక్కడ కూడా ముఖ్యమైనది కేవలం నీరు చల్లడం కాదు — మంత్రం, భక్తి, పవిత్రత భావంతో చేయడం.

💧 మార్జనం — సంప్రోక్షణం

ఈ రెండింటినీ సులభంగా ఇలా గుర్తుంచుకోవచ్చు:

మార్జనం — “నేను శుద్ధి కావాలి.”
సంప్రోక్షణం — “నా పూజకు సంబంధించిన వాతావరణం పవిత్రంగా ఉండాలి.”

అంటే మార్జనం ప్రధానంగా మన శుద్ధి కోసం; సంప్రోక్షణం ప్రధానంగా పూజా స్థలం, ద్రవ్యాలు, పరిసరాల పవిత్రత కోసం.

🌸 బాహ్య పవిత్రత నుంచి అంతర పవిత్రత

పూజా ద్రవ్యాలను శుద్ధి చేస్తున్నప్పుడు మనం మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు.

“పూజా స్థలం పవిత్రంగా ఉండాలి; పూజ చేసే హృదయం కూడా పవిత్రంగా ఉండాలి.”

అమ్మకు సమర్పించబోయే పుష్పం, గంధం, అక్షతలు, నీరు, దీపం వంటి ప్రతి వస్తువును శ్రద్ధగా సిద్ధం చేసుకోవడం కూడా పూజలో ఒక భాగమే.

సంప్రోక్షణం చేసేటప్పుడు ఒక్క క్షణం ఇలా స్మరించుకోవచ్చు:

“అమ్మా! నీకు సమర్పించబోయే ప్రతి వస్తువును శ్రద్ధతో, పవిత్ర భావంతో సిద్ధం చేస్తున్నాను.” 

🌺 పూజగదిని దాటి...

ఇల్లు, పూజాగది, పూజా ద్రవ్యాలు శుభ్రంగా ఉంచినట్లే, అప్పుడప్పుడు మనలోకి కూడా చూసుకోవాలి.

“నా ఆలోచనలు శుభ్రంగా ఉన్నాయా?
నా మాట ఎవరికైనా బాధ కలిగిస్తుందా?
నా చేతులతో నేను మంచి పని చేస్తున్నానా?”

అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం కూడా ఒక విధమైన అంతర సంప్రోక్షణమే.

🌸 💧 స్మరించుకోవాల్సిన భావం

“అమ్మా! ఈ పవిత్ర జలంతో నా పూజా స్థలం, పూజా ద్రవ్యాలు పవిత్రమవుతున్నట్లే, నా హృదయం కూడా నీ సన్నిధికి తగిన పవిత్రతను పొందాలి.” 🙏

బయటి పవిత్రత కంటికి ఆనందాన్ని ఇస్తుంది. లోపలి పవిత్రత అమ్మకు హృదయాన్ని దగ్గర చేస్తుంది.

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (గురుధ్యానం - గురుస్మరణ నుంచి జ్ఞానమార్గంలో అంతర్ముఖత వైపు)

పూజ - అంతరార్థాల ప్రయాణం (ఘంటానాదం - శబ్దం నుంచి అంతర నిశ్శబ్దం వైపు)

ఘంటానాదం - బయటి శబ్దం నుంచి లోపలి స్మరణకు తీసుకువెళ్లే ఒక చిన్న అడుగు

పూజ ప్రారంభంలో మనం ఘంట మోగిస్తాం. అది కేవలం పూజ ప్రారంభానికి సూచన మాత్రమే కాదు. దాని వెనుక కూడా ఒక అందమైన అంతరార్థం ఉంది.

ఘంట మోగించే ముందు ఈ శ్లోకాన్ని చెబుతాం:

ఆగమార్థం తు దేవానాం
గమనార్థం తు రాక్షసామ్ ।
ఘంటారవం కరోమ్యాదౌ
దేవతాహ్వానలాంఛనం ॥

అర్థం:

“దేవతల ఆగమనానికి, రాక్షసుల గమనానికి సూచనగా, దేవతలను ఆహ్వానించే చిహ్నంగా పూజ ప్రారంభంలో ఘంటానాదం చేస్తున్నాను.”

ఇది బాహ్యంగా పూజకు పవిత్రమైన ప్రారంభాన్ని సూచిస్తుంది. “ఘంటానాదం పూజా వాతావరణంలో ఒక పవిత్రమైన నాదాన్ని నింపుతుంది; మన దృష్టిని చుట్టూ ఉన్న విషయాల నుంచి అమ్మ సన్నిధి వైపు మళ్ళిస్తుంది.

🌿 ఘంటానాదం — అంతరార్థం

మననం చేసుకునే ఒక అంతర భావం ఏమిటంటే:

దేవతలు — దైవస్మరణకు తోడ్పడే శుభ భావాలు.
రాక్షసులు — అశాంతి, కోపం, అసూయ, అహంకారం వంటి దైవస్మరణకు అడ్డుగా నిలిచే భావాలు.

అప్పుడు ఘంటానాదం కేవలం బయట వినిపించే శబ్దం కాదు — మనస్సుకు ఒక మేల్కొలుపు.

పూజకు ముందు మనస్సు ఎన్నో విషయాల్లో తిరుగుతూ ఉంటుంది. ఇంటి పనులు, కుటుంబ విషయాలు, నిన్నటి జ్ఞాపకాలు, రేపటి ఆలోచనలు...

ఘంట మోగించే ఆ క్షణంలో ఒక్కసారి ఇలా స్మరించుకోవచ్చు:

“అమ్మా! నా లోపలి అశాంతి తొలగి, నా మనస్సు నీ స్మరణతో ప్రతిధ్వనించాలి .”

ఇక్కడ మనం అమ్మను ఎక్కడి నుంచో పిలవడం లేదు.
అమ్మ ఎప్పుడూ మనతోనే ఉంది. మారవలసింది అమ్మ సన్నిధి కాదు — మన దృష్టి.

ఘంటానాదం ఆ మార్పుకు ఒక గుర్తు.

🌸 మన జీవితంలో కూడా ఒక ఘంటానాదం

పూజలో ఘంటను మోగించినట్లే, జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఒక అంతర ఘంట అవసరం.

కోపం వచ్చినప్పుడు, ఎవరైనా బాధించినప్పుడు, వెంటనే గట్టిగా సమాధానం చెప్పాలనిపించినప్పుడు — ఒక్క క్షణం ఆగి,

“అమ్మా!” 

అని స్మరించగలిగితే, అదే మన జీవితంలోని ఘంటానాదం.

ఆ ఒక్క క్షణం మన ప్రతిస్పందనను మార్చడానికి అవకాశం ఇస్తుంది.

🌺 చిన్న సాధన

ఘంట మోగించే ముందు ఒక్క క్షణం ఆగండి. ఘంటానాదం వినిపిస్తున్నప్పుడు ఇలా భావించండి:

“అమ్మా! నా లోపలి అశాంతి తొలగి, నీ స్మరణ ప్రతిధ్వనించాలి.”

తర్వాత పూజను కొనసాగించండి.

ఘంటను చేతితో మోగించేది మనమే;
కానీ ఆ ఘంటానాదం మేల్కొలపవలసింది మన అంతరంగాన్ని.

అప్పుడు పూజలోని ప్రతి క్రియ మనల్ని బయట నుంచి లోపలికి తీసుకువెళ్లే ఒక అడుగుగా మారుతుంది.

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ -  అంతరార్థాల ప్రయాణం (సంప్రోక్షణ -  పవిత్ర జలస్పర్శ నుంచి పరిసరాలూ, అంతరంగమూ పవిత్రం కావడం వరకు)

26, సెప్టెంబర్ 2026, శనివారం

పూజ - అంతరార్థాల ప్రయాణం (ప్రాణాయామం - శ్వాసను సమతుల్యం చేసుకోవడం నుంచి మనస్సును స్థిరపరచడం వరకు)

 

ప్రాణాయామం — మనస్సును అమ్మవారి వైపు తిప్పుకోవడం

ఆసన శుద్ధి తరువాత పూజలో మనం చేసే ముఖ్యమైన క్రియల్లో ప్రాణాయామం ఒకటి.

ప్రాణాయామం అంటే సాధారణంగా శ్వాసను నియంత్రించడం అని చెబుతాం.
కానీ పూజ సందర్భంలో దాన్ని కేవలం శ్వాసాభ్యాసంగా కాకుండా, మనస్సును బయట ప్రపంచం నుంచి లోపలికి తీసుకువచ్చే సాధనగా కూడా భావించవచ్చు.

🌿 ప్రాణాయామం ఎందుకు?

పూజకు కూర్చున్నప్పుడు శరీరం పూజగదిలో ఉన్నా, మనస్సు మాత్రం ఎన్నో ఆలోచనల్లో తిరుగుతూ ఉంటుంది. అందుకే కొద్దిసేపు శ్వాసను గమనిస్తూ మనస్సును నెమ్మదిగా ప్రశాంతం చేసుకోవచ్చు.

నిత్యపూజా పద్ధతిలో ప్రాణాయామం చేసేటప్పుడు సాధారణంగా వ్యాహృతులతో కూడిన గాయత్రీ మంత్రాన్ని పఠిస్తారు.

🕉️ ప్రాణాయామ మంత్రం

ఓం భూః । ఓం భువః । ఓం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓం సత్యమ్ ।

ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ।
ధియో యో నః ప్రచోదయాత్ ॥

ఓం ఆపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ
భూర్భువస్సువరోమ్ ॥

🌸 మంత్రం యొక్క సరళమైన అర్థం

“భూః, భువః, సువః మొదలైన సమస్త లోకాల స్వరూపుడైన పరమాత్మను స్మరిస్తున్నాను.

ఆ దివ్యమైన సవితృదేవుని పరమ తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. ఆయన మా బుద్ధులను సన్మార్గంలో ప్రేరేపించుగాక.

జలం, జ్యోతి, అమృతస్వరూపమైన రసం - ఇవన్నీ బ్రహ్మస్వరూపమే.”

🪷 మంత్రంతో పాటు అంతర్భావం

మంత్రాన్ని పఠిస్తూ శ్వాసను ప్రశాంతంగా గమనిస్తూ మనసులో ఇలా అనుకోవచ్చు:

“అమ్మా!
ఇప్పటివరకు ఎక్కడెక్కడో తిరిగిన నా మనస్సును ఇప్పుడు నీ సన్నిధిలోకి తీసుకు వస్తున్నాను.
ఈ పూజలో నా మనస్సు నీ మీద నిలిచేలా అనుగ్రహించు.”

అంతే... ఈ భావన చాలు.

పూజకు కూర్చున్నప్పుడు శరీరం పూజగదిలో ఉన్నా, మనస్సు మాత్రం ఎన్నో ఆలోచనల్లో తిరుగుతూ ఉంటుంది.

అందుకే కొద్దిసేపు శ్వాసను గమనిస్తూ మనస్సును నెమ్మదిగా ప్రశాంతం చేసుకోవచ్చు.

🌸 శ్వాస — అమ్మ స్మరణకు ఒక వంతెన

శ్వాస మనతో ఎప్పుడూ ఉంటుంది.
అందుకే శ్వాసను గమనించడం ద్వారా మనం ఈ క్షణంలోకి రావచ్చు.

శ్వాస లోపలికి వస్తోంది...
శ్వాస బయటకు వెళ్తోంది...

ఆ శ్వాసతో పాటు అమ్మను స్మరించుకోవడం ద్వారా మనస్సు క్రమంగా ప్రశాంతమవుతుంది.

ప్రాణాయామం అంటే తప్పనిసరిగా ఎక్కువసేపు శ్వాసను బిగపట్టడం కాదు. మనకు తెలిసిన సంప్రదాయ విధానాన్ని అనుసరిస్తూ, శరీరానికి ఇబ్బంది కలగకుండా చేయాలి.

లక్ష్యం శ్వాసను జయించడం కాదు — మనస్సును అమ్మవారి సన్నిధికి తీసుకురావడం.

🌼 ఈరోజు చిన్న సాధన

ఈరోజు పూజలో ప్రాణాయామం చేసేటప్పుడు కాసేపు తొందరపడకుండా శ్వాసను గమనించండి.

శ్వాస — ప్రశాంతతకు.
మనస్సు — అమ్మ స్మరణకు.
హృదయం — అమ్మ సన్నిధికి.

శ్వాస చేసే విధానం మారకపోవచ్చు.
కానీ ప్రాణాయామం చేసే మనసు మాత్రం కొంచెం మారవచ్చు.

ఇదే - అర్థంతో చేసే పూజ యొక్క "అందం, ఆనందం."

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (ఘంటానాదం - శబ్దం నుంచి అంతర నిశ్శబ్దం వైపు)

పూజ - అంతరార్థాల ప్రయాణం (ఆసనశుద్ధి - కూర్చునే స్థలం నుంచి మనస్సుకు స్థిరాసనం వరకు

ఆసన శుద్ధి - కూర్చునే స్థలం నుంచి అమ్మ సన్నిధి వరకు

నిత్యపూజలో భూతోచ్చాటనం తరువాత చేసే ముఖ్యమైన క్రియ ఆసన శుద్ధి.

ఆసనం అంటే మనం పూజ చేసేటప్పుడు కూర్చునే స్థలం. ఆ స్థలాన్ని పవిత్రంగా భావించి, ప్రశాంతంగా కూర్చుని అమ్మను ఆరాధించడానికి మనలను మనం సిద్ధం చేసుకోవడమే ఆసన శుద్ధి.

🌿 ఆసన శుద్ధి ఎందుకు?

రోజువారీ జీవితంలో మనం ఎన్నో పనులు చేసే ఒకే ప్రదేశం, పూజ కోసం కూర్చున్నప్పుడు మనకు అమ్మ సన్నిధిగా మారుతుంది.

అందుకే ఆసన శుద్ధి ద్వారా:

“ఈ స్థలం పూజకు పవిత్రమైన స్థలంగా మారాలి.
నేను ఇక్కడ ప్రశాంతమైన మనస్సుతో అమ్మను ఆరాధించాలి.”

అనే భావాన్ని కలిగి ఉంటాం.

🕉️ ఆసన శుద్ధి ఎలా చేయాలి?

మన నిత్యపూజా పద్ధతిలో చెప్పబడిన ఆసన శుద్ధి మంత్రాన్ని పఠిస్తూ, సంప్రదాయంలో సూచించిన విధంగా ఆసనంపై లేదా క్రింద జలాన్ని ప్రోక్షించాలి లేదా అక్షతలను సమర్పించాలి.

ఆసన శుద్ధి మంత్రం:

పృథ్వీ త్వయా ధృతా లోకా
దేవి త్వం విష్ణునా ధృతా ।
త్వం చ ధారయ మాం దేవి
పవిత్రం కురు చాసనం ॥

మంత్రం యొక్క సరళమైన అర్థం:

“అమ్మా పృథ్వీదేవీ! నీవు సమస్త లోకాలను ధరిస్తున్నావు. నిన్ను శ్రీమహావిష్ణువు ధరిస్తున్నాడు. అలాగే నీవు నన్ను కూడా ధరించి, నేను కూర్చున్న ఈ ఆసనాన్ని పవిత్రంగా చేయుము.”

అంతర్భావం:

“అమ్మా! ఇప్పుడు నీ పూజ కోసం నేను ఈ ఆసనంపై కూర్చున్నాను. నా శరీరం స్థిరంగా, నా శ్వాస ప్రశాంతంగా, నా మనస్సు ఏకాగ్రంగా ఉండేలా నన్ను అనుగ్రహించు. ఈ ఆసనం నీ సన్నిధిగా మారుగాక.”

ఇక్కడ కూడా మంత్రం + క్రియ + భావం కలిసి ఉన్నప్పుడే పూజ ఒక సాధనగా మారుతుంది.

🌸 ఆసనం — స్థిరత్వానికి గుర్తు

పూజలో ఆసనం మనకు ఒక చిన్న పాఠాన్ని నేర్పుతుంది:

“కొంతసేపు తొందరపడకుండా, ప్రశాంతంగా అమ్మ సన్నిధిలో ఉండు.”

శరీరం స్థిరంగా ఉంటే మనస్సును కూడా నెమ్మదిగా స్థిరపరచుకోవచ్చు. 

ఆసన శుద్ధి చేసేటప్పుడు ఒక్క క్షణం ఇలా స్మరించుకోవచ్చు:

“అమ్మా! నా శరీరం స్థిరంగా ఉండాలి. నా శ్వాస ప్రశాంతంగా ఉండాలి. నా మనస్సు నీ పాదాల వద్ద నిలవాలి.”

🌺 బాహ్య ఆసనం — అంతర ఆసనం

ఆసనం బయట శుద్ధి చేయబడుతుంది. కానీ నిజమైన స్థిరత్వం మనస్సులో రావాలి.

పూజ ప్రారంభించే ముందు:

“గతాన్ని కొంతసేపు పక్కన పెడదాం.
భవిష్యత్తు ఆలోచనలను కూడా పక్కన పెడదాం.
ఈ క్షణంలో అమ్మ సన్నిధిలోనే ఉండదాం.”

అని మనసుకు చెప్పుకోవచ్చు.

పూజగదిని దాటి జీవితంలో కూడా ఇదే భావం మనకు తోడుగా ఉండాలి. సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ప్రశంస వచ్చినా, విమర్శ వచ్చినా — మన అంతరంగంలో ఒక స్థిరమైన ఆసనం ఉండాలి. ఆ ఆసనంపై అమ్మ స్మరణ ఉండాలి.

🙏 చివరగా

ఆసన శుద్ధి అంటే కేవలం కూర్చునే స్థలాన్ని శుద్ధి చేయడం కాదు.

“నేను ఇప్పుడు అమ్మ సన్నిధిలో కూర్చున్నాను” అనే జాగృతిని మనలో కలిగించే ఒక అందమైన పద్ధతి.

అందుకే ఆసన శుద్ధి చేసేటప్పుడు ఒక్క మాట:

“ఈ ఆసనం మీద నా శరీరం కూర్చుంది;
నా మనస్సు మాత్రం అమ్మ పాదాల వద్ద కూర్చోవాలి.”
 

 శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ అంతరార్థాల ప్రయాణం - (ప్రాణాయామం -  శ్వాసను సమతుల్యం చేసుకోవడం నుంచి మనస్సును స్థిరపరచడం వరకు)


25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

పూజ - అంతరార్థాల ప్రయాణం (భూతోచ్ఛాటనం - బయట ఉన్న అశాంతి నుంచి అంతరంగ ప్రశాంతత వైపు)

భూతోచ్చాటనం - పూజకు పవిత్రమైన వాతావరణం 

నిత్యపూజలో మార్జనం తరువాత చేసే క్రియలలో భూతోచ్చాటనం ఒకటి.

“భూతోచ్చాటనం” అనే పదం వినగానే కొందరికి భయంగా, వింతగా అనిపించవచ్చు. కానీ పూజా క్రమంలో దీన్ని పూజకు ముందు వాతావరణాన్ని, మనస్సును ప్రశాంతంగా సిద్ధం చేసుకునే ఒక శుద్ధి భావనగా అర్థం చేసుకోవాలి.

🌿 భూతోచ్చాటనం అంటే ఏమిటి?

భూతం అనే పదానికి కేవలం ఒకే అర్థం లేదు. పంచభూతాలు — భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం — కూడా భూతాలే.

పూజా సంప్రదాయంలో భూతోచ్చాటనం ద్వారా పూజకు ఆటంకం కలిగించే బాహ్య ప్రభావాలు తొలగి, పవిత్రమైన వాతావరణం ఏర్పడాలి అనే భావాన్ని వ్యక్తం చేస్తాం.

మన నిత్యపూజా పద్ధతిలో ఉన్న భూతోచ్చాటన మంత్రాన్నే భక్తితో పఠిస్తూ, అక్షతలను వాసన చూసి, ఎడమవైపు విసిరేస్తాం. దీని ద్వారా పూజకు ఆటంకం కలిగించే బాహ్య శక్తులు లేదా ప్రభావాలు తొలగి, పూజా స్థలంలో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడాలని భావిస్తాం.

భూతోచ్చాటన మంత్రం

ఉత్తిష్ఠంతు భూతపిశాచాః
ఏతే భూమిభారకాః ।
ఏతేషామవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే ॥

మంత్రం యొక్క సరళమైన అర్థం:

“భూతపిశాచాదులు తొలగిపోవాలి. భూమికి భారంగా ఉండే అశాంతికరమైన శక్తులు నా పూజకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండాలి. వాటి వల్ల ఎటువంటి విరోధం లేకుండా నేను ఈ పవిత్రమైన దైవకర్మను ప్రారంభిస్తున్నాను.”

అంతర్భావంగా, “అమ్మా! నా పూజకు ఆటంకం కలిగించే బాహ్య, అంతర కారణాలన్నీ తొలగి, నా మనస్సు నీ సన్నిధిలో ప్రశాంతంగా నిలిచేలా అనుగ్రహించు” అనే భావంతో కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు.

🌸 బయట ఉన్న ఆటంకాల కంటే లోపలివే ఎక్కువ

పూజకు ఆటంకం చాలాసార్లు బయట ఉండదు. అది మన మనస్సులోనే ఉంటుంది.

నిన్న జరిగిన విషయం, రేపటి ఆలోచన, ఎవరో చెప్పిన మాట, ఇంటి సమస్య, కోపం, ఆందోళన - ఇవన్నీ మనస్సును పూజ నుంచి దూరం చేయవచ్చు.

అందుకే భూతోచ్చాటనం చేసేటప్పుడు ఒక్క క్షణం ఇలా స్మరించుకోవచ్చు:

“అమ్మా! నా పూజకు ఆటంకం కలిగించే బాహ్య, అంతర కారణాలన్నీ తొలగి, నా మనస్సు నీ సన్నిధిలో నిలిచేలా అనుగ్రహించు.”

🪷 భక్తితో చేసే అంతర సాధన

ఈ క్రియను భక్తి, పవిత్రత, ఏకాగ్రత అనే భావాలతో అర్థం చేసుకోవచ్చు.

“పూజకు ముందు నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నా లోపల ఉన్న ఆలోచనలను కూడా ప్రశాంతంగా చేసుకుని అమ్మ సన్నిధిలోకి ప్రవేశిస్తున్నాను.”

అనే భావంతో చేస్తే, బాహ్య క్రియ క్రమంగా అంతర సాధనగా మారుతుంది.

🌺 పూజగదిని దాటి...

మన జీవితంలోకి వచ్చే ప్రతి ఆలోచనను వెంటనే అనుసరించకుండా,

“ఈ ఆలోచన నాకు అవసరమా? ఇది నా మనశ్శాంతికి ఉపయోగపడుతుందా?”

అని ఒక్కసారి గమనించుకోవడం కూడా ఒక విధమైన అంతర శుద్ధే.

అనవసరమైన ఆలోచనలను విడిచిపెట్టి, అమ్మ స్మరణలో నిలవడం — భూతోచ్చాటనం మనకు నేర్పే అందమైన పాఠం.

“బయటి వాతావరణం పవిత్రం కావాలి;
నా అంతరంగం కూడా పవిత్రం కావాలి.”

ఈ భావం మనస్సులో ఒక్క క్షణం మెదిలితే చాలు.

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (ఆసనశుద్ధి - కూర్చునే స్థలం నుంచి మనస్సుకు స్థిరాసనం వరకు)

పూజ - అంతరార్థాల ప్రయాణం (మార్జనం - జలస్పర్శ నుంచి మనస్సు పరిశుద్ధత వైపు)

💧మార్జనం - శరీర శుద్ధి నుంచి మనస్సు శుద్ధి వరకు

నిత్యపూజలో మార్జనం అనేది పూజకు ముందు మనల్ని మనం పవిత్రంగా సిద్ధం చేసుకునే ఒక ముఖ్యమైన క్రియ.

మార్జనం అంటే పవిత్ర జలాన్ని మంత్రంతో శరీరంపై ప్రోక్షించుకోవడం. ఇది కేవలం నీటిని చల్లుకోవడం మాత్రమే కాదు.
“నేను ఇప్పుడు అమ్మ సన్నిధిలోకి ప్రవేశిస్తున్నాను. నా శరీరం, వాక్కు, మనస్సు పవిత్రంగా ఉండాలి.” అనే అంతరభావంతో చేసే శుద్ధి ప్రక్రియ.

🌿 పూజకు ముందు శుద్ధి మంత్రం

మార్జనానికి ముందు లేదా పూజా శుద్ధి సమయంలో ఈ శ్లోకాన్ని స్మరించుకోవచ్చు:

అపవిత్రః పవిత్రో వా
సర్వావస్థాం గతోऽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం
స బాహ్యాభ్యంతరః శుచిః ॥

అర్థం:
అపవిత్రుడైనా, పవిత్రుడైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా, పుండరీకాక్షుడైన భగవంతుణ్ణి స్మరించినవాడు బాహ్యంగాను, అంతరంగంగాను పవిత్రుడవుతాడు.

అంతరార్థం:
పూజకు ముందు “నేను పూర్తిగా పవిత్రుడినై తర్వాతే అమ్మను చేరాలి” అనే భావం కంటే, దైవస్మరణ ద్వారానే మన అంతరంగం పవిత్రత వైపు మళ్ళాలి.

💧 మార్జనం ఎలా చేస్తారు?

మన నిత్యపూజా పద్ధతిలో ఉన్న మార్జన మంత్రాన్నే ఉపయోగించుకోవచ్చు. మంత్రాన్ని ఉచ్చరిస్తూ కొద్దిగా నీటిని తీసుకుని తలపై ప్రోక్షించుకుంటారు.

మంత్రం పలుకుతున్నప్పుడు దాని శబ్దంతో పాటు దాని భావాన్ని కూడా మనస్సులో ఉంచుకోవాలి.

💧 మార్జన మంత్రం

మార్జనం సమయంలో సంప్రదాయంగా ఉపయోగించే వేదమంత్రాలలో ఒకటి:

ఓం ఆపో హిష్ఠా మయో భువః ।
తా న ఊర్జే దధాతన ।
మహే రణాయ చక్షసే ।
యో వః శివతమో రసః ।
తస్య భాజయతే హ నః ।
ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగ మామ వః ।
యస్య క్షయాయ జిన్వథ ।
ఆపో జనయథా చ నః ॥

భావార్థం:
ఓ పవిత్ర జలదేవతలారా! మీరు ఆనందాన్ని, జీవశక్తిని ప్రసాదించేవారు. మాకు బలం, శుభదృష్టి, మంగళాన్ని ప్రసాదించండి. తల్లులు తమ పిల్లలను ప్రేమగా పోషించినట్లుగా మమ్మల్ని పోషించండి. మా లోని అశుద్ధతలు తొలగి, మమ్మల్ని పవిత్రమైన జీవనానికి నడిపించండి.

ఈ మంత్రంతో నీటిని ప్రోక్షించుకుంటున్నప్పుడు, బయటి శరీర శుద్ధితో పాటు మనస్సులోని మలినాలు కూడా తొలగిపోవాలి అనే భావాన్ని ఉంచుకోవచ్చు.

🌿 మార్జనం యొక్క అంతరార్థం

నీరు బయట మలినాన్ని తొలగిస్తుంది. అలాగే అమ్మ స్మరణ మనలోని మానసిక మలినాలను తొలగించాలి అనే భావంతో మార్జనం చేయవచ్చు.

కోపం, అసూయ, తొందర, ఆందోళన, అహంకారం వంటి భావాలు మనస్సులో పేరుకుపోతుంటాయి.

అందుకే మార్జనం చేసేటప్పుడు ఇలా స్మరించుకోవచ్చు:

“అమ్మా! ఈ పవిత్ర జలంతో నా శరీరం శుద్ధి అవుతున్నట్లే, నీ కృప అనే అమృతధారతో నా మనస్సు కూడా శుద్ధి కావాలి. నా పూజకు అడ్డుగా నిలిచే అంతర మలినాలను తొలగించు.”

🌸 నీరు కొద్దిగా — భావం విశాలంగా

మార్జనంలో నీరు కొన్ని చుక్కలే ఉంటాయి. కానీ దాని వెనుక ఉన్న భావం విశాలమైనది.

నీరు - శుద్ధిని గుర్తు చేస్తుంది.
దీపం - జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది.
పుష్పం - భక్తిని గుర్తు చేస్తుంది.

ఇలా బాహ్య పూజ క్రమంగా భావపూజగా మారుతుంది.  

🌺 పూజగదిని దాటి...

మార్జనం పూర్తయిన తరువాత మనస్సును ప్రశాంతంగా చేసుకుని, ఇక చేయబోయే పూజను అమ్మకు సమర్పణగా భావించవచ్చు.

పూజలో ముఖ్యమైనది మనం ఎంత నీటిని ప్రోక్షించుకున్నాం అన్నది కాదు. మనలో ఎంత శుద్ధి భావం మేల్కొంది అన్నదే ముఖ్యం.

అందుకే మార్జనం చేసేటప్పుడు ఒక్క క్షణం ఇలా స్మరించుకోవచ్చు:

“అమ్మా! నా మాటలోనూ, చేతలోనూ, ఆలోచనలోనూ మాలిన్యం లేకుండా, నిన్ను మరచిపోకుండా ఉండేలా అనుగ్రహించు.”

బయటి శుద్ధి పూజకు సిద్ధం చేస్తుంది;
లోపలి శుద్ధి అమ్మ సన్నిధికి మనసును సిద్ధం చేస్తుంది.
 

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (భూతోచ్ఛాటనం - బయట ఉన్న అశాంతి నుంచి అంతరంగ ప్రశాంతత వైపు)

24, సెప్టెంబర్ 2026, గురువారం

పూజ - అంతరార్థాల ప్రయాణం (ఆచమనం - శరీరశుద్ధి నుంచి అంతరంగ శుద్ధి వైపు)

ఆచమనం - పూజకు ముందు అంతరంగాన్ని సిద్ధం చేసుకోవడం

పూజ ప్రారంభంలో మనం చేసే మొదటి క్రియల్లో ఆచమనం ఒకటి.

ఆచమనం అంటే ఏమిటి?
పూజకు ముందు కొద్దిగా నీటిని మంత్రపూర్వకంగా స్వీకరించడం.

కానీ అంతటితో ఆచమనం యొక్క భావం పూర్తవుతుందా?

🌿 ఆచమనం ఎందుకు?

సాధారణంగా ఆచమనం శుద్ధి కోసం చేస్తామని చెబుతాం. అది నిజమే.

అయితే దాన్ని కేవలం శరీర శుద్ధిగా మాత్రమే కాకుండా, పూజకు ముందు మనల్ని మనం అంతర్ముఖంగా సిద్ధం చేసుకునే ఒక సంస్కారంగా కూడా భావించవచ్చు.

చేతిలో నీటిని తీసుకున్నప్పుడు మనకు మనమే ఒక చిన్న ప్రశ్న వేసుకోవచ్చు:

“ఇప్పుడు నేను అమ్మ సన్నిధిలోకి ప్రవేశిస్తున్నాను. నా శరీరం, నా మాట, నా మనస్సు — ఇవి పూజకు సిద్ధంగా ఉన్నాయా?”

నీరు శుద్ధికి ఒక అందమైన ప్రతీక.

ఆ నీటిని ఆచమనంగా స్వీకరిస్తూ మనసులో ఇలా ప్రార్థించవచ్చు:

“అమ్మా!
నా శరీరం నీ సేవకు సిద్ధంగా ఉండాలి.
నా వాక్కు పవిత్రంగా ఉండాలి.
నా మనస్సు ప్రశాంతంగా ఉండాలి.
నీ సన్నిధిలో ఏకాగ్రతతో నిలిచే అనుగ్రహం ప్రసాదించు.”

ఇలా భావించినప్పుడు ఆచమనం కేవలం ఒక ఆచారంగా కాకుండా, మనస్సును పూజ వైపు మళ్లించే మొదటి అడుగుగా మారుతుంది.

🌸 మూడు సార్లు ఆచమనం — ఒక అంతర భావం

సంప్రదాయానుసారం ఆచమన విధానాల్లో తేడాలు ఉండవచ్చు. మనం ఇక్కడ ఒక సులభమైన అంతర భావాన్ని మననం చేసుకోవచ్చు.

మొదటి సారి -
“నా శరీరం అమ్మ సేవకు సిద్ధం కావాలి.” (కాయ శుద్ధి)

రెండవసారి -
“నా మాటలు అమ్మకు తగినవిగా ఉండాలి.” (వాక్ శుద్ధి)

మూడవసారి -
“నా మనస్సు అమ్మ స్మరణలో నిలవాలి.” (మనః శుద్ధి)

అంటే శరీరం — వాక్కు — మనస్సు మూడింటినీ అమ్మవారి పూజకు అర్పించే భావం.

🌺 పూజగదిని దాటి...

ఈ పవిత్ర భావం పూజ సమయంకే పరిమితం కాకూడదు. 

మన రోజువారీ జీవితంలో కూడా మన మాటలు కొన్నిసార్లు కఠినంగా మారవచ్చు. మనస్సులో కోపం, ఆందోళన, అసహనం రావచ్చు.

అటువంటి సమయంలో ఒక క్షణం ఆగి:

“అమ్మా, నా మాటను శుద్ధి చేయి.
నా మనస్సును శాంతింపజేయి.”

అని గుర్తుచేసుకోవడం కూడా మన అంతరంగానికి ఒక చిన్న ఆచమనమే కదా!

అప్పుడు ఆచమనం పూజకు ముందు చేసే ఒక చిన్న క్రియగా మాత్రమే కాకుండా, మన జీవితంలోనూ శుద్ధి, జాగరూకతకు గుర్తుగా నిలుస్తుంది.

🌼 ఈరోజు చిన్న సాధన

ఈరోజు పూజలో ఆచమనం చేసేటప్పుడు తొందరపడకుండా, ప్రతి సారి ఒక్క క్షణం ఆగండి.

నీటిని స్వీకరిస్తూ అమ్మను గుర్తు చేసుకోండి.

శరీరం — నీ సేవకు.
వాక్కు — నీ స్మరణకు.
మనస్సు — నీ సన్నిధికి.

అంతే...చాలు!

ఆచమనం చేసే విధానం మారకపోవచ్చు.
కానీ ఆచమనం చేసే మనసు మాత్రం కొంచెం మారవచ్చు.

అదే అర్థంతో చేసే పూజ యొక్క అందం.

శ్రీమాతా శరణం 🙏 

శ్రీరామ జయం🙏 

జై హనుమాన్🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (మార్జనం - జలస్పర్శ నుంచి మనస్సు పరిశుద్ధత వైపు)

పూజ - అంతరార్థాల ప్రయాణం (దీపారాధన - బయట వెలిగే దీపం, లోపల వెలిగే జ్ఞానజ్యోతి)

🪔 దీపారాధన - వెలుగును ఆహ్వానించే మొదటి అడుగు

నిత్యపూజ ప్రారంభంలో చేసే పవిత్రమైన క్రియలలో దీపారాధన ఒకటి.

దీపాన్ని వెలిగించడం అంటే కేవలం పూజామందిరంలో వెలుగు కలిగించడం మాత్రమే కాదు. బయట వెలిగే దీపంతో పాటు, మన అంతరంగంలో కూడా జ్ఞానజ్యోతి వెలగాలి అనే ఉన్నతమైన భావన దీని వెనుక ఉంది.

🪔 దీపాన్ని వెలిగించేటప్పుడు

దీపాన్ని శుభ్రంగా సిద్ధం చేసి, మన కుటుంబ సంప్రదాయం లేదా ఆచారానికి అనుగుణంగా నెయ్యి లేదా నూనెతో వెలిగించవచ్చు. దీపాన్ని పూజాస్థలంలో స్థిరంగా, సురక్షితంగా ఉంచాలి.

దీపం వెలిగించే ముందు ఒక క్షణం మనస్సును ప్రశాంతంగా చేసుకుని అమ్మవార్ని స్మరిస్తూ ఇలా భావించవచ్చు:

"అమ్మా! ఈ దీపజ్యోతిలా నా హృదయంలో కూడా జ్ఞానజ్యోతి వెలిగించు. అజ్ఞానం, అశాంతి, అహంకారం తొలగించి, నీ స్మరణలో నన్ను నిలుపు."

🌸 దీపంలోని అంతరార్థం

చిన్న దీపజ్యోతి కూడా చీకటిని తొలగిస్తుంది. అలాగే మనలో భక్తి ఎంత చిన్నదిగా ప్రారంభమైనా, దానిని ప్రతిరోజూ ప్రేమతో భావంతో వెలిగిస్తూ ఉంటే, అది మన జీవితాన్ని క్రమంగా ప్రకాశింపజేయగలదు.

దీపాన్ని చూస్తూ ఒక్క క్షణం ఇలా స్మరించుకోవచ్చు:

"అమ్మా! ఈ వెలుగు నా ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో కూడా వెలగాలి."

మన సంప్రదాయంలో ఉన్న దీపారాధన మంత్రాన్ని భక్తితో పఠించవచ్చు. మంత్రం తెలియని వారు కూడా భక్తితో అమ్మను స్మరించి దీపాన్ని వెలిగించవచ్చు. మంత్రంతో పాటు భావం కూడా ఉండాలి అన్నదే ముఖ్యమైన విషయం.

దీపం — ఒక అంతర సాధన

పూజలో చేసే ప్రతి బాహ్య క్రియకూ ఒక అంతర భావాన్ని జోడించవచ్చు.

దీపం — జ్ఞానానికి గుర్తు.

నీరు — శుద్ధికి గుర్తు.

పుష్పం — భక్తికి గుర్తు.

ధూపం — మనస్సు పరిమళానికి గుర్తు.

అయితే ఈ భావాలను ప్రతిరోజూ విశదంగా ఆలోచిస్తూ పూజ చేయాల్సిన అవసరం లేదు. భావం ఒకసారి అర్థమైతే, ఆయా ఉపచారం వచ్చినప్పుడు దానికి సంబంధించిన చిన్న వాక్యాన్ని ఒక్క క్షణం స్మరించుకుంటే చాలు. పూజను తొందరపాటు కార్యక్రమంగా మార్చకూడదు; అలాగే పూజ పేరుతో మనల్ని మనమే భారంగా చేసుకోకూడదు.

దీపం బయట వెలుగునిస్తుంది.

భక్తి లోపల వెలుగునిస్తుంది.

కాబట్టి మనం వెలిగించే ప్రతి దీపం, మన హృదయంలో అమ్మపై వెలిగే భక్తి దీపాన్ని గుర్తు చేస్తూ ఉండాలి.

దీపం వెలిగించడం ఒక ఆచారం;

ఆ వెలుగులో మనల్ని మనం మార్చుకోవడం ఒక సాధన.

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (ఆచమనం - శరీరశుద్ధి నుంచి అంతరంగ శుద్ధి వైపు)

23, సెప్టెంబర్ 2026, బుధవారం

పూజ - అంతరార్థాల ప్రయాణం - పూర్వాంగం

పూజా విధానం - బాహ్యక్రియ నుంచి అంతరభావం వరకు

మనలో చాలామందికి పూజ అంటే దేవతామూర్తికి ఒక్కొక్క పూజా క్రియను శ్రద్ధగా చేయడం - దీపారాధన, ఆచమనం, మార్జనం ... ఇలా పూజా క్రమాన్ని అనుసరించడం. తరువాత దేవతకు ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం... ఇలా షోడశోపచారాలను సమర్పించడం.

ఇవన్నీ పూజలో ముఖ్యమైన భాగాలే. అయితే, ప్రతి పూజా క్రియ వెనుక ఉన్న అర్థాన్ని, భావాన్ని కూడా తెలుసుకుని చేస్తే, అదే పూజ మన అంతరంగాన్ని మెల్లగా మార్చే సాధనగా మారుతుంది.

దీపారాధన - బయట వెలిగే దీపం, లోపల వెలిగే జ్ఞానజ్యోతి 

ఆచమనం - శరీరశుద్ధి నుంచి అంతరంగ శుద్ధి వైపు 

మార్జనం - జలస్పర్శ నుంచి మనస్సు పరిశుద్ధత వైపు

ఆచమనం - పూజకు మనల్ని మనం బాహ్యంగా, అంతరంగా సిద్ధం చేసుకోవడం.

సంకల్పం - మనసుకు పవిత్రమైన దిశను ఇవ్వడం.

ఆవాహనం - అమ్మను ఎక్కడి నుంచో పిలవడం మాత్రమే కాదు; చంచలమైన మనస్సును అమ్మవైపు తిప్పడం.

ఆసనం సమర్పించడం - అమ్మకు ఒక పీఠం వేయడమే కాదు; మన హృదయంలో ఆమెకు స్థిరమైన స్థానం ఇవ్వడం.

ఇలాగే పూజలోని ప్రతి క్రియ వెనుక ఒక అందమైన అంతరార్థాన్ని మనం దర్శించవచ్చు.

ఈ సిరీస్‌లో ప్రతి పూజా క్రియను మూడు ప్రశ్నలతో మననం చేసుకుందాం:

బయట మనం ఏమి చేస్తున్నాం? (బాహ్యక్రియ)

లోపల మనం ఏమి సమర్పించుకుంటున్నాం? (అంతరభావం)

ఆ భావాన్ని మన జీవితంలో ఎలా ఆచరించగలం (జీవనవిధానం)

అయితే, ఈ అంతరార్థాలను ప్రతిరోజూ ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ పూజ చేయాల్సిన అవసరం లేదు.

భావం ఒకసారి అర్థమైతే చాలు; పూజలో ఆ క్రియ వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆ భావాన్ని స్మరించుకుంటే సరిపోతుంది.

పూజను తొందరపాటు కార్యక్రమంగా మార్చకూడదు. అలాగే పూజ పేరుతో మనల్ని మనమే భారంగా చేసుకోకూడదు. మనల్ని మనమే ఒత్తిడికి గురిచేసుకోకూడదు.

సహజంగా, శ్రద్ధగా, అమ్మపై ప్రేమతో చేసే పూజే మనకు ఆనందాన్ని ఇస్తుంది.

మంత్రం, విధానం శాస్త్రానుసారంగా ఉండాలి. అదే సమయంలో ఆ పూజా క్రియ చేసే వేళ మనలో కలిగే భావం, మననం, సమర్పణ మన సాధనకు జీవం పోస్తాయి.

అందుకే ఇది త్వరగా పూర్తి చేయాల్సిన పాఠాల సమాహారం కాదు. ఒక్కో పూజా క్రియను నెమ్మదిగా అర్థం చేసుకుంటూ, దాని భావాన్ని జీవితంలోకి తీసుకువెళ్లే ఒక అందమైన ప్రయాణం.

అప్పుడు పూజ పూజగదికే పరిమితం కాదు.

మన మాటల్లో మృదుత్వం, పనుల్లో శ్రద్ధ, ఇతరుల పట్ల సహనం, మనసులో శాంతి — ఇలా పూజా భావం మన రోజువారీ జీవితంలోనూ వికసించవచ్చు.

🌱 బాహ్య పూజ విత్తనం.

🌺 అంతర పూజ దాని పుష్పం.

✨ పూజా భావం మన జీవనంలో వికసించడమే దాని సౌందర్యం

శ్రీమాతా శరణం 🙏

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

తదుపరి టపా : పూజ - అంతరార్థాల ప్రయాణం (దీపారాధన - బయట వెలిగే దీపం, లోపల వెలిగే జ్ఞానజ్యోతి)

పూజ - అంతరార్థాల ప్రయాణం - ఆరాధన


పూజ అంటే ఏమిటి? దైవ ఆరాధన ఎందుకు?

పూజ అంటే దేవుడి కోసం ఏదో ఒకటి చేయడం మాత్రమే కాదు.
మన మనసును దైవం వైపు తిప్పుకోవడం పూజ.

దైవం ఎక్కడో దూరంగా ఉందని కాదు. మనలోనూ, మన చుట్టూనూ అదే దైవ చైతన్యం ఉంది. కానీ మన మనసు రోజువారీ పనులు, ఆలోచనలు, కోరికలు, బాధలు, ఆందోళనలతో ఎప్పుడూ బయటకు పరుగెడుతుంటుంది.

ఆ మనసును కొంతసేపు ఆపి,

“నేను నీ సన్నిధిలో ఉన్నాను”

అని గుర్తుచేసుకోవడమే దైవ ఆరాధన.

అందుకే పూజలో మనం ముందుగా దైవాన్ని ఆహ్వానిస్తాం. ఆసనం ఇస్తాం. పాద్యం సమర్పిస్తాం. స్నానం చేయిస్తాం. వస్త్రం అలంకరిస్తాం. గంధం, పుష్పం, దీపం, నైవేద్యం సమర్పిస్తాం.

ఇవి బయట కనిపించే ఉపచారాలు.

కానీ ప్రతి ఉపచారం వెనుక ఒక అంతరంగ భావం కూడా ఉంటుంది.

ఉదాహరణకు, “రత్నసింహాసనం సమర్పయామి” అని చెప్పేటప్పుడు కేవలం అక్షతలు సమర్పించడం మాత్రమే కాదు—

“అమ్మా! నా హృదయమే నీ సింహాసనం. అందులో నీవు కొలువై ఉండాలి.”

అనే భావం కలిగితే, ఆ ఉపచారం కేవలం ఒక బాహ్య క్రియగా ఉండదు; అది అంతరంగ సమర్పణగా మారుతుంది.

అలా చూస్తే పూజ అనేది కేవలం కొన్ని క్రతువులు చేయడం కాదు.

భక్తితో మనసును శుద్ధి చేసుకునే ఒక సాధన.

పూజలో మనం దైవాన్ని మన కోరికలకు, మన అభిప్రాయాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం కాదు; దైవసన్నిధిలో మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని, మనల్ని మనమే మార్చుకోవడానికి దైవాన్ని ఆశ్రయిస్తున్నాం.

మనలోని అహంకారం కొద్దిగా తగ్గాలి.
కోపం కొద్దిగా తగ్గాలి.
మనసు ప్రశాంతంగా మారాలి.
ప్రతి పనిలోనూ దైవాన్ని గుర్తుచేసుకునే భావం పెరగాలి.

అప్పుడు పూజ క్రమంగా పూజా గదిలో మాత్రమే ఉండదు.

మన మాటలో, మన పనిలో, మన ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది.

వంట చేయడం, ఇంటి పనులు చేయడం, ఇతరులతో మాట్లాడడం, ఎవరి బాధనైనా ఓపికగా వినడం—ఇవన్నీ కూడా దైవార్పణ భావంతో చేయగలిగితే, జీవితం మొత్తం పూజగా మారుతుంది.

అందుకే షోడశోపచార పూజలోని పదహారు ఉపచారాలను కేవలం బయట చేసే కార్యక్రమాలుగా కాకుండా, భక్తి, భావం, సమర్పణకు పదహారు మెట్లుగా చూడవచ్చు.

🌱 భక్తి వేర్లు అయితే,

🌺 భావం పుష్పం;

✨ సమర్పణ దాని పరిమళం.

ఈ భావంతో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పూజా విధానాన్ని, అలాగే షోడశోపచార పూజలోని ప్రతి ఉపచారం వెనుక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం.

శ్రీమాతా శరణం 🙏 

శ్రీరామ జయం 🙏

జై హనుమాన్ 🙏

18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నామ వైభవం

ప్రతి నామం వెనుక ఉన్న ధార్మిక తాత్త్విక మరియు ఆధ్యాత్మిక అంతరార్థాలు : 

సనాతన ధర్మంలో ఒకే దైవస్వరూపానికి అనేక స్థాయిల్లో అర్థాలు ఉంటాయి.

చిన్నపిల్లవాడు వింటే, అది ఒక అద్భుతమైన కథ.
భక్తుడు వింటే, అది దైవమహిమ.
యోగి చూస్తే, అది అంతర్గత శక్తుల రహస్యం.
తత్వవేత్త పరిశీలిస్తే, అది కాలం, సృష్టి, బ్రహ్మజ్ఞానం వంటి గంభీరమైన తత్త్వాలకు సంకేతం.

“యద్ పిండే తద్ బ్రహ్మాండే” — ఈ పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది; బ్రహ్మాండంలో ఉన్నదే ఈ పిండంలో ఉంది — అనే భావనకు శ్రీ కుమారస్వామి తత్త్వం ఒక అందమైన ఉదాహరణగా కనిపిస్తుంది.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి నామాలను పరిశీలిస్తే, ఒక్కొక్క పేరు వెనుక ఒక పురాణగాథ మాత్రమే కాకుండా, సాధకుని అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించిన ఒక సూచన కూడా కనిపిస్తుంది.


1. "శరవణభవ" షడక్షరీ నామం - అంతర్ముఖ ప్రయాణం

“శరవణభవ” — శ, ర, వ, ణ, భ, వ — ఆరు అక్షరాలతో కూడిన షడక్షరీ నామం.

కౌమార, శైవ, తాంత్రిక సంప్రదాయాల్లో ఈ ఆరు అక్షరాలకు వివిధ అంతరార్థ అన్వయాలు కనిపిస్తాయి. ఆ దృష్టిలో ఒక్కొక్క అక్షరం సాధకుని అంతర్ముఖ వికాసానికి ఒక సంకేతంగా భావించవచ్చు.

  • శ — శాంతి, శుభం, శివతత్త్వం, జ్ఞానప్రకాశం.
    సాధకుని మనస్సు శాంతంగా, నిర్మలంగా మారాలని సూచిస్తుంది.

  • ర — రవి, తేజస్సు, అగ్ని, తపస్సు.
    సాధనలో ఉత్సాహం, క్రమశిక్షణ, తపన అవసరమని గుర్తుచేస్తుంది.

  • వ — వాయువు, ప్రాణశక్తి.
    జీవశక్తి సమతుల్యత, నియంత్రిత జీవనం, ముఖ్యం అని సూచిస్తుంది.

  • ణ — స్థిరత్వం, అంతర్ముఖత, హృదయగుహ.
    చంచలమైన మనస్సు క్రమంగా లోపలికి తిరగాలని సూచిస్తుంది.

  • భ — భాస్వరత్వం, జ్ఞానం, దివ్యప్రకాశం.
    సాధకునిలో వివేకం వికసించడాన్ని సూచిస్తుంది.

  • వ — వర్ధనం, వికాసం, పరిపూర్ణత.
    పొందిన జ్ఞానం కేవలం ఆలోచనగా కాకుండా జీవితంలో వికసించాలనే బోధను ఇస్తుంది.

అంటే, "శరవణభవ" అనే షడక్షరీ మంత్రం ఒక సాధకుని సంపూర్ణ అంతర్ముఖ ప్రయాణాన్ని సూచిస్తుంది.

సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రం "శరవణభవ" లో ఆరు అక్షరాలు ఉన్నాయి. సాధకుడు ఈ మంత్రాన్ని జపించినప్పుడు, శరీరంలోని ఆరు చక్రాలు వరుసగా స్పందించి, మేల్కొంటాయని (జాగృతమవుతాయని) మంత్ర శాస్త్రం చెబుతోంది.

జీవితం మనలను బయటకు లాగుతుంది.

"శరవణభవ" మంత్రం ...

మనలను లోపలికి తీసుకువెళ్తుంది.

ఈ విధంగా చూస్తే, “శరవణభవ” అనే నామం ఒక సాధకుని శాంతి నుండి తేజస్సుకు, ప్రాణశక్తి నుండి అంతర్ముఖతకు, జ్ఞానం నుండి జీవిత వికాసానికి జరిగే అంతర్గత ప్రయాణానికి ఒక సంకేతంగా అనిపిస్తుంది.



2. "శరవణభవ" - శరవణంలో జన్మించినవాడు

“శరవణభవ” అనే పేరుకు మరో ప్రత్యక్షమైన అర్థం కూడా ఉంది.

శర = రెల్లుగడ్డి
వణ = వనం
భవ = జన్మించినవాడు

అంటే శరవణంలో జన్మించినవాడు.

పురాణ సంప్రదాయం ప్రకారం శివతేజస్సు శరవణంలో అవతరించింది. ఈ కథను ఒక అంతర్ముఖ ప్రతీకగా కూడా చూడవచ్చు.

రెల్లుగడ్డి లోపల ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీతనం మనకు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని గుర్తుచేస్తుంది.

అహంకారంతో నిండిన హృదయంలో దైవానికి స్థానం ఎక్కడ?

అదే హృదయం అహంకారాన్ని విడిచి, వినయంతో, నిర్మలత్వంతో ఖాళీ అయినప్పుడు — అక్కడే దైవజ్ఞానం వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది.

రెల్లుగడ్డి గాలికి ఎదురు నిలవదు; వంగుతుంది. కానీ సులభంగా విరగదు.

వినయం బలహీనత కాదు. సత్యం ముందు వంగగలిగే బలమే వినయం.

ఈ దృష్టిలో “శరవణభవ” మనకు చెప్పే అంతరార్థం:

దైవజ్ఞానం ఆడంబరంలో కాదు; నిర్మలమైన, వినయపూర్వకమైన హృదయంలో వికసిస్తుంది.


3. షణ్ముఖుడు - ఆరుముఖాల ఆధ్యాత్మిక నైతిక రహస్యం

సుబ్రహ్మణ్యస్వామిని "షణ్ముఖుడు" లేదా "షడాననుడు" అంటారు. 

ఆరుముఖాలు కలిగినవాడు ఈ ఆరుముఖాలను వివిధ సంప్రదాయాలు వివిధ రీతుల్లో అన్వయిస్తాయి.

ఒక అంతర్ముఖ వ్యాఖ్యానంలో అవి మనలోని అరిషడ్వర్గాలను - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను - జయించే దైవజ్ఞానశక్తికి ప్రతీకలుగా చూడవచ్చు.

మరో తాత్త్విక అన్వయంలో ఆరు ముఖాలను దైవసంపదలైన జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వం వంటి గుణాలకు సంకేతాలుగా భావిస్తారు.

అందువల్ల షణ్ముఖుడి ఆరు ముఖాలు కేవలం ఒక రూపవిశేషం కాకుండా, మనిషిలోని ఆరు దిశల్లో దైవచైతన్యం మేల్కొనడాన్ని సూచించే ప్రతీకగా కూడా దర్శించవచ్చు.


4. షణ్ముఖతత్త్వం - షట్చక్రాల అంతర్ముఖ ప్రయాణం

యోగ-తాంత్రిక సంప్రదాయాల్లో సుబ్రహ్మణ్య తత్త్వాన్ని శరీరంలోని శక్తి కేంద్రాల ప్రయాణంతో అనుసంధానించే ఒక అందమైన అంతర్ముఖ వ్యాఖ్యానం కనిపిస్తుంది.

ఆరు ముఖాలను షట్చక్రాలకు అన్వయించి చూస్తే, సాధకుని ప్రయాణం ఇలా అర్థమవుతుంది.

మూలాధారం - స్థిరత్వం

ఇక్కడ భయం, అస్థిరత్వం వంటి ప్రాథమిక స్పందనలను అధిగమించే శక్తి అవసరం.

సర్పరూప సుబ్రహ్మణ్యుని ఆరాధనను ఈ స్థాయిలో కుండలినీ శక్తి, అంతర్గత రక్షణ, భయాన్ని అధిగమించే విశ్వాసం వంటి భావాలతో అనుసంధానించి చూడవచ్చు.

స్వాధిష్ఠానం - కోరికలు

మన కోరికలు, భావోద్వేగాలు ఇక్కడ ప్రతీకాత్మకంగా దర్శించబడతాయి.

వాటిని బలవంతంగా అణచడం కాదు; వాటిని గమనించి, వాటిపై వివేకాన్ని పెంపొందించుకోవడం సాధనలో ముఖ్యమైన దశ.

మణిపూరకం - అహంకార శక్తి

నాభి ప్రాంతానికి సంబంధించిన ఈ కేంద్రాన్ని అగ్నితత్త్వంతో అనుసంధానిస్తారు.

స్వామివారి వేల్ యొక్క తీక్షణతను ఇక్కడ అహంకారాన్ని ఛేదించే వివేకశక్తికి ప్రతీకగా చూడవచ్చు.

అనాహతం - ప్రేమ, కరుణ

హృదయస్థానంలో భక్తి, ప్రేమ, కరుణ వికసిస్తాయి.

“నాకేమి లభిస్తుంది?” అనే స్వార్థ భావం తగ్గి,
“నేనేమి ఇవ్వగలను?” అనే కరుణాభావం పెరగడం అంతర్ముఖ వికాసానికి ఒక సూచన.

విశుద్ధి - వాక్శుద్ధి

కంఠస్థానానికి అన్వయించే ఈ దశలో మాటకు పవిత్రత వస్తుంది.

మాట నిజం కావాలి, హితం కావాలి, అవసరమైనప్పుడే మాట్లాడాలి — అనే నియమం సాధకుని జీవితంలో ముఖ్యమవుతుంది.

ఆజ్ఞా చక్రం - వివేకదృష్టి

కనుబొమ్మల మధ్యనున్న ఆజ్ఞా కేంద్రం వివేకదృష్టికి ప్రతీకగా భావించబడుతుంది.

శివుని మూడవ నేత్రం నుండి ఉద్భవించిన కుమారస్వామిని ఇక్కడ జ్ఞానదృష్టిగా అన్వయించవచ్చు.

మనస్సులో ఏమి జరుగుతుందో దానిలో కొట్టుకుపోకుండా గమనించే సాక్షీభావం ఇక్కడ ముఖ్యమవుతుంది.

ఈ విధంగా చూస్తే, మూలాధారం నుండి ఆజ్ఞ వరకు జరిగే అంతర్ముఖ ప్రయాణం భయం నుండి విశ్వాసానికి, కోరిక నుండి వివేకానికి, అహంకారం నుండి కరుణకు, చంచలత నుండి సాక్షీభావానికి జరిగే పరివర్తనగా అర్థమవుతుంది.

ఆపై సహస్రారాన్ని పరమచైతన్యంతో అనుసంధానించే యోగదృష్టిలో, ఈ ప్రయాణం పరమాత్మ తత్త్వంలో లీనమయ్యే దిశగా సాగుతుంది.


5. వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు - శక్తుల సమన్వయం

యోగపరమైన కొన్ని అంతర్ముఖ అన్వయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పరివారాన్ని నాడీశక్తులతో కూడా అనుసంధానించి వివరిస్తారు.

ఈ వ్యాఖ్యానంలో:

  • ఇడా నాడి — చంద్రశక్తి, శాంతి, సౌమ్యతకు ప్రతీకగా
  • పింగళ నాడి — సూర్యశక్తి, చైతన్యం, క్రియాశక్తికి ప్రతీకగా
  • సుషుమ్నా నాడి — మధ్యమార్గం, అంతర్ముఖ జ్ఞానప్రవాహానికి ప్రతీకగా

చూడబడతాయి.

కొన్ని యోగతాంత్రిక వ్యాఖ్యానాల్లో వల్లీ, దేవసేనలను ఇచ్ఛా-క్రియా శక్తులతో, సుబ్రహ్మణ్య స్వామిని వాటి సమన్వయంతో వ్యక్తమయ్యే జ్ఞానతత్త్వంతో అనుసంధానిస్తారు.

ఈ ఇడా పింగళ నాడుల సమతుల్యతతో సుషుమ్ననాడి ద్వారా శక్తి పైకి లేవడమే సుబ్రహ్మణ్యతత్వం. ఇందుకే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యరూపం యోగసాధనలో అంత ప్రాధాన్యత సంతరించుకుంది.


6. కుమారస్వామి - కాలతత్త్వానికి సంకేతం

'కాలాగ్ని' అని పిలువబడే అఖండ రుద్రమూర్తి (పరమశివుడు) యొక్క తేజస్సే 'సంవత్సరాగ్ని'. ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే కుమారస్వామి యొక్క పన్నెండు చేతులు, ఆరు ముఖాలు.

ఆరు ముఖాలు - ఆరు ఋతువులు
వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర.

పన్నెండు చేతులు - పన్నెండు మాసాలు.

ఈ విధంగా ఆరు ఋతువులు, పన్నెండు మాసాలతో కూడిన సంవత్సరచక్రం కుమారస్వామి రూపంలో ప్రతిబింబిస్తుందని ఈ వ్యాఖ్యానం చెబుతుంది.

కాలం నిరంతరం మారుతూనే ఉంటుంది. ఋతువులు మారుతాయి. సంవత్సరాలు గడుస్తాయి. శరీరం మారుతుంది. పరిస్థితులు మారుతాయి.

కానీ ఈ మార్పులన్నింటినీ గమనించే చైతన్యం మాత్రం సాక్షిగా ఉంటుంది.

అందువల్ల కుమారస్వామి రూపాన్ని కాలచక్రానికి మాత్రమే కాకుండా, కాలాన్ని గమనించే చైతన్యానికి కూడా ఒక ప్రతీకగా ధ్యానించవచ్చు.


7. "గుహుడు" - హృదయగుహలో నివసించేవాడు

కుమారస్వామి పేర్లలో "గుహుడు" చాలా గంభీరమైనది.

"గుహ" అంటే: గుహ్యం, రహస్యం, హృదయగర్భం

అందుకే గుహుడు అంటే హృదయగుహలో నివసించేవాడు అనే అంతరార్థాన్ని దర్శించవచ్చు.

మనకు బయట కనిపించే దేవాలయం ఒక పవిత్ర స్థలం అయితే, మన అంతరంగంలోని హృదయం కూడా ఒక దేవాలయమే.

మనస్సు నిశ్శబ్దమైనప్పుడు, అహంకారం కొంత వెనక్కి తగ్గినప్పుడు, అంతరంగంలో ఒక నిశ్శబ్దమైన చైతన్యం ఉన్నట్లు అనుభవమవుతుంది.

ఉపనిషత్తుల “హృదయగుహ” భావనతో అనుసంధానించి చూస్తే, గుహుడు మనలోనే వెలుగుతున్న దివ్యచైతన్యానికి ఒక ప్రతీకగా దర్శనమిస్తాడు.

అందుకే సుబ్రహ్మణ్య స్వామిని బయట వెతకడంతో పాటు,
“నా హృదయగుహలో నివసించే స్వామిని నేను ఎప్పుడు దర్శిస్తాను?”
అనే ప్రశ్నను మనలో మనమే వేసుకుంటూ, సాధన చేయాలి.


8.స్వామినాథుడు - గురువులకే గురువు

సుబ్రహ్మణ్య స్వామి మహిమలో అత్యంత ప్రసిద్ధమైన కథల్లో ఒకటి ప్రణవోపదేశం.

ఒకసారి బాలసుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుడిని వేదాల సారమైన “ఓం” — ప్రణవం యొక్క నిజమైన అర్థాన్ని ప్రశ్నించాడని కథనం.

బ్రహ్మదేవుని సమాధానంతో సంతృప్తి చెందని కుమారస్వామి ఆయనను బంధించాడు.

ఈ విషయం తెలిసి పరమశివుడు వచ్చి, కుమారస్వామిని ప్రణవార్థం గురించి ప్రశ్నించాడు.

అప్పుడు కుమారస్వామి, జ్ఞానాన్ని పొందాలంటే శిష్యభావంతో వినయంగా కూర్చోవాలి అని సూచించాడు.

జగద్గురువైన శివుడే శిష్యభావంతో కూర్చున్నాడు. కుమారస్వామి ఆయన చెవిలో ప్రణవతత్త్వాన్ని ఉపదేశించాడు అని పురాణగాథ చెబుతుంది.

తండ్రికే గురువుగా నిలిచినందువల్ల ఆయనకు “స్వామినాథుడు” అనే నామం ప్రసిద్ధి చెందింది.

ఈ కథ మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది:

గురుత్వం వయస్సు వల్ల రాదు; జ్ఞానం వల్ల వస్తుంది.
జ్ఞానం పొందడానికి వినయం అవసరం.


9. వేలాయుధన్ - వేల్ -  జ్ఞాన శక్తి యొక్క ప్రతీక

కుమారస్వామి చేతిలో ఉండే శక్తి ఆయుధాన్ని తమిళ సంప్రదాయంలో వేల్ అంటారు.

సుబ్రహ్మణ్య స్వామి చేతిలో కనిపించే వేల్ సాధారణ ఆయుధం కాదు.

పురాణ సంప్రదాయం ప్రకారం సూరపద్మాసుర సంహారం కోసం పార్వతీమాత స్వయంగా కుమారస్వామికి ఈ దివ్యశక్తిని ప్రసాదించింది.

అంతర్ముఖ అన్వయంలో వేల్ మూడు ముఖ్యమైన విషయాలను సూచిస్తుంది:

  • అజ్ఞానాన్ని ఛేదించే జ్ఞానం
  • భయాన్ని తొలగించే ధైర్యం
  • మాయను ఛేదించే దైవవివేకం

వేల్ యొక్క కొన ఒకే బిందువుగా ఉంటుంది.

అలాగే మనస్సు కూడా అనేక దిశల్లో పరుగెత్తకుండా, ఒక్క సత్యంపై కేంద్రీకృతమైతే జ్ఞానశక్తి పదునెక్కుతుంది.

అందుకే భక్తి సంప్రదాయంలో వేల్‌ను కేవలం యుద్ధాయుధంగా కాకుండా, అంతరంగంలోని అజ్ఞానం, భయం, అహంకారాన్ని ఛేదించే జ్ఞానశక్తికి ప్రతీకగా దర్శించవచ్చు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, మన వెన్నుపామే సుబ్రహ్మణ్య స్వామి చేతిలోని "వేల్" (శక్తి ఆయుధం). క్రింది నుండి పైకి ప్రవహించే ఆధ్యాత్మిక చైతన్యమే సుబ్రహ్మణ్య తత్వం.



10. నామం నుండి తత్త్వం వరకు సుబ్రహ్మణ్యస్వామి మనకు చెప్పేది :


శరవణభవుడు — వినయంతో నిర్మలమైన హృదయంలో దైవజ్ఞానం జన్మించాలి.

షణ్ముఖుడు — మనలోని అరిషడ్వర్గాలను జయించే వివేకశక్తి మేల్కొనాలి.

షట్చక్ర తత్త్వం — మన చైతన్యం క్రమంగా స్థూలత నుండి సూక్ష్మత వైపు ప్రయాణించాలి.

వల్లీ–దేవసేన సమేతుడు — శక్తుల సమన్వయంతో అంతర్ముఖ జ్ఞానం వికసించాలి.

కాలతత్త్వ స్వరూపుడు — మారుతున్న కాలంలో మార్పులన్నింటినీ సాక్షిగా గమనించే చైతన్యాన్ని తెలుసుకోవాలి.

గుహుడు — దైవాన్ని బయట మాత్రమే కాదు, హృదయగుహలో కూడా అన్వేషించాలి.

స్వామినాథుడు — జ్ఞానం ముందు వయస్సు, స్థానం, అహంకారం అన్నీ చిన్నవే; వినయమే నిజమైన శిష్యత్వం.

వేల్ — అజ్ఞానాన్ని ఛేదించే జ్ఞానశక్తి.

అందుకే సుబ్రహ్మణ్య స్వామి నామాలను పలకడం కేవలం నామస్మరణ మాత్రమే కాదు.

ప్రతి నామాన్ని ఆధ్యాత్మిక సాధకుడు ఒక అంతరంగ అద్దంలా చూసుకుంటే —

నా భయం ఎక్కడ ఉంది?
నా అహంకారం ఎక్కడ ఉంది?

నా కోరికలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి?

నా మాట ఎంత పవిత్రంగా ఉంది?
నా హృదయంలో కరుణ ఎంత ఉంది?
నా అంతరంగంలో జ్ఞానదీపం వెలిగిందా?

అనే ప్రశ్నలు మనలోనే ఉదయిస్తాయి.

అప్పుడు దేవుని నామం బయట పలికే శబ్దంగా మాత్రమే ఉండదు.

అది మన జీవితాన్ని మార్చే అంతర్ముఖ సాధనగా మారుతుంది.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నామ వైభవం మనకు చివరికి ఇదే బోధిస్తుంది —

దేవుని రూపాన్ని దర్శించడం ఒక అనుభవం;
ఆ రూపం వెనుక ఉన్న తత్త్వాన్ని మన జీవితంలో ఆచరించడం నిజమైన సాధన.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరణం శరణం. 🙏