19, నవంబర్ 2013, మంగళవారం

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానం ఏమిటంటే ...

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానమిదే -
భారతీ! నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు ఓ పుస్తకంలో చదివిన కబీరుగారి ప్రబోధకీర్తన గురించి చెప్తాను. " సద్గురుకీ భిక్షా మాంగాయిరే బాల" అన్న కీర్తన పూర్తిగా నాకు గుర్తులేదు, కానీ, అందులో వివరించిన అర్ధం, అంతరార్ధం గుర్తుంది. సద్గురుకీ ప్రేమభిక్ష వేడుకోమని, చెప్తూ ఆ భిక్షకు అంగభూతములుగా నాలుగు భిక్షలను కబీరు నిర్వచించెను. మొదటిది గోధుమపిండి. ఇది అంగడికి గాని, పిండిమరకు గాని పోకుండా జోలెనిండ తేవలెను. రెండవది జలము. బావికి గాని, నదీతటాలములకు గాని పోకుండానే ఆనపబుర్ర నిండా తేవయును. మూడవది కట్టెలు. అంగడికి గాని, అడవికి గాని పోకుండా మోపెడు కట్టెలు తేవలయును. నాల్గవది దర్శనభిక్ష. మసీదు, దేవళములకు గాని, సాధు ఫకీర్ల వద్దకు గాని పోకుండా, ఉన్నచోటనే దర్శనం పొందవలెనని, అందుకై సద్గురుకి ప్రేమభిక్ష వేడమనే ప్రబోధం ఆ కీర్తనలో ఉంది. ఇప్పుడు ఈ కీర్తనలో అంతరార్ధం తెలుసుకుందాం. మొదట మూడు అంటే, పిండి, జలము, కట్టెలు రొట్టెను తయారుచేయుటను సూచించును. ఆ రొట్టెను తినినచో దర్శనం, దాని ఫలితంగా ప్రేమ లబింపవలయును. రొట్టెను తయారుచేయుటకు పిండి ముఖ్యపదార్ధం. కాని పొడిపిండిని తినలేం. అందుకే నీరు కావలయును, ఆ నీటితో పిండిని తడిపి, ముద్ద చేసి రొట్టెగా ఒత్తవలెను. అలా పచ్చిరొట్టెను తినలేం, దానిని కాల్చాలి. కాల్చడానికి కట్టెలు కావాలి. ఇలా సక్రమముగా తయారైన రొట్టెను తింటే ఆకలి తీరుతుంది. ఇక్కడ పిండి జ్ఞానం. దానిని భక్తి రసముచే (జలముచే) తడిపి మృదువుగా నొనర్చిన పిమ్మట నిష్కామ కర్మలను కట్టెలతో పక్వమొనర్చి  సక్రమముగా తయారైన ధ్యానమను రొట్టె ఆరగిస్తే ఆధ్యాత్మికక్షున్నివారణమగును. అప్పుడు ఉన్నచోటనే తత్క్షణమునే పరమాత్మ దర్శనమగును. అటుపిమ్మట అంతా పరమాత్మ ప్రేమతత్త్వమే. దానిని సద్గురువునివ్వమని వేడుకో... ఈ కీర్తనబట్టి ఆత్మసాక్షాత్కారానికి భక్తి, ధ్యాన, కర్మ, జ్ఞానమనే నాలుగూ అవసరమేనని అర్ధమౌతుంది. కాకపోతే ఈ నాలుగు యోగాలు అనుష్టించగలిగే శక్తి కారణజన్ములయిన మహాత్ములకే ఉంటుంది. మనలాంటివారికి ఇది అసాధ్యము కావున, ఏ యోగమార్గం ద్వారైన నను పొందవచ్చని గీతలో సూచించాడు. 

జీవకోట్ల సంస్కారములు అనేకవిధములు. జీవుల యొక్క పరిపక్వతా భేదములున్ను అనేక రకములు. వారి వారి భావనలబట్టి ఒక్కొకరికిని ఒక్కొక్కదానిలో ప్రవేశం కల్గుచుండును. కావున నిష్కామ కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం మొదలగు మార్గములు ఏర్పడినవి. దేహాంతరాలయములోనికి ప్రవేశించి ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ఈ నాలుగుమార్గాలు గోపురద్వారాలుగా ఉన్నాయి. ఈ మార్గాలలో ఏ మార్గం ద్వారైనను నిర్మలబుద్ధితో, నిష్కపట ప్రయత్నముతో ప్రవేశించి గమ్యస్థానమును చేరవచ్చును. అయితే, ఏ యోగమార్గములో ప్రవేశించినను, మిగిలిన మూడు మార్గాలు అందు అంతర్భూతమయ్యే యుండును. ఆంటే అంగభూతములుగా యుండును. ఈ నాలుగున్ను ఒకదానికి ఒకటి అన్యోన్య సంబంధం కల్గియే యుండును. జ్ఞానికి భక్తి, కర్మ, ధ్యానములు అంగభూతములుగా నుండును. అట్లే భక్తునికి కర్మ, ధ్యాన, జ్ఞానములూ; ధ్యానికి భక్తి, కర్మ, జ్ఞానములూ; కర్మయోగికి భక్తి, ధ్యాన, జ్ఞానములూ అంతరభాగములై యుండును. ఎలాగంటే, చీకటి నశించి ప్రకాశము కలుగుటకు దీపమే ప్రధానమైనను, దానికి ప్రమిద, తైలము, వత్తి ఎలాగున అవసరమో, అదేరీతిగా జ్ఞానజ్యోతి అయిన ఆత్మను దర్శించడానికి తక్కిన సాధనములు అవసరమే.
దైవోపాసనచే విక్షేపశాంతియు, శుద్ధమగు కర్మానుష్టానంచే అంతఃకరణశుద్ధియు, ధారణాధ్యానబలంచే సంయమనమును, జ్ఞాననిష్టచే ఆవరణరాహిత్యమును కలుగును. కనుక ఏ యోగమార్గమందైనను ఒకదానికి ఒకటి అనుసంధానింపబడే ఉంటాయి. 
భోజనం చేస్తున్నామంటే, దాని తయారికి బియ్యము మొదలగు పదార్దములు, అగ్ని, జలము, పాత్ర, కట్టెలు మొదలునవి ఎలా ఉన్నాయో, ఏ యోగం అనుసరించినను ఆ యోగంలో తక్కినవి అంగభూతములై ఉంటాయి. ఈ సూక్ష్మం అర్ధమైతే ఏది శ్రేష్టమన్న సందేహం ఉండదు ... అని నా నేస్తం 'హరిప్రియ' చెప్పింది.

17, నవంబర్ 2013, ఆదివారం

హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.

క్రిందటివారం తిరుపతి కంచి వెళ్లి, తిరుగు ప్రయాణం అయినప్పుడు ట్రైన్లో ఇద్దరు సాధకులు తాము అనుసరిస్తున్న 'సుషుమ్న నాడీ' ధ్యానవిధానమును తెలిపారు.
పతంజలి యోగసాధన, బుద్ధుని అనాపాన సతి, మాస్టర్ సి. వి. వి. ధ్యానయోగం, పరమహంస యోగానంద క్రియాయోగం, మహేష్ యోగి భావాతీత ధ్యానయోగం, శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీరమణుల నేనెవరిని అన్న విచారణయోగం, స్వామి శివానంద సగుణ నిర్గుణ ధ్యానపద్ధతి, బ్రహ్మకుమారీల రాజయోగం, మాతా అమృతానందమయి ఐ యామ్ టెక్నిక్, అరవిందుని ఇంటిగ్రల్ యోగం, ఋషి ప్రభాకర్ గారి యస్. యస్. వై ధ్యానపద్ధతి, శ్రీ భిక్షుమయ్య గారి యమ్. యమ్. వై ధ్యానపద్ధతి, పత్రీజీ పిరమిడ్ ధ్యానం ... ఇలా ... ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ధ్యానయోగాన్ని అనుభూతిస్తూ, నిర్వచిస్తూ, సూచిస్తూ, తెలియజేస్తున్నను, ఈ ధ్యానప్రక్రియలన్నీ స్వస్వరూపస్థితిని తెలుసుకోవడానికే కదా, అని నాకన్పించింది.
ఇంతలో ఆ సాధకులు చెప్పినదంతా విన్న సహప్రయాణికుడు కొందరు ధ్యానయోగం గొప్పదని, మరికొందరు భక్తియోగమని, మరికొందరు జ్ఞానయోగమని, మరికొందరు కర్మయోగమని చెప్తుంటారు. నిజానికి ఏది గొప్పదని వారిని అడగగా, వారు ధ్యానయోగమే గొప్పదని బదులిచ్చారు.
ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ రావడంతో దిగిపోయాను. కానీ, ఏ యోగం గొప్పదన్న ఆలోచన నన్ను వీడలేదు. గీతలో భక్తియోగంలో అనేక మార్గాలను సూచిస్తూ కృష్ణపరమాత్మ ఇలా అంటారు -
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః||

నాలోనే మనస్సును, బుద్ధిని నిలుపుము. అటుపిమ్మట నీవు నిస్సందేహంగా నాలోనే వసింతువు. అంటే ఇది భక్తియోగం.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనుంజయ||

స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు. ఇది ధ్యానయోగం.

అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి||

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం చేసే పుణ్యకర్మలు వలన నన్ను పొందుతావు. ఇది కర్మయోగం.

అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్||

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీవు చేసే
కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
ఇలా సాధకులకు అనేక యోగామార్గాలు ఉన్నాయి కదా, మరి ఇందులో ఏది శ్రేష్టమైనది అన్న నా సందేహాన్ని తీర్చుకోవడానికై మూడురోజుల క్రితం నా మిత్రురాలు 'హరిప్రియ'కు ఫోన్ చేసి అడిగాను. తను నవ్వి, మంచి సందేహమే, ఈ ఆదివారం కార్తీకపౌర్ణమి కదా, ఆరోజు ఉపవాసముంటాం కదా, ఉపవాసమంటే దేవునికి దగ్గరగా ఉండడం అంటే దైవస్మరణ, దైవప్రార్ధన ... ఇత్యాదులతో గడపడం కదా, ఆరోజు వస్తాను, నీ సందేహాన్ని తీరుస్తాను, సరేనా ... అన్నప్పటినుండి ఈ కార్తీకపౌర్ణమి కై నిరీక్షణ .....
 
హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.
నా సందేహం ఎలా తీరిందో, నా నేస్తం ఏం చెప్పిందో తదుపరి టపా లో -

30, అక్టోబర్ 2013, బుధవారం

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.
మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.
బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.
చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.
అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.
ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.



28, అక్టోబర్ 2013, సోమవారం

"మౌనం"


మౌనం -
              దైవభాష.
              సనాతనం.
              లిపి లేని విశ్వభాష.
              ధార్మిక దివ్యత్వానికి ద్వారం.
              సనాతన భాషాస్రవంతి.
మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.

మౌనమంటే -
                   నిరంతర భాషణ.
                   చింత, చింతన లేని తపస్సు.
                   అఖండ ఆనందపు ఆత్మస్థితి.
                   విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
1. వాజ్మౌనం :-



                   వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.


2. అక్షమౌనం :-
                
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.


3. కాష్ఠమౌనం :-
      
 
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.




దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

మౌనం -
                      దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.
                      గురువు మౌనం జ్ఞానానుగ్రహం.
                      జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.
                      భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.
పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం
బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే
తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని
ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.
                                          - శ్రీ సీతారామాంజనేయ సంవాదం.
ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.




11, ఆగస్టు 2013, ఆదివారం

ఒకప్పుడు నేను విన్న కధను గుర్తుచేసిన 'శ్రీ శ్యామలీయం గారి భాగవతం'

పరమ భాగవతోత్తముడైన బమ్మెర పోతానామాత్యులవారు తన సహజపాండిత్యంతో అనితరభక్తితో మానవాళికి ఆత్మోన్నతిని అందించే శ్రీ మద్భాగవతాన్ని తెలుగులోనికి అనువదించగా,
దానిని తిరిగి ధారావాహికంగా భక్తజన హృదయాలను రంజింపజేస్తూ, ఎంతో భక్తితో తను చేస్తున్న ఈ పనిని ఓ తపస్సులా భావిస్తూ శ్రీమదాంధ్రమహాభాగవతంను సరళముగా అందిస్తున్న శ్రీ శ్యామలీయంగారికి నమస్సులు. వారి శ్యామలీయం భాగవతం చదువుతుండగా ఒకప్పుడు నేను విన్న ఈ కధ జ్ఞాపకం వచ్చింది.
శుకమహర్షి భాగవతమును ఏడురోజులలో పరీక్షిత్తు మహారాజునకు తెలిపి ముక్తిని కలుగజేసినట్లు తెలుసుకున్న ఓ మహారాజు తన ఆస్థాన పురోహితున్ని పిలిచి, ఆ భాగవతమును తనకి విశదపరచమని, తనకు అలానే ఏడురోజుల్లో మోక్షమును కలుగజేయమని, లేనిచో నీ పౌరాణికత్వం రద్దుచేసి, దేశబహిష్కరణ చేస్తానని శాసించెను. అంతట ఆ పౌరాణికుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చెప్పినను ఆరాజు మనస్సు భగవద్వీలీనం చేయక ఏడవరోజు ముక్తికై ఎదురుచూస్తుండడంతోనే ఆరురోజులూ గడిచిపోయాయి. మరుసటిదినం ఏడవరోజు అగుటచే పౌరాణికుడు మహావ్యాకులతతో వుండగా, ఆ పండితుని సేవకుడు తన యజమాని విచారమునకు కారణం అడిగితెలుసుకొని, ఈ పనికి నన్ను నియమించండి, మీ బదులుగా నేను వెళ్లి ఈ పనిని పూర్తిచేస్తానని చెప్పి, తానే రాజభవనానికి వెళ్ళి, ప్రభూ! ఈ చిన్నివిషయానికి తానేల రావలయునని తలచి, మోక్షము యొక్క రహస్యమును తమకు తెలిపి రమ్మని నా యజమాని ఆదేశించగా నేను వచ్చితిని అని చెప్పి, ఓ రాజా! ఈ రోజు పురాణం ప్రారంభించుటకు ముందు మీరు బంధీకృతులు కావలసియున్నది అని చెప్పగా ... మోక్షం వచ్చుటకు ఇదికూడా అవసరం కాబోలు అని రాజు అంగీకరించగా, రాజును ఒకస్తంభమునకు కాలుచేతులు కట్టి బంధించి, ఆ పిమ్మట ఆ సేవకుడు అనేకరకముల ఫలహారములు తెప్పించి రాజుముందు పెట్టి,
మహారాజా! శుభముహూర్తం దగ్గరకు వచ్చింది, ఈలోపునే మీముందున్న ఫలహారములను స్వీకరించాలి కావున వెంటనే భుజించమని చెప్పెను. ఇదెలా సాధ్యం? బంధీకృతమైన నేను ఎలా భుజించగలనని రాజు ప్రశ్నించగా, ఓ రాజా! పరీక్షన్మహారాజు వలే మీకు తగిన వైరాగ్యం లేదు, మీ బంధనములు తెగలేదు. ఇట్టిస్థితిలో ఏడురోజుల్లో మీకు మోక్షమిప్పించుట ఎట్లా సాధ్యమౌతుంది?
ఓ రాజా! 
జనమేజయులకు రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునను తప్పించి, చిత్తంబు హరికి అర్పించి, ప్రాయోపవిష్టుండైన పరమభాగవతుడైన పాండవపౌత్రుండు
పరీక్షిత్తు మహారాజుకున్న వైరాగ్యం మీలో లేదు. మీరింకనూ ఆశాపాశములతో ఈ మాయాప్రపంచంన కట్టుబడే యున్నందున మోక్షం సాధ్యం కాదు. రాజా! ప్రీతితో, ఆసక్తితో, ఫలాభిలాషతో, కర్తృత్వబుద్ధితో గడుపుజీవితం బంధమును కలిగిస్తాయి. బంధమెంతవరకుండునో అంతవరకు మోక్షం లేదు. ముక్తి పొందడానికి యోగ్యత, సాధన, ఆచరణ కావలసియున్నది. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికి మాత్రమే ముక్తి సాధ్యమగును.
ఓ మహారాజా! దేహపుత్రకళత్రాది వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఏకాంతప్రదేశమున అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడిన బ్రహ్మబీజమైన *ఓంకారము*ను మనస్సులో స్మరిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్శ్వాశాలను వశపరుచుకోవాలి. విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారధితోను, మనస్సనే పగ్గంతోను బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిపై నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమముగా ధ్యానించాలి. రజో, తమో గుణాలచే ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సునూ, ఆ గుణాలవలన కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి. అలా చేసిననాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతారని, వారే మోక్షం పొందుతారని శుకమహర్షి చెప్పినట్లుగా,  అప్పటికే సర్వమూ పరిత్యజించి, హృదయాంతరమున హరిని నిలిపి, మనస్సును భగవద్విలీనం చేయుటచే పరీక్షిత్తు మహారాజు మోక్షం పొందాడు మహారాజా, అని భక్తుడైన ఆ సేవకుడు చెప్పగా, తన తప్పుని రాజు గ్రహించి పశ్చత్తాపపడెను. సేవకుడు తిరిగి తన యజమాని ఇంటికి వెళ్ళగా, అప్పటికే జరిగిన విషయాలన్నీ జనుల ద్వారా తెలుసుకున్న ఆ పండితుడు ఈ భక్తోత్తముడిని సాదరంగా ఆహ్వానించి, 'నాయనా! ఈ దినమునుండి నేనే నీకు సేవకుడిని, మీరే నేటి నుండి నా గురువులు' అని రెండు చేతులను ముకుళించి నమస్కరించెను.

*ఓంకారం* గురించి మరింత వివరణ ఈ లింక్స్ నందు -
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post.html
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post_29.html)
 

ఎప్పుడో విన్న స్మరించుకోదగ్గ ఈ కధ మరుపున పడకూడదని స్మరణ లో పోస్ట్ చేస్తున్నాను.

9, ఆగస్టు 2013, శుక్రవారం

గీతాకల్పతరువు

గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం
వేదవ్యాసవివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్ /
నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి
ప్రవాళాంకితం
కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభి
ం మోక్షప్రదం జ్ఞానినామ్ //

భగవద్గీత ఓ కల్పవృక్షం. దానిని నాటినది శ్రీకృష్ణపరమాత్మ. పోషించి పెంచినది వ్యాసభగవానుడు. ఉపనిషత్తులే గీతకు బీజం. వైరాగ్య సహనములే గీతాకల్పతరువు యొక్క చిగురుటాకులు. నానాశాస్త్రములు దాని శాఖలు. శ్రీకృష్ణ పాదపద్మమునందలి పూర్ణభక్తియే దాని పుష్పం. జాతి లింగ ఆశ్రమ భేదములేక యెవ్వరు దానిని భక్తితో ఆశ్రయింతురో వారు తప్పక ముక్తులగుదురు.

ఇటువంటి కల్పతరువును ఏ ఫలం ఆశించి ఆశ్రయిస్తే ఆ ఫలం మాత్రమే సిద్ధిస్తుంది. కామ్యఫలం ఆశిస్తామో, జ్ఞానఫలం ఆశిస్తామో మన అభిమతంపై ఆధారపడి ఉంటుంది.

6, ఆగస్టు 2013, మంగళవారం

"నా ఆ ఆనందం అందరితో ....."


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' కారణముగా మరోసారి (క్రిందటి టపాలో మొదటిసారి తెలుసుకున్నది తెలిపాను) కృష్ణతత్త్వం తెలుసుకోగల్గినందుకు నా ఆనందం మరింత అధికమైంది. "నా ఆ ఆనందం అందరితో" పంచుకోవాలని ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని టపాగా పెడుతున్నాను.

ఉదయం హరిప్రియతో ముచ్చటిస్తూ, ఓ ప్రక్కకు తిరిగి నోటిలో బొటనవ్రేలు పెట్టుకుంటూ ఊ ఊ లు కొడుతున్న శ్రీ మాన్విని చూసి -
అరే, ఈమధ్య బొటనవ్రేలు నోటిలో పెట్టేసుకుంటుంది, ఇప్పుడే దీనిని మాన్పించాలి, అలవాటైతే కష్టం కదా, అయినా పిల్లలు ఎందుకు నోటిలో వ్రేలు పెట్టుకుంటారో ఏమిటో ... అన్న నా మాటలకు నవ్వి, దానికీ ఓ కధ వుంది అని, చెప్పిందిలా -
పూర్వకాలంలో సూర్యవంశంలో మాంధాత అనే రాజు తండ్రి నుండే తిన్నగా ప్రభవించాడు. మన శరీరంలో ప్రతి అవయంలో ఒక్కొక్క దేవత అధిదేవతగా ఉన్నట్లే చేతికి అధిపతిగా ఉన్న ఇంద్రుడు, పాలిచ్చేతల్లి లేనికారణముగా ఆ బిడ్డను నేను పోషిస్తానని వచ్చి, బొటనవ్రేలు ద్వారా అమృతం పిల్లవానికి చేరాలని,  'మాం - దాతా' పిల్లవాని బొటనవ్రేలును పిల్లవాని నోట్లో పెట్టాడట. అందుకేనేమో, చాలామంది పిల్లలు బొటనవ్రేలును చీకుతుంటారని అంది.
ఓహో ... కధ బాగుంది కానీ; మరి శ్రీకృష్ణుడు వటపత్రం పై శయనిస్తూ కాలిబొటనవ్రేలును నోట్లో పెట్టుకుంటూ ఓ లీలను ప్రదర్శిస్తాడు కదా, దానిలో ఏమైనా అంతరార్ధం వుందా అన్న నాప్రశ్నకు -
ఆ ... పరమాత్మ లీలలకు పరమార్ధం తప్పకుండా ఉంటుంది. మనల్ని మాయనుండి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రసాదించే దివ్యరూపమిదని, తాతయ్యగారు చెప్పింది లీలగా జ్ఞాపకం ఉంది. 

                                                    
శ్రీకృష్ణపరమాత్మ తన యోగమాయను మార్కండేయునకు చూపించడానికి వటపత్రంపై ఎడమకాలి బొటనవ్రేలును నోటిలో పెట్టుకొని శయనిస్తున్నట్లు దర్శనమిచ్చాడు. ముందుగా వటపత్రంపైనే ఎందుకు శయనించాడో చెప్పారు. జంతువులలో గోవు ఎంత శ్రేష్టమో, చెట్లలో మఱ్ఱిచెట్టు అంత శ్రేష్ఠమైనది. మఱ్ఱిచెట్టునే వటవృక్షమని, న్యగ్రోధమని అంటారు. ఈ వృక్షముది కనీకనబడని విత్తనమట. మిగతా మొక్కల్ని నాటినట్ట్లుగా ఈ మఱ్ఱిమొక్కను ఎవరూ నాటరు. ఇది స్వయంభువంగా వెలుస్తుంది. దీనికి ఎన్నో కొమ్మలు, ఊడలు ఉండి అనేక చెట్లగుంపులా విస్తారముగా ఉంటుంది. ఈ చెట్టును చూస్తే ఈశ్వరసాదృశ్యం తేటతెల్లమౌతుంది. ఎలాగంటే అంతచెట్టు చిరువిత్తనంలో ఉన్నట్లే పరమాత్మ కూడా అణువణువులోనూ ఉన్నాడని, ఆ చెట్టు విస్తారంగా వ్యాపించినట్లే పరమాత్మ కూడా బ్రహ్మాండమంతా తానే వ్యాపించి ఉన్నాడని, ఇది స్వయంభువంగా మొలకెత్తినట్లే పరమాత్ముడు కూడా స్వయంభువుడుగా అవతరించాడని, ఈ చెట్టుని గమనిస్తే అర్ధమౌతుంది. అందుకే దక్షిణామూర్తి మౌనంతో ఆత్మతత్త్వాన్ని వెల్లడించింది ఈ చెట్టు క్రిందనేనని అంటారు. 
అదియును కాక,  గోవు యొక్క సారం నవనీతం అయినట్లుగా, దానిని కృష్ణపరమాత్మ గ్రహించినట్లుగా వెన్నదొంగతనంలో కృష్ణతత్త్వం అర్ధం చేసుకున్నాం కదా.  చిట్టచివర వచ్చే నవనీతదశలో మాత్రమే కాదు,వటపత్రంపై ఉండండం ద్వారా,  ప్రాధమికదశయైన పత్రదశలోనూ (ఏ చెట్టుకైనా ముందు ఆకులే కదా చిగురిస్తాయి) తానున్నాని తెలియజేస్తున్నాడు. అలానే, మన శరీరంలో ఇడానాడి (దీనినే చంద్రనాడి అని అంటారు) ఎడమవైపున ఉంటుంది. ఇది జీవస్థానంకు, భౌతికప్రవృత్తికి సంకేతం. యోగులు ఈ నాడి నుండే అమృతస్రావాన్ని అనుభవిస్తారని, కృష్ణుడు తన ఎడమకాలి బొటనవ్రేలు నోటిలో పెట్టుకోవడం ద్వారా ఆ యోగస్థితిని సూచించాడని అంటారు. అలానే ప్రళయకాలంలో మార్కండేయునకు ఈ లీల చూపడంలో సమస్త సృష్టి మాయేనని, చిట్టచివరికి అంతా తనయందే లయమౌతుందని, అది గ్రహించమని జ్ఞానమార్గమును చూపించాడు. ఈ లీల ద్వారా తాను అమృతం త్రాగుతున్నట్లు కనబడినా, అతడు నిజంగా మనకు జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తూ జనన మరణ ప్రవాహమునుండి మనల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అందువల్లనే "ముకుంద", ముక్తిప్రదాత అని స్తుతింపబడుతున్నాడు. అంతే కాకుండా బాలరూపంలో దర్శనం ఇవ్వడం ద్వారా పిల్లల హృదయంలాంటి హృదయాన్ని కల్గియుండి, మనస్సును పాలమాదిరిగా స్వచ్ఛంగా ఉంచుకుంటే, మన మనస్సనే పాలసముద్రంపై భక్తిత్వం అనే వటపత్రం తేలగా, దానిపై క్షీరాబ్ధిసాయిలా శయనిస్తూ మనల్ని తనలో లీనం చేసుకుంటాడన్న సంకేతముందని తనకి జ్ఞాపకం వున్నంతవరకు వటపత్రశాయి గురించి వివరించిన
నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
తన చిరుచేష్టల ద్వారా ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.

కరారవిందేన పదారవిందం
ముఖారేవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసా స్మరామి
వటపత్రంపై శాయనిస్తున్న, పద్మంవంటి కాలిబొటనవ్రేలును, పద్మంవంటి చేతితో పట్టుకొని, పద్మంవంటి ముఖంలో పెట్టుకున్న ముకుందున్ని మనసార స్మరిస్తున్నాను.