10, అక్టోబర్ 2011, సోమవారం

ఆధ్యాత్మిక సాధన

ఓం గం గణపతియే నమః                                      ఓం శ్రీరామ శ్రీహనుమతే నమః                                శ్రీ గురుభ్యో నమః 

ఆధ్యాత్మిక సాధన అంటే..... 

మోక్షమార్గాన్ని గ్రహించి ఆ మార్గం ద్వారా గమ్యస్థానం చేరుకోవడానికి ఉపకరించే ప్రక్రియే "సాధన".
బ్రహ్మమును  గురించి సదా చింతన చేయడం, బ్రహ్మమును గురించే సదా సంభాషించుట, బ్రహ్మమును గురించే సదా తోటిసాధకులుతో చర్చిస్తూ ప్రభోదించుకోవడం, నిరంతరం ఇదే ధ్యాసలో త్రికరణశుద్ధిగా వుండగలగడం సాధన.
ధ్యానం, భక్తి, జపం, నామస్మరణ మొదలుగువాటితో చిత్తవృత్తుల వైవిధ్యం తొలగించుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన.
ప్రకృతి ఒడిలోనుండి దైవఒడిలోనికి పయనించడమే సాధన.
ఏ కారణం వలన మనస్సు బాహ్యముఖమౌతుందో ఆ కారణంలను బయటికిలాగి మంట పెట్టు ... అదే సాధనకు మొదటిమెట్టు.


సాధన ఎందుకంటే .....


మనకోసం. మన సంస్కారాల శుద్ధికోసం. ఎన్నెన్నో జన్మలనుండి వస్తున్న వాసనలు, రాగద్వేషాలు, కామక్రోధాలు మొదలగునవి తొలగించుకోవడానికే సాధన. ఇవన్నీ తొలగితేనే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు పరిశుద్దమౌతేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. అందుకే మనోశుద్ధికి సాధన అత్యంత అవసరం. మనస్సుని శుద్ధి చేసుకోవడానికి స్వవిచారణ, భక్తిభావం స్థిరపడుటకై జపతపాలు, ఏకాగ్రతమొనర్చడానికి నిరంతర నామస్మరణ, మనోమాలిన్యమును వదిలించుకోవడానికి ప్రార్ధన, నిజస్థితి తెలుసుకోవడానికి ధ్యానం, ప్రారబ్ధం తొలగించుకోవడానికి నిష్కామకర్మలు, అవగాహనకై శాస్త్ర అధ్యాయనం, అంతర్ముఖులం కావడానికి జ్ఞాన వైరాగ్యములు...మొదలగునవి అవసరం. ఇవన్నీ అలవర్చుకోవడానికి సాధన అవసరం. మన యోగ్యత పెంచుకోవడానికే సాధన. సాధనశీలురకే బ్రహ్మత్వబోధ లభించును. సాధన ఎందుకంటే మన యధార్ధస్థితిలో(చైతన్యంలో) లయం కావడానికి.సాధన ఎలాచేయాలంటే .....

మన ఋషులు, శాస్త్రాలు సూచించినమార్గం - సాధన చతుష్టయం. యదార్ధవస్తు దర్శనమునకు నాలుగు సాధనములు అవసరము. సాధనాచతుష్ట సంపన్నులే జ్ఞానప్రకాశమును పొందగలరు.

"సాధన చతుష్టయ సంపన్నుడే బ్రహ్మవిద్యకదికారి"

సాధన చతుష్టయమనగా నాలుగు అంశములతో కూడిన సాధన. ౧.వివేకము (నిత్యానిత్య వస్తు వివేకం) ౨.వైరాగ్యము (ఇహముత్ర ఫలభోగ విరాగం) ౩.షట్ సంపత్తి) ౪.ముముక్షుత్వము.

౧. వివేకము (నిత్యానిత్య వస్తు వివేకం)

              ఏది నిత్యమైనదో, ఏది అనిత్యమైనదో; ఏది సత్యమో, ఏది అసత్యమో; గుర్తించే యోచనను పరిశీలన ద్వారా అలవర్చుకోవడమే వివేకం. ప్రకృతి, మనస్సు ఎప్పటికైనా నశిస్తాయని అవి అశాశ్వతమని గ్రహించి వాటికి ఆధారమైన భగవంతుడు ఎప్పటికి నశించడని అతడు నిత్యుడని శాశ్వతుడు అని గ్రహించడమే వివేకం. ఈ సృష్టిలో ఆత్మచైతన్యం తప్ప మిగిలినదంతయు అనాత్మాయే. అనాత్మ పదార్దములు అశాశ్వతమైనవి, మార్పుచెందునట్టివి, నశించునవి, జననమరణాలు కలవి. అందుకే ఆత్మకు, అనాత్మకు గల భేదమును వివేకముతో గుర్తించి, ఆత్మ మార్పుచెందని, నశించని, జననమరణాలు లేని శాశ్వతమైనదని గ్రహించి, తాను ఆత్మనని ఈ శరీరమునందు కార్యములతో తనకు ఎట్టి సంబంధము లేదని అన్నింటా సాక్షిగా వుండడమే వివేకం.
౨. వైరాగ్యము (ఇహముత్ర ఫలభోగ విరాగం) :-
                                                         అనగా ఇహలోక సుఖములపై వైరాగ్యం. అంటే భౌతిక ప్రపంచ సౌఖ్యాలపై వైరాగ్యభావన. వివేకమువలన సాధకునికి అనిత్యములు, అసత్యములు అగు వస్తువులయందు ఉదాసీనత, విముఖత కలిగి ప్రాపంచిక వైరాగ్యం కలుగును.౩. షట్ సంపత్తి :-
                    సాధకునకు ఆధ్యాత్మికఅభివృద్ధికి ఉపకరించు ఆరు సుగుణములు. అవి -

 • శమము :- శమమనగా మనస్సుని నిగ్రహించి వశమందుచుకొనుట. ప్రాపంచిక విషయసుఖములందు, ప్రాపంచిక వస్తుసంపదలయందు బంధమూ,దుఃఖము ఉందని జ్ఞప్తి యందుంచుకొని, వానియందు విముఖత కలిగియుండి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అను నాల్గింటిని అనగా అంతఃకరణ చతుష్టయమును ఇంద్రియములతో కూడనీయక వానిని బ్రహ్మలక్ష్యము నందే నిలుపుట శమము. శమము అనగా మనోనిగ్రహము, అనగా అంతరింద్రియ నిగ్రహం. అంతరంగశుద్ధికై శమమని అందురు.
 • దమము :- దమమనగా పంచజ్ఞానేంద్రియములను, పంచ కర్మేంద్రియములను వాని యొక్క వృత్తులందు సంచరింపనీయక అనగా ఇంద్రియములు ప్రాపంచిక విషయములందు సంచరింపనీయక వానిని మనస్సుతోపాటు బ్రహ్మలక్ష్యంనందే నిలుపుట దమము. దమము అనగా ఇంద్రియ నిగ్రహం, అనగా బాహ్యేంద్రియ నిగ్రహం.
 • ఉపరతి :- చంచలమగు మనస్సును నిశ్చలముగా చేసి బాహ్యవిషయములనుండి మరలించి నిరంతరం బ్రహ్మధ్యానమునందే వుంచుట ఉపరతి. ఉపరతి అనగా మనస్సు బాహ్యములో ప్రవేశించక అంతర్యములో అణిగిపోవుట. ఈ స్థితిలో సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 • తితీక్ష  :- శీతోష్టములయందు, ఆకలిదప్పులయందు, మానావమానములయందు, ఇంకనూ ప్రపంచములో సంభవించు అనేక ద్వంద్వములయందు ఓర్పు కలిగియుండుటే  తితీక్ష. ఇతరులవలన కలుగు దుఃఖములకు శారీరక, మానసికదార్డ్యం కలిగియుండియు ప్రతీకారం చేయుతలంపు లేకుండుట, ప్రాపంచికవిషయములపట్ల ఎట్టి పరిస్థితులలోను చిత్త వ్యాకులత్వం లేకుండుట, ఏ పరిస్థితులలోను పరుష వాక్కులను ఉపయోగించక యుండునట్టి సహనంకలిగియుండుట తితీక్ష. భౌతిక ప్రాపంచికవిషయాలుపట్ల చలించని మనస్సుకలిగియుండుట తితీక్ష.
 • శ్రద్ధ :- శాస్త్ర వాక్యముపట్ల, గురువాక్యముపట్ల అచంచల విశ్వాసం కలిగియుండుటే శ్రద్ధ. గురువు, శాస్త్రములు తెలిపే వచనములపై అవి సత్యమేనన్న దృఢమైన నమ్మకమును కలిగియుండుటయే శ్రద్ధ. శ్రద్ధ అనగా తానే పనిని పూనుకొనెనో ఆ కార్యములో ఎన్ని ప్రతిబంధములు వచ్చినను ఆ పని పూర్తి అగువరకు దానినే మరల మరల ప్రయత్నించుచు దృఢబుద్ధితో సంపూర్ణం చేయాలన్న పట్టుదల కలిగియుండుట. అనగా ఏ స్థితియందుండి ఏ యొక్క బ్రహ్మనిష్ఠ మొదలగు శుద్ధవిచారము చేయుచున్నారో దానియందు ఎన్ని ప్రతిబంధములు వచ్చినను తన నిష్టను విడవకుండా వుండడమే శ్రద్ధ.
 • సమాధానము :- చిత్తలాలనము చేత అనేక రూపములందుగానీ, అనేక ప్రదేశములందుగానీ, శరీర అంతర్భాగములందుగానీ బాహ్యమునగానీ, మనస్సును కేంద్రీకరింపజేయక కేవలం లక్ష్యవస్తువు అయిన బ్రహ్మంనందే నిరంతరమును మనస్సును నిలుపుటను సమాధానం అంటారు. గురుశాస్త్ర భోధనలనుసరించి ఆత్మజ్ఞాన విచారమందు చిత్తమును ఏకాగ్రముగా నిలుపుటయే సమాధానం.

  ౪.ముముక్షుత్వము :-
                               శాశ్వత ఆనందప్రధమైన మోక్షమును పొందవలెననెడి తీవ్రమైన కోరికయే ముముక్షుత్వం. దేహేంద్రియ మనోబుద్దుల సంఘాతంనుండి విడివడి, అజ్ఞానమును వీడి ముక్తిని పొంది తరించాలన్న తీవ్ర తపనయే ముముక్షుత్వం.

  2 కామెంట్‌లు:

  1. సాధన చతుష్టయ సంపన్నుడ నై సాధనలొ పటు సాధి0చి నిరంథర ఆత్మ స్తిథిలొ జీవిస్తాను.ప్రెమైక జీవితాన్ని గడుపుతాను.విష్వానికి తండ్రి అవుతాను.

   రిప్లయితొలగించండి