9, ఆగస్టు 2012, గురువారం

"కృష్ణ సందేశం"


కృష్ణా!
కృష్ణా!
కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది. 
ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.

శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే.

ఓం దేవకీ గర్భసంజాతాయ నమః 
ఓం యశోదేక్షణ లాలితాయ నమః 
కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి -
ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -
అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే
అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద.

కృష్ణనామ మహత్యం :-
సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 
కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.
మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!
నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /
ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః 
జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ // 
కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.  

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /
యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //
కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే 
ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 
నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు. 

కృష్ణ విగ్రహము ఇస్తున్న సందేశం :-
దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే -
౧. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీఅననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. 
౨. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. అలానే మురళిలోని ఏడురంద్రాలు మనలోని ఏడు చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహంలేని స్వచ్ఛమైన అంతరంగం మురళి (వేణువు). ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు.
కృష్ణుడు ఎక్కువగా మురళివాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కన్పించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం. అత్యున్నత ఆనందం. ప్రాణాయామం అనే సాధనద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస (వాయువు) క్రిందకు పైకీ సాగిస్తే తదేకదృష్టి కల్గి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధిస్థితి కల్గుతుంది. ఈ స్థితే సహజయోగ పరమానందకరస్థితి. ఈ స్థితిలో మానవులుండాలన్నదే కృష్ణసందేశం. 
౩. కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుడుని నీలంరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని  అర్ధం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలంరంగు సూచిస్తుంది. ప్రకృతిలో ఉండడంవలన భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
౪. దేవాదిదేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలిఫించంనే ధరించడంలో సందేశమేమిటంటే ఏ స్థితియందున్న ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని.
౫. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః / 
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ // 
యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు బీష్మపితామహుడు -
ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః
దశాశ్వమేధీ పునరితి జన్మ 
కృష్ణప్రణామీ న పునర్భవాయ
శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు.
శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం  
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః సంఘనిర్యాణమన్త్రమ్ 
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం 
జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం (ముకుందమాలా)
సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి 
"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము". 
 



 

12 కామెంట్‌లు:

  1. ఎంత చక్కని విషయాలు చెప్పారండీ...

    తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను...ధన్యవాదాలు..

    శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములండి సాయిగారు!
    మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  3. అద్భుతమైన వివరణ...
    నమో కృష్ణ! నమో కృష్ణ!
    అభినందనలు మీకు....
    శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమో కృష్ణ! నమో కృష్ణ! మీ అబినందనలకు ధన్యవాదములండి.
      మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు......

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ధన్యవాదములండి.
      శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు......

      తొలగించండి
  5. దేవుని వాకిట నడుగిడు
    భావమిడును తమరి బ్లాగు భారతి గారూ !
    ఆ వాసుదేవ కృష్ణుని
    ఆవాహన చేసినారు అద్భుత రీతిన్ .
    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఈ స్పందనకి ఏమని బదులివ్వాలో తెలియడం లేదండి. భక్తిభావంతో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అంతా ఆ భగవంతుని దయ. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు మాస్టారుగారు.

      తొలగించండి
  6. కృష్ణ సందేశం గురించి,కృష్ణ మంత్రం గురించి మంచి విషయాలు చెప్పారండీ..
    ధన్యవాదాలు..
    మీకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఈ స్పందనకు ధన్యవాదములండి. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

      తొలగించండి