10, డిసెంబర్ 2012, సోమవారం

ఆచరణే ఆరాధన

ఉదయం శివాలయానికి వెళ్లి వస్తుండగా -
ఒక పెద్దావిడ ఏమీ అనుకోకురా అంటూ నా భుజం ఆసరాగా మెట్లు దిగుతూ...
అక్కడ కూర్చొన్నవారు ధర్మం చేయండమ్మా అని అడగగా 
చేతిసంచిలో నుండి తీసిన బన్ లను, చిల్లర నాణేలను కలిపి ఒకొకరికీ ఇస్తూ, చివరిలో ఓ ఇద్దరికీ బన్లు ఇవ్వడానికి లేకపోతే చెరో పదిరూపాయలు ఇస్తూ -
"ధర్మమంటే దానం కాదు, ధర్మమంటే ఒక జీవన విధానం. ఏ రకంగా జీవిస్తే దేవుని అనుగ్రహం లభిస్తుందో అలా జీవించడం ధర్మం. ఏ రకంగా జీవిస్తే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ రకంగా జీవించుటయే ధర్మం. రాగద్వేషాలు లేకుండా మనపని మనం సక్రమంగా చేయుటయే ధర్మం" అని చెప్తూ ఆలయప్రాంగణంలో ఓ రాతిచప్టా పై కూర్చున్నారు.
ప్రసన్నమైన నవ్వు, ప్రశాంతమైన ముఖరావిందం, ఆత్మీయతను కురిపించే కళ్ళు...... ఆమెతో కాసేపు మాట్లాడాలనిపించి ఆమె చెంతనే కూర్చుంటూ 'బాగా చెప్పారమ్మా' అని అన్నాను. 
అందుకామె నవ్వుతూ "ఓ నా మాటలు నీకునచ్చాయన్నమాట. వీటిని వినడమే కాదు, ఆచరణలో పెట్టు. ఎందుకంటే భగవంతుని పటాలను పూజించడం భక్తి కాదు, భగవంతుడు పయనించే సత్యపధమార్గమును అనుసరించడమే భక్తి. వారు వారి అవతారముల ద్వారా ఎలా జీవించాలని తెలిపారో అది ఆచరించడమే పూజ. ఆచరణే ఆరాధన. అదే అత్యుత్తమ అర్చన"... అని అన్నారు.
మాతోపాటు ఆ చప్టా పై కూర్చున్న మరొకామె అడిగారు - 'అమ్మా, అందరికీ సాగదమ్మ అలా ఉండడం. మంచిగా ఉన్నా ఎన్నో కష్టనష్టాలు, ఏ పని చేసినా నిందారోపణలు. పరిస్థితులు అనుకూలించాలి కదమ్మా దేనికైనా. అయినా ఒక్కొక్కరినీ ఒకోలా సృష్టిస్తుంటాడెందుకమ్మా ఆ భగవంతుడు' అని అడగగా 
"భగవంతుడు కాదు మన ప్రారబ్దాలే మన జన్మలకు కారణం. చేసే పనుల బట్టే పుడతారు. ఏ కష్టదుఃఖాలు లేకపోతే ఈ శరీరం ఈ భూమి మీదకు ఎందుకు వస్తుంది? మంచిగా ఉన్నా కష్టాలు వస్తున్నాయంటే అవి గత జన్మ పాపఫలితాలు. అనుభవించి వాటిని అధిగమించడమే. మనకి శిక్షణ ఇవ్వడానికే జయాపజయాలు, లాభనష్టాలు, కష్టసుఖాలు, నిందాస్తుతులు మొదలగునవి అనేకం  వివిధ సంఘంటనల రూపంలో వస్తాయి. అయినను పరిస్థితులు ఎలా ఉన్నా అవి ముఖ్యం కాదు, మన మానసికవైఖరే ముఖ్యం" దేహ ప్రారబ్ధం బట్టే ఇవన్నీ వస్తుంటాయి. వీటిని పట్టించుకోకూడదు. అని ఆమె చెప్పగా 'అమ్మా ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ఎలాగమ్మా, ఈ అహంకారమును, మమకారములను ఎలా జయించడం అమ్మా......కష్టంగా ఉందమ్మా సాధన' అని నేను అనగా -
"సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, పొగిడినా, నిందించినా సమానంగా ఉండు అని గీత చెప్తుంది. సంతోషకరమైన సంవేదనలను సమభావనతో చూస్తే రాగం నుంచి బయటపడగలం. బాధాకరమైన సంవేదనలను సమభావనతో చూస్తే అహంకారం నుంచి బయటపడగలం. నీవు చేస్తున్న ప్రతీ పనిని ఇష్టంగా దైవదృష్టితో చేస్తే అదే ఆధ్యాత్మికం అవుతుంది. అదే సత్యపధం వైపు నిను తీసుకువెళ్తుంది" అని చెప్తుండగా ఆమెని తీసుకువెళ్ళడానికి వారి అబ్బాయి రావడం, ప్రాప్తముంటే మరల కలుద్దామని చెప్తూ వెళ్ళారు.
ఇంటికి వచ్చాక కూడా ఆమె మాటలనే  
'స్మరణ'లో స్మరించుకుంటూ 'సులోచన'మ్మగారికి నమస్కరిస్తున్నాను.

టన్నుల కొలది శాస్త్రపరిజ్ఞానం కంటే ఔన్సుడు ఆచరణ మేలు.


8 కామెంట్‌లు:

 1. "సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, పొగిడినా, నిందించినా సమానంగా ఉండు అని గీత చెప్తుంది." ఇది నాకు బాగ నచ్చిన లైన్ భారతి గారు. చక్కటి పొస్ట్! 'సులోచన'మ్మగారికి వందనాలు, ఈ టపా రాసిన మీకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. సరళంగా చక్కగా సులోచనమ్మగారు మంచి మాటలను చెప్పేరు.
   మీ వ్యాఖ్యకు ధన్యవాదములు సర్.

   తొలగించండి
 3. మీ ఈ స్పందనకు ధన్యవాదాలండి మంజుగారు!

  రిప్లయితొలగించండి
 4. "ధర్మమంటే దానం కాదు, ధర్మమంటే ఒక జీవన విధానం. ఏ రకంగా జీవిస్తే దేవుని అనుగ్రహం లభిస్తుందో అలా జీవించడం ధర్మం. ఏ రకంగా జీవిస్తే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ రకంగా జీవించుటయే ధర్మం. రాగద్వేషాలు లేకుండా మనపని మనం సక్రమంగా చేయుటయే ధర్మం"...ఆచరణలో...లేని వాక్యాలు చెప్పడం వలన ఉపయోగం లేదు...
  చాలా బాగా చెప్ప్పారు భారతి గారూ!...@శ్రీ...

  రిప్లయితొలగించండి
 5. శ్రీ గారు!
  మీ ఈ స్పందనకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి