14, ఫిబ్రవరి 2013, గురువారం

శ్రీరామ నామజపం చేయువారు ఎంతపాపం చేసినను పర్వాలేదు కదండీ...

 క్రిందటి పోస్ట్ లో "పరమపావనం రామనామం" ను చదివిన ఒకరు ఈ క్రింద ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నను చూడగానే మనసంత భారమైంది. ఎంతో వేదన. ఇటువంటి ప్రశ్నలకు ఏమని బదులివ్వగలను? 

భగవత్ నామజపం చేయువారు పాపములన్నియు అగ్నియందు కట్టెలు భస్మమగునట్లు అగునని అంటారు. అలానే శ్రీరామ నామజపం చేయువారు ఎంతపాపం చేసినను ఆ పాపమునుండి విముక్తులగుదురని అంటారు కదా. అలానే 'జపతో నాస్తి పాతకం' అన్న శాస్త్రవచనం కూడా ఉంది కదండీ. అంటే ఏ పాపం చేసిన పర్వాలేదు కదండీ. భగవత్ నామధ్యానాలతో ఆ పాపం పోగొట్టుకోవచ్చు కదండీ?

ఏ భగవత్ నామధ్యానలైన భక్తియుతంగా ఉండాలి. భగవంతునిపై నమ్మకం, భక్తి, శాస్త్ర అవగాహన సరిగ్గా కుదురుకోలేనంత కాలం (సరిగ్గా లేనంతకాలం) ఇలాంటి సందేహాలే వస్తుంటాయి.
నిజమైన భక్తి బుద్ధిని వశంలో ఉంచుతుంది. పాపకర్మలవైపు మనస్సును పొనీయదు. మన చర్యలన్నీ దైవం గమనిస్తాడనే భావన పాపకర్మలను చేయనీయదు. భక్తియుతమైన నామస్మరణ మనలో కలిగే అత్యాశలను, తప్పుడు తలపులను క్రమేణా తొలగించి పవిత్రభావనలను, సత్వబుద్ధిని కల్గిస్తుంది. ఇటువంటి భక్తియుతమైన జపమే అప్పటివరకు మనం చేసిన పాపములను నశింపజేస్తుంది. 

కృత్వా పాపం హి సంతప్య తస్మాత్ పాపాత్ర్పముచ్యతే /
నై వం కుర్యాత్పునరితి నివృత్యా పూయతే తు సః // (మనుస్మృతి)
తెలివిలేని కాలమందు చేసిన పాపముచే కష్టమందున్నవారు పశ్చాత్తాపముతో భగవంతున్ని ప్రార్ధించినచో ఆ పాపంనుండి విముక్తి పొందుదురు. మరల ఎప్పటికిని అలాంటి పాపకార్యం చేయక సత్యనిష్ఠ యందు ఉండినచో, పరిశుద్ధులగుదురు.

పైన చెప్పిన మనుస్మృతిలో శ్లోకం ప్రకారం తెలివిలేనికాలమందు అంటే తప్పొప్పుల విచక్షణ లేనికాలమందు చేసిన పాపములు నామధ్యానాది జపములచే నశించును. అంతేకానీ, తెలిసి చేసి భగవత్ నామధ్యానాదులచే ఆ పాపం పోతుందని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది. 
శ్రీరామ నామంగానీ, ఏ భగవత్ నామంగానీ భక్తి జ్ఞాన వైరాగ్య సదాచారములతో ఆచరించువారికే అంతవరకు తెలియక చేసిన పాపకర్మల ఫలితము నశించును అని పెద్దలు చెప్పినది సత్యమే. కానీ, నామధ్యాన జపాదులు శక్తి తెలిసికూడా దురాచారపరులై పాపకర్మలు చేయువారికి ఆ పాపఫలితము మరింత అధికరించును.
శ్రీరామనామం పరమపవిత్రమైనను వక్రబుద్ధితో అనుష్టించువారికి నిశ్చయంగా చెరుపు చేయును. 

ఇటువంటి ప్రశ్నలకు రమణమహర్షి ఏమని బదులిచ్చారో పరిశీలిస్తే మరింత అవగాహన పెరుగుతుంది.
 ప్రశ్న :- స్వామీ! పంచాక్షరి గాని, తారకం గాని, ఏదో ఒక మంత్రం జపించేవారు జారత్వ చోరత్వసురపానదులు చేసినా, ఆ మంత్రజపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా? ఆ పాపం వారిని అంటకుండునా?
శ్రీ రమణుల జవాబు :- నేను జపిస్తున్నాననే భావం లేకుంటే, వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు. నేను జపిస్తున్నాననే భావమున్నప్పుడు దురభ్యాసాలవల్ల కలిగే పాపంమాత్రం ఎందుకంటదు? 
ప్రశ్న:- ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా?
జవాబు :- నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంతవరకు దేనికది అనుభవించవలసిందే. ఒకదానితో వేరొకదానిని కప్పిపుచ్చటం ఎట్లా పొసగుతుంది? నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకేది అంటదు. తానెవరో తెలుసుకుంటే గాని నేను చేస్తున్నాననే భావన పోదు. తన్ను తానెరిగిన వానికి జపమేది? తపమేది? ప్రారబ్ధవశంగా శరీరయాత్ర సాగుతుందేగాని వారు దేనిని ఇచ్చింపరు. ప్రారబ్ధం అనేది ఇచ్ఛాప్రారబ్ధం, అనిచ్చాప్రారబ్ధం, పరేచ్చప్రారబ్ధం అని మూడు విధములు. తన్ను తానెరిగిన తత్త్వజ్ఞునకు ఇచ్ఛా ప్రారబ్ధం లేనేలేదు. అనిచ్చా పరేచ్చా రెండే ఉంటాయి. వారు ఏది చేసినా పరులకొరకే. ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తారుగాని తత్ఫలితం వారి నంటదు. అటువంటివారు ఏది చేసిన పుణ్యపాపములు లేవు. అయితే, వారు ఎప్పుడూ లోకాన్ననుసరించే నడుస్తారు గాని అవకతవక పనులు చేయరు.

6 కామెంట్‌లు:

 1. ఇలాంటి ప్రశ్నలను అడిగేవారు నిజంగా సమాధానం తెలుసుకోవాలని అడుగుతారో ? లేక మరే ఉద్దేశంతో అడుగుతారో ? భగవంతునికే తెలియాలి.
  ఏది ఏమైనా , ప్రశ్నకు సమాధానంగా మీరు చక్కటి విషయాలను తెలియజేశారు.
  మనుస్మృతిలో శ్లోకం మరియు శ్రీ రమణుల వారు తెలియజేసిన విషయాలు చక్కగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 2. మురళి గారు!
  మీ స్పందనకు ధన్యవాదాలండి.
  అతి తెలివో, అమాయకత్వమో తెలియదు గాని, ఈ ప్రశ్న నన్ను బాధపెట్టిందండి.

  రిప్లయితొలగించండి
 3. అనూరాధ గారు!
  ఏ ఉద్దేశంతో అడిగిన ఆ వ్యాఖ్య (ఆ ప్రశ్న) ప్రచురించకూడదనే అనుకున్నాను. కానీ, వారు అదే భావంతో ఉంటారేమో నని, నాకు తెలిసినంతలో వారికి సమాధానం తెలియజేశానండి.
  మీ స్పందనకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 4. దుర్గేశ్వర గారు!
  ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి