13, ఫిబ్రవరి 2017, సోమవారం

"పుస్తకం దేవోభవ"


మంచి పుస్తకం...
మొదటిసారి చదువుతున్నప్పుడు ఓ ఆత్మీయ నేస్తంలా అన్పిస్తుంది, రెండవసారి చదువుతున్నప్పుడు కొత్త కొత్త జీవితసత్యాల్ని ఆవిష్కరించేదిలా, మరోసారి చదివేటప్పుడు అపారజీవితానుభవమున్న వయోధికుడిలా, మరలా చదివేటప్పుడు ఓ జ్ఞానిలా గోచరిస్తుంది.....
                                               
                                                   
మంచి పుస్తకం...
కాసిన్ని కాగితాలు, బోలెడు అక్షరాలు, పలు పదాల కూర్పు మాత్రమే కాదు, జీవితాన్ని వెలిగించే దీపం కూడా.
                                                       

మంచి పుస్తకం...
ఏ స్థితిలోనూ దూరం కాని నేస్తం. అన్నివేళలా అందుబాటులో ఉండే సలహాదారు. గమ్యం సుగమం చేసే మార్గదర్శి. సుద్దులు చెప్పే అమ్మ. బుద్ధులు నేర్పే నాన్న. జీవనోపాధినిచ్చే అన్నదాత. ఎన్నో వివరించే మానసిక విశ్లేషకుడు. ఔనత్యాన్ని పెంచే వ్యక్తిత్వవికాస నిపుణుడు. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపే గురువు.
                                                   
ఒక మంచి పుస్తకం చదవడం పూర్తయితే మనకో మంచి స్నేహితుడు దొరికినట్లే.

                                                 

ఇలా పఠనాసక్తి ఉన్న పెద్దవారు, పుస్తకప్రియులు మంచి పుస్తకముకై చెప్పే నిర్వచనాలు అనేకం.
                                    
                                                                        *         *       *

పెద్దబాలశిక్ష, బాల సాహిత్యం, కాల్పనిక కాల్పనికేతర సాహిత్యం, పరిశోధన గ్రంధాలు, పద్య శతకాలు, పాకశాస్త్రాలు, వ్యక్తిత్వ వికాస గ్రంధాలు, అర్ధశాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు.... ఓహో.... ఎన్నెన్నో పుస్తకాలు... అందరి అభిరుచులకు తగ్గట్లుగా. 

సాధారణంగా ఆధ్యాత్మిక సాధకులు వేదాంత గ్రంధ పఠనం చేసినంతకాలం మనస్సు ఉత్సాహంగా తాదాత్య్మముతో దైవ సాన్నిధ్యంలో గడుపుతున్నంత అనుభూతిని పొందుతారు. అయితే అదే అనుభూతితో ఆగిపోకూడదు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. అందుకు తగ్గట్టుగా అధ్యయనం, అధ్యయనం చేసింది అవగాహన చేసుకోవడం, అవగాహన చేసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రతీ సాధకునికి అవసరం. ఈ అధ్యయన విషయమై మన శాస్త్రాలు, మహర్షులు, ఆధ్యాత్మిక అనుభవిజ్ఞులు... ఏం తెలుపుతున్నారో ఓసారి గమనిద్దాం - 

ఇదం జ్ఞానమిదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతు మిచ్ఛతి |
అపి వర్షసహస్రాయుః శాస్త్రాన్తం నాధిగచ్ఛతి ||  (ఉత్తరగీత)
ఇది జ్ఞానం, ఇది జ్ఞేయం అని శాస్త్రములను చదివి గ్రహించుటకు సాధ్యం కాదు. ఏలననగా వేలకొలది సంవత్సరములు జీవించియుండి శ్రద్ధతో చదివినను శాస్త్రాంతము కనిపించదు.

అదీత్య చతురో వేదా ధర్మ శాస్త్రాణ్యనేకశ: |
బ్రహ్మతత్త్వం న జానాతి దర్వీ పాకరసం యథా ||
నాలుగువేదములు చదివినను, సమస్త ధర్మశాస్త్రములను చూసినను, బ్రహ్మతత్త్వంను తెలుసుకొనక పోయినచో అనేక పక్వాన్నాదులలో తిరిగెడు గరిటె, వాని రుచులు ఎట్లు తెలుసుకొనచాలదో, అట్లే వీరును ఆ గరిటెకు సమానమే.

అనంతశాస్త్రం బహు వేదితవ్యం స్వల్పశ్చ కాలో బహ వశ్చ విఘ్నా: |
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం ||
శాస్తములకు అంతము లేదు, అంతయూ చదువుటకు కాలము లేదు, జీవితం చాల స్వల్పం,  దీనిలో అనేక ప్రతిబంధములు కలవు. క్షీరనీరములు కలిసియుండినను హంస నీరమును విడిచి క్షీరమును మాత్రమే గ్రహించినట్లు , సారమైన విషయమును మహాత్ములనుండి గ్రహించి, అనుష్టించి కడతేరుట శ్రేష్టం.

వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా సర్వోన్నత శక్తి లేక ఆత్మ ఒకటి వున్నదని చెప్పేందుకు, దానికి దారి చూపేందుకు మాత్రమే ఉపకరిస్తాయి.
"ఎన్ని భాషలని,ఎన్ని శాస్త్రాలని నేర్చుకుంటారు? వేయిజన్మలెత్తినా అన్ని భాషలూ, అన్ని శాస్త్రాలూ రావు. దేనిని తెలుసుకుంటే సకలమూ తెలుస్తుందో, ఆ ఆత్మ నీ హృదయంలో ఉంది."నేనెవరు" అని ప్రశ్నించుకుంటే మనం ఆత్మ స్వరూపులమౌతాము. అసలు సత్యం నీలోనే వున్నదని అన్ని గ్రంధాలు చెప్తున్నాయి. నీలోనే యున్న ఆ సత్యాన్ని వదిలేసి దాన్ని గ్రంధాలలో వెదుకుట ఏమిటి? నిజమైన గ్రంధం ఆత్మ. ఆ గ్రంధాన్ని చదువు, తెలుసుకో. ఆత్మవిచారణయే సర్వకాలముల యందు చేయదగిన పని. గ్రంధాల అధ్యయనం అన్నది మనల్ని మనం సరి చేసుకొనే దిశలో ఉన్నత మార్గానికి దోహదపడుతుంది..కానీ ఆత్మానుభవం సాధ్యం కాదు.నిన్ను నీవు తెలుసుకో ముందు. పుస్తకం చెప్పేది అదే ..నిన్ను సరిచేసుకొని నన్ను చూడు, నన్ను తాగు అంటుంది. పురాణాలు, వేదశాస్త్రాలు అన్నీ పఠించాను కానీ, ఆత్మజ్ఞానం అంటే ఏమిటొ తెలియదు... అని ఒక పండితుడు అడగగా, జ్ఞానం శాస్త్రాల్లో లేదు. గ్రంధాలు బయట ఉండేవి. జ్ఞానం లోపల ఉండేది. అది తెలిసి ధ్యానించేవారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అని పై రీతిలో వివరించారు, శ్రీ రమణులు. 

'జ్ఞానదేవతు కైవల్యమ్' ... ఆత్మజ్ఞానముననే మోక్షము సిద్ధించుచున్నదని శృతి చెప్పుచుండగా, శాస్త్ర జ్ఞానంచే ప్రయోజనం ఏముంది? ... అని అన్పించవచ్చు కానీ,

ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్ /
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి // (అమృత బిందూపనిషత్తు)
మానవుడు రెండు విద్యలు నేర్చుకొనవలయును. 1. శబ్దబ్రహ్మము 2. పరబ్రహ్మము. శబ్దబ్రహ్మమనగా శాస్త్రము. పరబ్రహ్మమనగా ఆత్మజ్ఞానం. అయితే శబ్దబ్రహ్మమందు నిష్ఠ కలిగినవాడు మాత్రమే పరబ్రహ్మమును పొందగల్గును అని ఉపనిషత్తు బోధించుచున్నది. 

మరి ఈ శాస్త్ర అధ్యయనం ఎంతవరకు?

శాస్త్రాణ్వధీత్య మేధావీ అభ్యస్య చ పునః పునః |
పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్తాన్యథోత్సృజేత్ || (ఉత్తరగీత)
ప్రజ్ఞావంతుడగువాడు వేదాంతశాస్త్రంను చక్కగా చదివి ఆ శాస్త్రార్ధమును మాటిమాటికి అభ్యసించి పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొని, అన్నం ఉడికిన పిమ్మట కొరివికట్టెలను విడుచునట్లు, శాస్త్రములను విడవవచ్చునని కృష్ణభగవానుని వాక్కు.
అన్నము పక్వమగువరకు మంట ఎట్లుండవలెనో అట్లే జ్ఞానవిజ్ఞాన సంపూర్ణత్వం కలుగువరకు శాస్త్రాధ్యయనం తప్పనిసరిగా ఉండవలెను.

గ్రంధమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్పరః
పలాలమివ ధాన్యార్ధీ త్యజేత్ గ్రంధమశేషతః
మేధాసంపత్తి గలవాడు విద్యను బాగుగా అభ్యసించి జ్ఞానమున్ను, విజ్ఞానమున్ను కలిగినపిమ్మట శాస్త్రమును విడువవలయును. కర్షకుడు పైరును పోషించి, పండించి ధాన్యమును తీసుకొని పిమ్మట గడ్డిని త్యజించునేగాని, గడ్డి యుపయోగము లేదని తలంచి మొదటనే త్యజించినచో ధాన్యం దొరకదు గదా.
ధాన్యము నభిలషించు కర్షకులు, తమకు కావలసిన్నది ఫలమే యైనను, సకాలమున వ్యవసాయముచేసి విత్తనముల జల్లి, కలుపును తీసేసి, మంచి ఎరువుల సహాయంతో పైరును చక్కగా పోషించుచున్నారు. తమ ప్రయత్నం ఫలించిన తదుపరి ధాన్యమును తీసికొని గడ్డినెట్లు వదులుచున్నారో, అట్లే మోక్షాసక్తుడగు మేదావంతుడును వేదాంతగ్రంధముల నధ్యయనము జేస్తూ, సకాలంలో సరైన సాధనను చేసి,  అహంను తీసేసి, సద్గురువు సహాయంతో ఆత్మజ్ఞానము సంపూర్ణముగా పొందిన పిదప గ్రంధపఠనంను విడువవలెను. 

నావార్ధీ హి భవేత్తావత్ యావత్పారం న గచ్ఛతి |
ఉత్తీర్ణే తు సరిత్పారే నావయా కిం ప్రయోజనమ్ ||
ఎంతవరకు నది ఆవలదరిని చేరదో, అంతవరకు నదిని దాటుటకై పడవ యుండవలసిందే. ఏరు దాటిన మీద ఆ నావ ఉపయోగం లేదు.

అయితే ఇక్కడ మనమో విషయమును గమనించాలి - 

ఆధ్యాత్మిక సాధన అంతరంగానికి సంబంధించినది. అది మనస్సులోనే జరగాలి. సత్యాన్ని బాహ్యంగా అన్వేషించుట కూడదు. ఆత్మే పరమాత్మ అనే సత్యాన్నే అన్ని గ్రంధాలు ప్రభోధిస్తున్నాయి. ఇది అనుభవంలోకి రావాలంటే తీవ్రసాధన అవసరం. అయితే, ఇది అనుభవంలోకి రాకపోవడానికి కారణం మనస్సే. మనస్సే మన స్వరూపాన్ని మరుగు పరుస్తుంది. అనుభవానికి రానీకుండా చేస్తుంది. మాయంటే ఏదో కాదు, మనసే మాయ. ఈ మాయ విడిపోతే స్వరూపం అనుభవానికి వస్తుంది. పరిపక్వమైన మనస్సు కలవారే, సత్యంను తీవ్రసాధన చేత అనాచ్చ్చాదితముగా అనుభవించ గలుగుదురు. కానీ సంసారబాధ్యతలతో, ఇతరత్రా విషయవాంఛలతో,  ప్రతిబంధకాలతో సాధన చేయటానికి వ్యవధి లేనప్పుడు, ధ్యానం చేయడానికి ఏకాగ్రత కుదరనప్పుడు మనస్సుకు పరిపక్వత రాదు. అశాంతితో భారమౌతుంటుంది. ప్రాపంచిక మాయలో పడిపోతుంది. అలా మాయలో పడకుండా చేసే సాధనలో పుస్తకపఠనం ఓ సోపానమే అవుతుంది. అలాగని అదేపనిగా శాస్త్ర అధ్యయనంలోనే మునిగిపోకూడదు. శాస్త్రం ఏం చెప్తుందో గ్రహించి, అనుష్టించి ఆత్మసాక్షత్కారం పొందాలి. 

శ్రీ రమణమహర్షి, శ్రీ శంకరభగవద్పాదులవారు, రామకృష్ణపరమహంస తదితరవారంతా బ్రహ్మత్వం సిద్ధించాక కూడా శాస్త్ర పఠనం చేస్తూ, తమ దర్శనార్ధం వచ్చే సాధకుల చెంత శాస్త్ర చర్చలు, గ్రంథపఠనాలు సాగించేవారు.  ఎందుకని మరి?

కాస్త లోతుగా ఆలోచిస్తే ...

శాస్త్రమను ఓడలేనిచో సంసారసాగరం దాటలేం. నది దాటిపోయిన వారికి పడవ అవసరం లేదు.
అలాగని, ఆత్మజ్ఞానం పొందినవ్యక్తి పడవను త్యజించి వెళ్ళడు. పడవను పదిలపరుస్తాడు. ఎందుకనగా ఆవల నుండు జనులను మరల దాటించుటకది అవసరం. ముక్తులైనవారులలో ఇతరులు తరించవలెనన్న సద్భుద్ది ఉంటుంది. అందుచే బద్ధులను విముక్తి చేయదలంచు ముక్తులైన జీవన్ముక్తులు తమ జీవితాంతం వరకు శాస్త్రాధ్యాయనుష్టానములను  ఆచరించుకొనియే యుందురు. 

'అసుప్తేరామృతే: కాలం నయేద్వేదాంతచింతాయా' ... లేచింది మొదలు నిద్ర పోయేంతవరకు, జన్మించిన పిమ్మట మరణం కలుగువరకును కాలమును వేదాంత చింతనంచేత గడుపవలయును.

తన అజ్ఞానంను మాత్రమే పోగొట్టుకొన తలచినవానికి గురువాక్యమొక్కటి చాలును. కాని ఇతరుల అజ్ఞానమును పోగొట్టకోరిక గలవానికి శాస్త్ర సాధన కూడా కావలయునని అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. 

మనస్సును ప్రాపంచికవిషయ రహిత మొనర్చుకో వలయునన్న, మాయలో పడకుండా చూసుకోవాలన్న జ్ఞానత్వం తప్పనిసరి. ఆ జ్ఞానత్వంనకు శాస్త్రపఠనం ఆవశ్యకం. శాస్త్రజ్ఞానం అలవడిన ఆత్మజ్ఞానం ఉదయించును. అగ్నికి వాయువు ఎంత అవసరమో, అట్లే ఆత్మజ్ఞానానికి శాస్త్రజ్ఞానమూ అంతే అవసరం.
మొక్కను సంరక్షించినచో స్వయంగా మ్రానై పల్లవించి పుష్పించి ఫలమై, ఆ ఫలం పరిపక్వమై అప్రయత్నంగా  క్రిందకు ఎట్లు రాలునో, అట్లే శాస్త్రాలను అధ్యయనం చేస్తూ అనుష్టించినచో మనస్సు పరిపక్వమై  దేనితో విషయసంపర్కం లేకుండా ఆత్మసాక్షాత్కారఫలం పొందడం జరుగుతుంది.
అందుకే, 
'వేదాభ్యాసో హి విప్రస్య తపః పరమిహుచ్యతే'... వేదాధ్యయనము ఉత్తమ మానవునికి గొప్పదగు తపస్సన్నది మనుమహర్షి మాట కాగా, 'స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే' ... అధ్యయనమే తపస్సు లన్నిటిలోను ముఖ్యమైన వాక్తపస్సని గీతాచార్యుని వచనం.
శ్రీ శంకరులవారు, శ్రీ రమణులు, శ్రీ రామకృష్ణులవారు శాస్త్రజ్ఞానం కలవారగుటచే అనేకవిధముల ప్రభోదించి ప్రజల యొక్క అజ్ఞానావరణమును తొలగించి జ్ఞానభాస్కరుణ్ణి ప్రకాశింపజేసిరి. 


ఏది ఏమైనా, ఓ మంచి పుస్తకపఠనం పూర్తయిన పిమ్మట నా మదిలో మెదిలే మాట  ఒకటే ... "పుస్తకం దేవోభవ"

వాట్సాప్ లో నాకు వచ్చిన, నచ్చిన చిరు వీడియో ... 


7 కామెంట్‌లు:

  1. "పుస్తకం దేవోభవ" బహుబాగుంది భారతీ! ఉత్తమ గ్రంధాలను చదవడం వలన మన బుద్ధి వికసించి మనలో ఉన్న లోటుపాట్లను గుర్తిస్తాము. సత్కర్మలు ఆచరించాలనే సంకల్పం కలుగుతుంది. అందరియందు సమభావంతో సద్భావనతో ఉండాలన్న సదాశయం కలుగుతుంది. జ్ఞానాన్ని అందరికీ అందించగలుగుతాము. అందుకే గ్రంధ పఠనం అనేది ఉత్తమ సాధన.... చక్కటి విశ్లేషణ...నైస్ పోస్ట్ రా....

    రిప్లయితొలగించండి
  2. "శాస్త్రమను ఓడలేనిచో సంసారసాగరం దాటలేం. నది దాటిపోయిన వారికి పడవ అవసరం లేదు.
    అలాగని, ఆత్మజ్ఞానం పొందినవ్యక్తి పడవను త్యజించి వెళ్ళడు. పడవను పదిలపరుస్తాడు. ఎందుకనగా ఆవల నుండు జనులను మరల దాటించుటకది అవసరం. ముక్తులైనవారులలో ఇతరులు తరించవలెనన్న సద్భుద్ది ఉంటుంది. అందుచే బద్ధులను విముక్తి చేయదలంచు ముక్తులైన జీవన్ముక్తులు తమ జీవితాంతం వరకు శాస్త్రాధ్యాయనుష్టానములను ఆచరించుకొనియే యుందురు."

    పైన వాక్యాలు నేను క్రొత్తగా విన్నవి. మహాగురువుల సందేశాన్ని బాగా అందించారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యగామి గారు,
      ఆధ్యాత్మికజిజ్ఞాసపరులు శాస్త్రములన్నియూ చదవాల్సిన అగత్యం లేదు. సారాతిసారములను గ్రహించి నిత్యజీవితమున అనుష్టించిన చాలును, ముక్తులు కాగలరని శాస్త్రం చెప్తుంది.

      యావానర్ధ ఉదపానే సర్వతస్సంప్లుతోదకే / తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః // అన్న గీతలో శ్లోకమునకు శ్రీ రామానుజులవారు చక్కగా ఇలా వ్యాఖ్యానించిరి - దప్పిక గలవానికి మహాతటాకమునగల జలమంతటితోను ప్రయోజనం లేదు, కొంచెం నీరు చాలును. ఆకలిగలవానికి లోకంలోని అన్నమంతయూ భుజించనక్కరలేదు, సరిపడ తినిన చాలును. రోగి అన్ని ఔషదములు తినబనిలేదు, సరైన ఔషధంను చక్కగా సేవించిన చాలును. అట్లే వివేకవంతునకు సమస్త వేదాలలోను బ్రహ్మప్రాప్తికి అవసరమైన ఏకొన్ని సాధనలనో చక్కగా అనుష్టించి, అనుభూతమొనర్చుకొనిన చాలును. తక్కిన కామ్యకర్మాదులన్నిటితో అతనికి ప్రయోజనమేమియునులేదు. వేదములయందు అనేక మంత్రములు, ఉపాసనలు, కర్మలు చెప్పబడినప్పటికిని భవరోగము నశించి మోక్షదామము చేరుటకు సాధకునకు ఏ ఒక్క మంత్రమో, ఉపాసనయో, ధ్యానమో సక్రమముగ అనుష్టించిన చాలును.

      పై టపాలో నావార్ధీ హి భవేత్తావత్ ...
      అన్న ఉత్తరగీతలో శ్లోకమునకు అర్ధం... నదిని దాటేంతవరకే పడవ అవసరం. దాటేక అవసరంలేదు. అలాగే శాస్త్రాలు ఆత్మజ్ఞానం పొందేవరకే అవసరం. అటుపై అవసరం లేదని.
      ఈ శ్లోకమునకు సద్గురు మహర్షి మళయాల స్వాములవారు వ్యాఖ్యానించిన వాక్యాలే కొత్తగా విన్నానని మీరు ఉదహరించిన వాక్యాలు. లోతుగా ఆలోసిస్తే మహర్షి మాటల్లో సత్యం అవగతమౌతుంది.

      కొన్నిచోట్ల అదేపనిగా శాస్త్ర అధ్యయనం తగదని, కొన్నిచోట్ల ఆత్మానుభూతి / బ్రహ్మానుభూతి కలిగేంతవరకు శాస్త్ర అధ్యయనం అవసరమని శాస్త్రాలు తెలుపుతున్నాయి.
      ఎన్నెన్ని చదువుతారు? సత్యంను గ్రహించి నీవెవరివో తెలుసుకునే సాధన చేయు అని ఓప్రక్క బోధిస్తూ, త్రిపురా రహస్య జ్ఞానఖండసారం, భగవద్గీత తదితర గ్రంధాలు చదవండి అని ఎందుకు మహర్షులు చెప్తున్నారు... ఏమిటిదని ఆలోచిస్తే, అర్ధమౌతుంది - ఏ ఇద్దరి ఆలోచనలు, అవగాహనలు, తత్త్వాలు ఒకేలా ఉండవు. కొందరు సత్యాన్ని గ్రహించి, మనస్సును మచ్చిక చేసుకొని త్వరగా మాయలో పడక పరిపక్వత సాధిస్తారు. కొందరు సత్యంను గ్రహించిన, మనస్సును జయించలేక మాయలో పడిపోతుంటారు. అందుకే సాధకుల మనఃస్థితిని బట్టి కొందరికి సత్యాన్ని సూటిగా చెప్పి గమ్యంకు చేరిస్తే, కొందరికి మాయలో పడిపోకుండా సరళంగా అంచెంచెలుగా తెలుపుతుంటారు. అందుకు తగ్గ సూచనలు, పుస్తక పఠనాలు గురించి వివరిస్తుంటారు.

      మీ ఆసక్తులు చదివి, అవసరం లేనప్పటికీ, ఎందుకో ఇలా మరింత వివరణ ఇవ్వాలనిపించింది.
      మీకు మనసార ధన్యవాదములు.

      తొలగించండి
  3. Samaadhaanalu labhinchaayi konni sandehaalaku.
    Sarvadaa kruthgu
    Nuraalini.



    రిప్లయితొలగించండి
  4. 🌼🌼 అధ్యయనం 🌼🌼

    ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు... లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు. ప్రతి జీవితం ఎలా జీవించాలో, జీవించకూడదో తెలియజేసే ఒక పాఠం అవుతుంది.

    నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలేగానీ... ఏదో ఒకటి నేర్చుకునేఅవకాశం ఎప్పుడూ ఉంటుంది.

    పుస్తక పఠనం ద్వారా ఎంత నేర్చినా, మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు.

    ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. నాన్ననుంచి క్రమశిక్షణ, అమ్మనుంచి సందర్భోచిత నాయకత్వ లక్షణాలు, మామ్మనుంచి మనశ్శక్తి, తాతయ్యనుంచి అప్పగింతలు, తోబుట్టువుల నుంచి క్షమ, మరపు... ఎన్నో నేర్చుకోవచ్చు.

    మనిషి కళ్లు తెరిచిన దగ్గర్నుంచీ నేర్వదగ్గ పాఠాలు బోలెడు.

    మీరా నుంచి భక్తి, హనుమ నుంచి సమర్పణ భావం, సంకల్పబలం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో పట్టువిడవని సాధన... ప్రతి జీవితం జ్ఞానసముపార్జనకు అద్భుత అవకాశం కల్పిస్తుంది. మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచడమనేది కీలకం, లోపల అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి.

    ఎవరినుంచైనా, దేనినుంచైనా, ఏ పరిస్థితిలోనైనా నేర్చుకోవడమన్నది విడవకూడదు. చాలామందిలో
    పాఠశాల రోజులతోనే నేర్చుకోవడం ఆగిపోతుంది. అటువంటి బతుకు నిరక్ధంగా తయారవుతుంది.

    మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలంటే, ఆరోగ్యంగా
    ఎదగాలంటే అధ్యయనం జీవితాంతం సాగాలి. అది శ్వాసతీసుకోవడములా, తుదిక్షణాల వరకు నిలవాలి. ఆటపాటల్లో మునిగితేలే పిల్లల్ని చూస్తే వర్తమానంలో జీవించడమంటే ఏమిటో బోధపడుతుంది.

    ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించేదంతా అనుభవం అవుతుంది. అది పరిపక్వతను పెంచుతుంది. ప్రాముఖ్యం లేని సంఘటనలు సైతం అద్భుతమైన అవకాశాలై జీవితంలో గొప్ప అనుభవాలుగా నిలుస్తాయి. ఎందరికో మార్గదర్శకం అవుతాయి.

    కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవగతమవుతుంది. మనిషికి... పరిపక్వతకు ఒక అడుగు తక్కువలో ఉందన్న విషయం. పరిస్థితులకు తలకిందులైపోయి, చెదిరిపోయి, ఉద్విగ్నతకు లోనై నిరుత్సాహపడితే నేర్చుకునేది ఏమీ లేకపోగా అవే పరిస్థితులు పునరావృతమవుతుంటాయి.

    జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు, ఏళ్లు పడితే... మరికొందరికి జీవితకాలం సరిపోదు. అనుభవాలు రకరకాలు. జయాపజయాలు, మంచి చెడులు, అనుకూల ప్రతికూలాలు... ప్రతి అనుభవం ఒక పరీక్షే. అవన్నీ నేటి నుంచి ఎలా ఉండనుందో తెలియని రేపటికి తీసికెళ్ళేందుకు మనిషిని సిద్ధం చేయడం కోసమే. తాను చేసే పొరపాట్లవల్ల మనిషి లోతైన పాఠాలు నేర్చుకుంటాడు. అపజయాలు గుర్తుండిపోయే పాఠాలు నేర్పుతాయి. విజయం ప్రేరణనందిస్తే, పరాజయం బోధకుడి పాత్ర పోషిస్తుంది. మనిషి పొరపాట్లకు మానసికంగా చలించిపోతే 'రేపు' కొత్తగా ఉండదు. బతుకు భారమనిపిస్తుంది.

    జీవితం ఒక ఆట. లెక్కకు మించిన అవకాశాలను, సవాళ్లను దారిపొడుగునా.విసురుతూనే ఉంటుంది. పట్టుదల ఉంటే వాటినందుకుంటూ జీవితాన్ని మెరుగుపరచుకుంటూ మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు.


    శ్రీరామ జయ రామ జయజయ రామ
    శ్రీరామ జయ రామ జయజయ రామ
    శ్రీరామ జయ రామ జయజయ రామ

    సేకరణ:- వాట్సప్

    రిప్లయితొలగించండి