సంకల్పం - పూజకు ముందు మనసుకు దిశ
గణపతి ధ్యానం తరువాత పూజలో మనం చేసే అత్యంత కీలకమైన ఘట్టం సంకల్పం.
పూజ ప్రారంభంలో మనం సంకల్పం చెబుతాం. పేరు, గోత్రం, తిథి, పూజా ఉద్దేశం వంటి వివరాలు అందులో ఉంటాయి.
సర్వాంతర్యామి అయిన ఆ జగన్మాతకు మన గురించి, మన మనసులో భావాలు గురించి అన్నీ తెలుసు. మరి ఇవి ఎందుకు చెబుతాం?
అమ్మకు తెలియజేయడానికి కాదు — మన మనస్సుకు దిశ చూపడానికి.
“నేను ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఒక పవిత్రమైన కార్యం కోసం కూర్చున్నాను. నా మనస్సును పూజపై నిలుపుతాను.”
అనే జాగరూకతే సంకల్పం.
“కుడిచేతి అరచేతిలో కొన్ని అక్షతలు ఉంచుకుని, మన గోత్రనామాలను ఉచ్చరిస్తూ, 'మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా...' అని సంకల్పం చెప్పుకుని, అమ్మా! నీ అనుగ్రహం కోసమే పూజ చేస్తున్నాను, నీ అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండేలా చూడు తల్లీ ... అని అనుకొని, చివరలో ఆ అక్షతలను అమ్మ పీఠం ముందు వదులుతాం. ఇది బాహ్యంగా మనం పూజను ఒక క్రమశిక్షణతో, స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభిస్తున్నాము అనడానికి గుర్తు.
🌿 “మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా...”
దీని భావాన్ని సరళంగా:
“అమ్మా! నాలోని దురితాలు (పాపాలు), అశుద్ధ సంస్కారాలు తొలగి, నా అంతరంగం శుద్ధి చెందేలా ఈ పూజను చేస్తున్నాను.”
అంటే కోపం తగ్గాలి, అహంకారం కరిగాలి, మనస్సు నిర్మలంగా మారాలి.
అప్పుడు సంకల్పం కేవలం ఒక మంత్రవాక్యం కాదు - అమ్మ పాదాల వద్ద మన అంతరంగాన్ని ఉంచే ప్రార్థన.
🌿 ఒక చిన్న ఉదాహరణ...
ఒక ప్రయాణం మొదలుపెట్టే ముందు మనం ఎక్కడికి వెళ్లాలో ముందుగా నిర్ణయించుకుంటాం. గమ్యం తెలియకుండా ఎంత దూరం ప్రయాణించినా, మనం ఎక్కడికి చేరుతున్నామో మనకే తెలియదు.
అలాగే పూజలో కూడా సంకల్పం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి గమ్యాన్ని గుర్తు చేస్తుంది.
“నేను ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో కూర్చున్నాను. ఈ పూజ ద్వారా నా మనస్సు శుద్ధి చెందాలి. నా లోపల మంచి మార్పు రావాలి. అమ్మ స్మరణలో నా మనస్సు నిలవాలి” — అని మనకు మనమే గుర్తు చేసుకోవడమే సంకల్పం.
అందుకే సంకల్పం అనేది కేవలం కొన్ని వివరాలను పలకడం కాదు.
“నేను ఎటువైపు వెళ్లాలి?” అని మన మనస్సుకు చూపించే దిక్సూచి.
పూజలోనే కాదు, మన నిత్యజీవితంలో కూడా ఏ పని ప్రారంభించినా, మనకు ఒక స్పష్టమైన సంకల్పం ఉండాలి. సరైన సంకల్పం లేని పని ఏ దిశా లేని పడవ లాంటిది. మనం ఏ పనిచేసినా కేవలం స్వార్థంతో కాకుండా, ఒక మంచి ఉద్దేశంతో పట్టుదలతో ప్రారంభించడం జీవితంలో '' మనకు నేర్పే గొప్పపాఠం.
🌸 ఈరోజు స్మరణ
సంకల్పం చెప్పేటప్పుడు ఒక్క క్షణం:
“అమ్మా! బయట పరిస్థితులు మారాలని మాత్రమే కాదు, ముందుగా నాలో మార్పు రావాలి. నా మనస్సును శుద్ధి చేసి, నీ స్మరణలోనే నిలిచేలా అనుగ్రహించు.”
సంకల్పం — పూజను ప్రారంభించే ముందు చెప్పే కొన్ని మాటలు మాత్రమే కాదు;
మనస్సును బాహ్యప్రపంచం నుండి అమ్మ వైపు తిప్పే ఒక బలమైన మొదటి నిర్ణయం.
శ్రీమాతా శరణం 🙏
శ్రీరామ జయం 🙏
జై హనుమాన్ 🙏
తదుపరి టపా: షోడశోపచార పూజ - అమ్మ సన్నిధి - ధ్యానం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి