15, అక్టోబర్ 2011, శనివారం

గోపికావస్త్రాపహరణం - రాసలీల - అంతరార్ధం

భగవంతుడు ప్రేమానంద స్వరూపుడు. సకల ప్రాణులను ఉద్ధరించి తనయందు లయం చేసుకోవడమే ఆ అనంతున్ని ఆంతర్యం. అందుకే కృష్ణావతారములో ఈ లీలలతో భక్తులను ఉద్ధరించి తనయందు లయం చేసుకున్నాడు. 

కృష్ణావతారమునకు ముందు నేపద్యం :- భూదేవి గోరూపమున బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, రాక్షసప్రవృత్తిగల రాజులవలన తనకు కలుగుచున్న ఉపద్రవమును విలపిస్తూ  విన్నవించగా -
బ్రహ్మ, విష్ణుమూర్తిని ప్రార్ధించి ఇలా ఆదేశించెను "దేవాదిదేవుడు తన సర్వోత్కృష్ట  శక్తులతో సహా త్వరలో భూలోకమున శ్రీకృష్ణ రూపమున అవతరింపనున్నాడు. ఆయన భూలోకమున దుష్టశిక్షణ, శిష్టరక్షణ అను కర్తవ్యములను నిర్వర్తించువరకు దేవతలు కూడా ఆయనకు తోడ్పడుటకు భూలోకమున ఉండవలెను. కావున దేవాదిదేవుడు అవతరించబోవు యదువంశమున దేవతలు వెంటనే జన్మించవలెను."
భగవంతుడు స్వయంసంపూర్ణుడు. ఆదీ, అంతమూ లేనివాడు. పుట్టుక, చావు లేనివాడు. అత్యున్నత లోకములో ఉన్నప్పటికీ, మనం అనుభవిస్తున్న దుఃఖం నుండి పారమార్ధిక ఆనందమువైపు దారిచూపడానికి అద్భుతమైన తన సంకల్పానుసారం గతములో అనేకమార్లు అనేకరూపాల్లో అవతరించినట్లే ఈసారి శ్రీకృష్ణుని రూపంలో అవతరించెను. కృష్ణ శబ్ధానికి అర్ధం "అందరిని ఆకర్షించేవాడు".

గోపికలు ఎవరు?
గోపికలందరూ వేదవిద్వాంసులు. వెనుకటిజన్మలో రామావతారకాలమున మునులకు, ఋషులకు శ్రీరామచంద్రునితో కల్సి ఆనందించాలని, ఆయనతో సంబంధమును కలిగివుండాలనే వాంఛ కలిగి రామున్ని కోరగా, నా కృష్ణావతారమున మీరు తిరిగి జన్మింతురనియు, అప్పుడు వారి వాంఛలను తీర్చుదుననియు శ్రీరాముడు వారికి అభయమిచ్చెను. ఆ వేదవిద్వాంసులే కృష్ణావతారకాలమున బృందావనములో గోపికలై జన్మించిరి. 

                                  గోపికావస్త్రాపహరణము 
                                                                                  
కృష్ణుడు తమ భర్తకావలెనని గోపికలు హేమంతఋతువు ప్రారంభమునుండి యమునానదీతీరమున ప్రతీరోజు తెల్లవారుజామున కాత్యయనిదేవినీ పూజించుచుండగా మాసాంతమున ఓరోజు గోపికల కోరికను గ్రహించిన కృష్ణుడు ఒడ్డునవున్న వస్త్రాలను అపహరించి ఓ చెట్టు మీదకు ఎక్కెను. వస్త్రాపహరణమన్నది బాహ్యానికి ఓ మిషమాత్రమే. గోపికల వస్త్ర్రాపహరణమంటే వారి చిత్తవృత్తులను తీసివేయడం అసలర్ధం. వారిని అలానే ఒడ్డుమీదకు రమ్మనమనెను. అంటే నగ్నదేహాలతో రమ్మనమననడం ఏమిటీ అన్న భౌతికార్ధముతో కాక అంతరార్ధం గ్రహిస్తే బాహ్యాలంకరణలుమీద, దేహంమీద, కామ మోహ మమకారములు అన్నీ వదులుకోవాలన్న  పరమాత్ముని భావన అవగాహనమౌతుంది. అలానే వచ్చిన గోపికలను రెండుచేతులూ ఎత్తి నుదుటనతాకించి నమష్కరించమంటాడు. అంటే నుదుటన వున్నది (భ్రూ మధ్యమున) ఆజ్ఞాచక్రము. ఆ స్థానము ఆత్మను పరమాత్మలో కలుపుతుంది. ఇక్కడే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఈ చక్రమునే దివ్యనేత్రమని, జ్ఞానచక్షువని అంటారు. కృష్ణుడు దీనిని మేల్కొలపడానికే చేతులను జోడించమంటాడు. అంటే ఈ చేతులజోడింపువలన జరిగినది "జీవాత్మ, పరమాత్మల కలయిక" వస్త్రవైడూర్యాలు, కామమోహాలు, మమకారములు అడ్డు తొలగించుకోమని, అలా తొలగించుకొని వస్తేనే తనలో లయమౌతారని కృష్ణుని ఈ వస్రాపహరణ లీల అంతరార్ధం.
                                      రాసలీల 

చాలామందికి వచ్చే సందేహమునే పరీక్ష్మహరాజు శుకమహర్షిని అడిగెను - 
కృష్ణుడు ధర్మపరిపాలన స్థాపించుటకును, అధర్మ ప్రవృత్తిని అణిచివేయుటకును  భూమిపై అవతరించినాడు కదా. మరి ప్రపంచములో నీతిపరులను కలవరపరుచు విధముగా గోపికలతో రాసలీల లేల ప్రదర్శింపవలెను? అంతట శుకమహర్షి ఇలా చెప్పెను -
అట్టిలీలలు పతితులైన బద్ధజీవుల యెడల ఆయనకు గల ప్రత్యేక కృపను చూపుతున్నాయి. గోపికల శ్రేయస్సు కొరకే కృష్ణుడు అట్లా చేసెను. బద్ధజీవులను సిద్ధజీవులుగా చేసెను. గోపికలు పూర్వజన్మమున రుషులవర్గంవారు. వారిందరినీ ఒకేసారి భౌతిక బద్ధస్థితి నుండి విముక్తి చేయడానికే ఈ లీల ప్రదర్శించి అనుగ్రహించెను. 'బ్రహ్మసంహిత'లో చెప్పబడినట్ల్లుగా ఈ గోపికలందరూ శ్రీకృష్ణుని ఆహ్లాదశక్తి యొక్క విస్తరణములు. రాధారాణి భగవంతుని అంతరంగశక్తి. 
"రాసలీల భౌతిక ప్రపంచములో ఇంద్రియతృప్తికోసం ప్రజలు చేసే నాట్యంలాంటిది కాదు. భగవంతుడు మీద జీవుడు చూపే అత్యుత్తమ ప్రేమకు వ్రజగోపికలు చిహ్నమై ఉన్నారు. ఎందుచేతనంటే భగవంతున్ని ఆనందపరచడమే వారికున్న ఏకైక ఆశయం. భగవంతుని వేణుగానం వినగానే అన్నీ మరిచి, సర్వమూ వదులుకొని కృష్ణుడు రా రమ్మని పిలుస్తున్నాడు, అని ప్రేమతో పరుగులుతీసిన భక్తులు. వారి ఈ ప్రేమైకభక్తికే పరవశించి వారిని ముక్తులు చేయదలచి తనని తాను విస్తరింపజేసుకొని, ఒకేసారి అనేకరూపాలు ధరించి, ప్రతీగోపిక సిద్ధస్వరూప దేహముతో రాత్రంతా అంతులేని ఆనందముతో నాట్యం చేసెను. ఏ చిన్నస్వార్ధపూరిత కోరికకు తావులేక, ఆనందానికి పరాకాష్ఠ అయిన ఈ నృత్యం జీవునుకి భగవంతునికి మద్య పరిణితి చెందిన అనుబంధానికి ప్రాతినిధ్యం వహించిన దివ్యఘటన". 

అంతరార్ధమును గ్రహింపనీయక అనవసరమైనవాటిని అవసరమైనవిగా చూపించడం మనస్సు స్వభావం. బాహ్యమునందు మాత్రమే చరించుమనస్సు అజ్ఞానంవలన భగవంతుని లీలలను వక్రీకరిస్తుంటుంది. ఆధ్యాత్మిక పరిణితితోనే దేనినైన పరిశీలించాలి. ఆధ్యాత్మికత అన్నది హృదయానికి సంబంధించినది.అందుకే అంతరయానం చేయాలి, అంతర్ముఖులం కావాలి.

9 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి...రాధా కృష్ణ ల పవిత్ర బంధాన్ని డేటింగ్ అనే పాశ్చ్యాత సంస్కృతి తో పోల్చి కించపరిచిన మన భారత అత్యునత న్యాయ స్థానం ఈ పోస్ట్ ని చదవాలి...కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  2. మన పురాణ ఇతిహాసాల అంతరార్ధం అర్ధం చేసుకోగల్గితే, భారతీయసంస్కృతి ఔనత్యం అర్ధమౌతుంది. థాంక్స్ ప్రవీణ్.

    రిప్లయితొలగించండి
  3. ముందుగా తెలుగు బ్లాగు లోకం లోనికి మా హృదయ పూర్వక ఆహ్వానం భారతి గారు ..ఆలస్యం గా చెప్తున్నాను.. ... better late than never kada.. పురాణాలని కేవలం కదల మాదిరిగా, paaraayananu కేవలం చదువుకుంటూ వెళ్ళిపోయే మాలాంటి వారికి మీ ఈ వివరణ ఎంతగానో ఉపయుక్తం ...

    రిప్లయితొలగించండి
  4. రాధా కృష్ణ ల గురించి చాలా తెలుసు కోవాలి

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుంది బాగా వివరించారు.కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగుంది బాగా వివరించారు.కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  7. Chaalaa baagundi.. Raasaleela gurinchi chakkagaa vivarinchaaru.

    రిప్లయితొలగించండి