27, జనవరి 2012, శుక్రవారం

చిన్ననాటి చిన్న జ్ఞాపకం(2)

ఓరోజు యాత్రలకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి -
ఆశ్వక్రాన్తే రధక్రాన్తే విష్ణుక్రాంతే వసుంధరా 
శిరసాధారి తాదేవి రక్షస్వమాం పదేపదే 
ఉద్ధ్రుతాసి వరహేణ కృష్ణేన శతబాహునా 
(చిన్నప్పుడు విన్నది కాబట్టి చిరు అక్షరదోషాలు వుండవచ్చు) ఈ మంత్రం పఠిస్తూ ఇద్దరు సాధువులు నదీస్నానం చేసి ఆ మట్టిని తలకు పూసుకొని ముడివేసుకోవడం చూశాను. నాకుకూడా ఈ సంసారాన్ని విడిచిపెట్టి వారిలా సన్యసించాలని వుందని మా తెలుగు మాష్టారుగారితో చెప్పగా ... 

మునులు, సాధువులు, గురువులు, పెద్దలు ఏది చేసిన దానికి బాహ్యర్ధమూ, అంతరార్ధమూ వుంటుంది.  అర్ధం గ్రహించక వారు చేశారని మనం వారు చేసినట్లు చేయడం సరికాదు. ఆ మంత్రమునకు అర్ధమేమిటంటే - 
గుఱ్ఱము యొక్క, రధం యొక్క, విష్ణువు యొక్క సంచారములను ఓర్పుచేత సహించునట్టి ఓ భూమీ, నీవు వరాహావతారమున అవతరించిన భగవంతుని చేత పాతాళంనుంచి తేబడినదానవు. నీవు శిరస్సునందు ధరింపబడినదానవై నన్ను రక్షింపుము అని.
ఈ మంత్రంను ఉచ్చారణ చేయుచు స్నానకాలమందు మృత్తుకను శిరస్సునందు ధరించవలయునని చెప్పెదరు. శిరస్సునందు మృత్తుకను ధరించి 'నను రక్షించు భూదేవి' అని ప్రార్దించినంతమాత్రమున ముక్తి కలగదు. ఈ బాహ్యార్ధంను వదిలి అంతరార్ధం ఆలోచించండి. పృథ్వి వలె మనస్సు కఠినమై విషయములకు పోవుచు అదోముఖమై వుండును. అట్టి మనస్సును ఊర్ధ్వముఖవ్యాపనం చేసి శిరస్సునందు ధరించవలయుననియు, అదియే పరబ్రహ్మప్రాప్తికి మార్గమనియు అనుభవజ్ఞులు చెప్పెదరు. అనగా మంత్రం లేదా నామం లేదా ధ్యానంలతో అంతర్ముఖమై పృధ్వీతత్వంతో సంబంధమున్న మూలదారచక్రంను జాగృతపరచి తలపై వున్న సహస్రారం వరకు పయనించి పరమాత్మను దర్శించమని అర్ధం. 
ఎటువంటి విషయవాసనలు కదలాడుతున్న, ఓపికతో దేనికీ చలించక ఓ మనసా! అదోముఖమైన నీవు, భగవన్నామముతో ఊర్ధ్వముఖమై నన్ను రక్షింపుము. 
ఇంకా ఒకటి గుర్తుంచుకోండి -
ఆధ్యాత్మిక సాధకులకు గృహస్థజీవన పరిత్యాగం తప్పనిసరియైనదిగా ఏ శాస్త్రం శాసించలేదు. గృహస్థాశ్రమం అత్యంత విశిష్టమైనది. గృహస్థునిగా తన విధులను చక్కగా, సమర్ధవంతంగా నిర్వర్తించడం, ధర్మబద్ధమైన కర్మాచరణం చేయడం శాస్త్రసమ్మతం. ఆధ్యాత్మికసాధన అంతరంగానికి సంబంధించింది. అది మనస్సులోనే జరగాలి. సాధనకు గృహమో అడవో అడ్డు కాదు. నీ మనస్సే అడ్డు. సంసారమును విడిస్తే సన్యాసివికావు, మనస్సును వదిలేస్తే సన్యాసివవుతావు. అప్పుడు నీవు సంసారంలో వున్నా సాధువ్వే. తలకు మట్టిపూసుకొని కాషాయదుస్తులు ధరించి తిరగడం కాదు సన్యాసమంటే. వ్యక్తిభావనను, విషయవాసనలను పరిత్యజించడమే నిజమైన సన్యాసం. ఆధ్యాత్మిక సాధనకు మన వృత్తిగాని, కర్తవ్యాలు గాని అడ్డుకాదు. మన మనస్సే అవరోధం. వివేకి అయిన గృహస్థుడు ఈ బంధాలు, బాధ్యతలు జన్మ ప్రారబ్ధసారంగా వచ్చినవే అన్న భావనతో తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, ఇవన్నీ భగవంతుడు తనకప్పజెప్పిన పనులని భావిస్తూ, తన కర్తవ్య నిర్వహణను ఫలాసక్తి లేకుండా నిర్వహిస్తూ పారమార్ధిక సాధనను అవలంబించి తరిస్తాడు....
అంటూ మాష్టారుగారు చాలా వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి