14, జనవరి 2012, శనివారం

చిన్ననాటి చిన్నిజ్ఞాపకం


మా తాతయ్యగారి ఇంటికి  ఆరిల్లు అవతల ఓ బ్రాహ్మణకుటుంబం వుండేది. అతను రిటైర్డ్ తెలుగుమాస్టర్. అతనికి ఎనమండుగురు సంతానం. వారి అయిదవ అమ్మాయి 'లావణ్య' నేనూ మంచిస్నేహితులం, కల్సి చదువుకున్నాం. నేను  నా పెళ్లైనంతవరకు వాళ్ళ ఇంటిలోనే ఎక్కువ వుండేదానిని. చింతపిక్కలాట, తొక్కుడుబిళ్ల, అష్టాచెమ్మా, దాడాట.... ఓహో.....అన్నీ అక్కడే. పుస్తకాభిరుచి ఆయన చలవే. ఆ అత్తయ్యగార్కి(మాస్టర్ గారి భార్య) కాశీకి వెళ్ళాలన్నది పెద్ద కోరిక. మాస్టర్ గారు ఆమె కోరికను ఏదో ఒకటి చెప్పి వాయిదా వేసేసేవారు... అందుకు వారి ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రముగా వుండడమే. కాకపొతే ఆయనమాటల్లో యదార్ధముండేది. ఆయన మహాపండితులు. రావిచెట్టుబండ దగ్గర ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను చెప్పడం ఆయన దినచర్య. 
అసలు విషయంకు వస్తాను......  
ఆమె కాశీ వెళ్ళాలీ, గంగా స్నానం చేసి మోక్షం పొందాలని అన్నప్పుడు అత్తయ్యగారితో ఆయనేమనేవారంటే....
ఓసీ, అమాయకురాలా! నీవూ మరీ సత్తెకాలపు మనిషిలా వున్నావే...... అంటూ ఓ  శ్లోకం చదివి వివరణ ఇచ్చారు. నాకు గుర్తున్నంతవరకు చెప్తాను కానీ, ఆ శ్లోకంలో ఒకటిరెండు అక్షరదోషాలుండొచ్చు. ఎప్పుడో  నా పదహారోయేటా విన్నవి. మన్నించాలి మరి.

"అకార్య కార్యవకీర్ణీస్తేనే భ్రూణ హా గురు తల్పగః 
మరుణో పా మాఘ మర్షణస్తస్మాత్పాపాత్ర్ప ముచ్యతే" 

భావం: జలంనందు స్నానం చేసినచో కూడనిపని చేసినవాడను, వ్రతభ్రష్టుడును, దొంగవాడును, గర్భంలోని శిశువును చంపినవాడును, ఎట్టి మహాపాపం చేసినవాడును,ఆయా పాపములనుండి విడువబడుచున్నాడు. అనగా ఎట్టి మహాపాపము చేసినవారైనను గంగాది మహా తీర్ధములయందు స్నానం చేసినచో పాపరహితుడగును. 
ఇలా అయితే కొంత డబ్బు పట్టుకొని కాశీకి వెళ్తే మోక్షం వచ్చేస్తుందని అందరూ అక్కడకే వెళ్ళండి అని చెప్పేయవచ్చు. అప్పుడు సాధనలు, తపస్సులు, వేద అధ్యయానాలు అవసరం లేదుకదా. అందుకే కేవలం బాహ్యార్ధం చూడకూడదు. అంతరార్ధం గ్రహించాలి. సద్గురు ప్రసాద తీర్ధమనెడు బ్రహ్మానంద సముద్రమునందు స్నానం చేసిన ముక్తి కలుగునుగాని కాశీరామేశ్వరములు తిరిగిన ముక్తి లేదు. అంటే కాశీరామేశ్వరములు వెళ్ళకూడదని కాదు,  వెళ్ళినచో ఆ తీర్ధవిశేషాలుతో పాటు పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యఫలం అనుభవమైనతర్వత జననమరణాలు తప్పవు. అంతే తప్ప ముక్తి రాదు అని ఆయన వివరించారు. 
ఇలా ఎన్నో చెప్పేవారు...... కానీ నేర్చుకోవాలన్న జిజ్ఞాస లేకపోవడం, వాటివిలువ అప్పటిలో తెలుసుకునే తెలివిలేకపోవడం చాలా మర్చిపోయాను. 
ఒకసారి లావణ్య అడిగింది కాశీకి వెళ్దాము నాన్నఅని. అప్పుడు ఆయనేమన్నారంటే - 

"భూప్రదిక్షణ షట్క్ న కాశీయాత్రా యుతేనచ, సేతుశ్నాన శోతైర్యశ్చ తత్పలం మాతృవందనే "

భావం: ఆరుమార్లు భూప్రదక్షణ చేసిన, పదివేలసార్లు కాశీయాత్ర చేసినా, అనేక వందమార్లు సముద్రస్నానం చేసిన వచ్చే పలితం కంటే తల్లిని ఓ మారు నమస్కరిస్తే ఎక్కువ పలమొస్తుందని అనేవారు. 
వెంటనే అత్తగారు 'మా ఆయన బంగారం, బుర్రనిండా తెలివే, తడుముకోకుండా, తడబడకుండ టకీమని దేనికైనా జావాబు చెప్పేస్తారు', అని  మురిపంగా దూరమునుండే చేతులు ఆయన చుట్టూ తిప్పేసి తలకి నొక్కుకునేవారు. మెటికలు విరిగాయనుకోండి...... ఇంటి దిష్టి, ఇరుగుపొరుగు దిష్టి, వూరూవాడా దిష్టి పోవాలని అనేవారు. ఉప్పు,మిరపకాయలతో దిష్టి తీయడం , కట్టెలపొయ్యిలో వేయడం, మేమందరం దగ్గుతో ఉక్కిరిబిక్కిరి ...... ఆపై నవ్వుకోవడం బాగా నాకు జ్ఞాపకం.

13 కామెంట్‌లు:

  1. చాలా చక్కని పద్యాలు.. వాటికి భావాలు రాసారు... ధన్యవాదాలు భారతి గారు...
    మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  2. సాయి గారు, ధన్యవాదాలండి. మీకూ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి. మీకు నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుందండి. మీకు నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. @ జయగారు,
    ధన్యవాదాలండి. మీకూ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
    @ లాస్యగారు,
    ధన్యవాదాలండి. మీకూ, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

    రిప్లయితొలగించండి
  6. మాలా కుమార్ గారు,
    ధన్యవాదాలండి. మీకూ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. భారతి గారు, మీ తెలుగు చాలా బావుంది , ఈ మధ్య కాలంలో ఇలా కమ్మటి తెలుగు పద జాలము చూడలేదు! మీ 'చిన్ననాటి చిన్న జ్ఞాపకం' బావుంది. కథలోని తెలుగు మాస్టర్ నాకు ఎప్పటికి గుర్తుంటారు!

    రిప్లయితొలగించండి
  8. తెలుగు అభిమాని గారు,
    ధన్యవాదాలండి....!

    రిప్లయితొలగించండి
  9. కాశీ క్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన గంగా|
    భక్తిఃశ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః|
    విశ్వేశోయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా|
    దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్ కిమస్తి|
    మన శరీరమే కాశీ క్షేత్రం. జ్ఞానమే మూడు లోకాలలో వ్యాపించిన గంగానది. మన భక్తిశ్రద్ధలే గయాక్షేత్రం. మన గురు చరణ ధ్యాన యోగమే ప్రయాగాతీర్థం. సకల జనుల మనస్సాక్షి భూతంగా మనలోని సమాధ్యవస్థాతత్త్వమైఉన్న ఆత్మయే కాశీ విశ్వేశ్వరుడు. ఈ విధంగా మన శరీరంలోనే సర్వ తీర్థాలు నెలకొని ఉండగా ఇంకా వేరే సేవింపదగ్గ పుణ్య తీర్థాలు ఏముంటాయి.

    రిప్లయితొలగించండి
  10. పండితుల జ్ఞాన రోచిష్షు బహుముఖములు,
    తప్పుగా జెప్పె ననవల , దా తెలివిడి
    ఆలి చిరుకోర్కె తీర్చగా మాలి , తుదకు
    మాయ జేయుట కవసరమయ్యె , విహిత !

    రిప్లయితొలగించండి
  11. ముందుగా వారాహి పురదేవతకు మ్రొక్కి
    డుంఠివిఘ్నేశు చోటు ప్రణుతించి
    కరుణా తరంగిణి గంగలో క్రుంకుడి
    అన్నపూర్ణకు మ్రొక్కు విన్నవించి
    కాశికా విశ్వేశు కభిషేక మొనరించి
    ఘనవిశాలాక్షికి కరము మొగిడి
    గంగా మహాతల్లి కమనీయ హారతుల్
    కనులార గాంచి సద్గతి వహించి

    భారతావని పుణ్యఫలమై యెసంగు
    వారణాసిని దర్శించ వరలు గాని
    ఊరకే మోక్షపథములు యొనర నగునె ?
    అంత ఘనులమా మనము , రవ్వంత కనుడు .

    రిప్లయితొలగించండి